Telugu News

హామీలకే పరిమితం… ఆచరణ శూన్యం: పొంగులేటి

మాట ఇవ్వడం... మర్చిపోవడం కేసీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

0

హామీలకే పరిమితం… ఆచరణ శూన్యం

== మాట ఇవ్వడం… మర్చిపోవడం కేసీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

== రాష్ట్ర ప్రభుత్వం ముంపుకి గురైన ప్రాంతాలను విస్మరించింది

==  రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు

==  కొత్తగూడెం పర్యటనలో ప్రభుత్వంపై మండిపడిన  పొంగులేటి శ్రీనివాస రెడ్డి

(కొత్తగూడెం-విజయంన్యూస్):

 మాట ఇవ్వడం… మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యమని, తప్పుడు హామీలతో జనాన్ని మెప్పించడం తప్ప ఏ పని కార్యచరణ దాల్చలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొత్తగూడెం పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. తొలుత ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా నియమితులైన తరువాత తొలిసారిగా కొత్తగూడెం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా పాతబస్తీ సెంటర్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు పొంగులేటి అభిమానులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

జై కాంగ్రెస్ జై పొంగులేటి నినాదాలతో ఆ ప్రాంతమంతా హెూరెత్తింది. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి సుమారు వందకు పైగా కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా చుంచుపల్లి మండలం విద్యానగర్ లో ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపుకి గురైన ప్రాంతాలను విస్మరించిందని, గడిచిన కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు కి గురై వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలలో వరద ఉధృతికి అనేక ప్రాంతాలు ముంపుకి గురయ్యాయన్నారు.

ఇది కూడా చదవండి:- కేటీఆర్ నోరు జాగ్రత్త: భట్టి విక్రమార్క

తెలంగాణ ఏర్పడితే ముంపుకి గురయ్యే ప్రాంతాలన్నిటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూసిన ప్రజలకు నిరాశ ఎదురయిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గత సంవత్సరం గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలంలో పర్యటించిన ముఖ్యమంత్రి గోదావరికి రెండు పక్కల ఉన్న కరకట్టలను ఎత్తును పెంచి వచ్చే ఏడాది కల్లా శాశ్వత పరిష్కారం చేపడతామని వెయ్యి కోట్లు ప్రకటించి సంవత్సరం దాటినప్పటికి ఆర్థికపరమైన జీవోలు గానీ ఎస్టిమేషన్లు గానీ టెండర్ల పిలుపులు గానీ ఎటువంటివి జరగలేదని చివరికి ఒక గంప మట్టి కూడా పోయలేదని ధ్వజమెత్తారు. నివాసయోగ్యమైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి పక్కా ఇల్లు ఇస్తామని మాట ఇచ్చి ఇంత వరకు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఏ క్షణాన వరదలు వస్తాయో అని గుండె చేత పట్టుకొని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచల రామాలయం అభివృద్ధికి 100 కోట్లు, గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురవకుండా 1000 కోట్లు, ఖమ్మంలో తీగల వంతెన కడతామని 220 కోట్లు ప్రకటించారే తప్ప ఒక్క రూపాయి నిధులను విడుదల చేసింది లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం పాలేరు మధ్యలో ఉన్న మున్నేరు మీద రిటర్నింగ్ వాల్స్ కోసం 150 కోట్లుతో నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సొంత రాష్ట్రం లో ఉన్న సమస్యలు తీర్చకుండా పక్క రాష్ట్రాలపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపెడతామన్నారు.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ వి పిట్టల దొర కథలు: పొంగులేటి

ఈ కార్యక్రమాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, బొర్రా రాజశేఖర్, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బాణోతు విజయబాయి,  యడవల్లి కృష్ణ, నాగ సీతారాములు, వూకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, మల్లిఖార్జున్, కాంగ్రెస్ శ్రేణులు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.