మద్యం కిక్కు.. ఎవరికో లక్కు
== మద్యం షాపులకు టెండర్ల షెడ్యూల్ రిలీజ్
== ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల
== అదే రోజు నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం
== ఈనెల 21న లాటరీ ప్రక్రీయ
== ఖమ్మంలో 122, భద్రాద్రికొత్తగూడెంలో 89 దుకాణాలకు టెండర్
== రెండేళ్లకోక్కసారి టెండర్ ..ప్రభుత్వానికి భారీగా ఆధాయం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రకటన వచ్చేసింది.. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆధాయాన్ని అందించేందుకు.. వ్యాపారులందరికి కిక్కునిచ్చే ప్రకటన రానే వచ్చింది.. అదేనండీ మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేందుకు గాను షెడ్యూల్ వచ్చేసింది.. బుధవారం తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్క సారి టెండర్లకు అహ్వనిస్తున్న అబ్కారీ శాఖ డిసెంబర్ లో దుకాణాలను అప్పగించే ప్రక్రీయను ఏర్పాటు చేస్తుంది. అయితే డిసెంబర్ మాసంలో ఎన్నికలు వచ్చేఅవకాశం ఉండటంతో తెలంగాణ అబ్కారీ శాఖ ముందుగానే ప్రక్రీయను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ4 రిటైల్ వైన్స్ షాపులకు ఈ ప్రక్రీయను ప్రారంభించనుంది. మొత్తం సెప్టెంబర్ మాసంలో పూర్తి చేసి, డిసెంబర్ 1 తారీఖున లైసెన్స్ దారులకు వైన్స్ షాపులను అప్పగించనుంది.
ఇది కూడా చదవండి: రేపటి నుంచే రైతు రుణమాఫీ
ఈ మేరకు అబ్కారీ శాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సారి అదృష్టం వరించనవారు, తృటిలో తప్పిన వారు.. వ్యాపారంపై మక్కువ ఉన్నవారు లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్దమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అబ్కారీ శాఖ ఏ4 రిటైల్ షాపులకు 2023-25 సంవత్సరానికి గాను లైసెన్స్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా ప్రక్రీయను కొనసాగించాలని రాష్ట్ర అబ్కారీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. 2023-25 సంవత్సరాలకు ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ లపై ప్రక్రియపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2023-25 నకు గాను షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లు గౌడ, ఎస్సి, ఎస్టీలకు కేటాయించే షాపుల లాటరీలు తీయాలన్నారు. ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని ఆమె అన్నారు.
== షెడ్యూల్ ఇలా..
ఈనెల 3న జిల్లాలో ఉన్న వైన్స్ షాపులకు రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది. ఈ నెల 4 న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నుండి ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పని దినాలలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. లైసెన్సుల లాటరీ ప్రక్రియ ఈ నెల 21న చేపట్టనున్నారు. ఏ4 రిటైల్ షాపులకు ఎక్సైజ్ ట్యాక్స్ మొదటి వాయిదా మొత్తం ఈ నెల 21, 22 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుండి కొత్త షాపులకు స్టాక్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1 నుండి షాపులు ప్రారంభం కానున్నట్లు అబ్కారీ శాఖాధికారులు తెలిపారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఇది కూడా చదవండి: నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?
== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 211 వైన్స్ షాపులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 211 ఏ4 షాపులు ఉన్నట్లుగా అబ్కారీశాఖాధికారులు తెలిపారు. అందులో ఖమ్మం జిల్లాలో 122, భద్రాద్రికొత్తగూడెంలో 89 షాపులు ఉన్నట్లు తెలిపారు. అందులో 36 షాపులు ఏజెన్సీ పరిధిలో ఉంటాయని, ఖమ్మం జిల్లాలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30 ఏజెన్సీ షాపులు ఉంటాయని తెలిపారు. ఈ షాపులకు ఏజెన్సీ నిబంధనల ప్రకారం మద్యం షాపులను నిర్వహించుకునేందుకు గ్రామ పంచాయతీల తీర్మాణం అనంతరం ఏజెన్సీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎన్ని వైన్స్ షాపులకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయనేది నోటిఫికేషన్ రోజున మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో 122 షాపులకు గాను 18 గౌడలకు, 14 ఎస్సీలకు, 8 ఎస్టీలకు, 82 జనరల్ వాళ్లకు కేటాయించినట్లు కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.
== నేడు రిజర్వేషన్ల కు లాటరీ
తెలంగాణ అబ్కారీ శాఖ ఆధేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వైన్స్ షాపులను లాటరీ ద్వారా ఆయా షాపులను కేటాయించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 211 దుకాణాలకు గాను గౌడ, ఎస్సీ,ఎస్టీ, జనరల్ కు కేటాయించాల్సిన వైన్స్ షాపులకు రేపు ఆయా జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ తీయనున్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే ఈ దుకాణాలను ముందుగా లాటరీ తీసి ఆ తరువాత మిగిలిన షాపులను జనరల్ కు కేటాయించనున్నారు. గౌడ, ఎస్సి, ఎస్టీ లకు షాపుల కేటాయింపుకు గురువారం లాటరీ ప్రక్రియ, షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ అంతయూ పారదర్శకంగా చేపట్టి, పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదికూడా చదవండి: హామీలకే పరిమితం… ఆచరణ శూన్యం: పొంగులేటి
== 2021-23లో 11వేల దరఖాస్తులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 211 ఏ4 వైన్స్ షాపులు ఉండగా, 2021-23 సంవత్సరంకు గాను లైసెన్స్ ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం సుమారు 11వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో ఖమ్మం జిల్లాలో 6వేల దరఖాస్తులు రాగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు సుమారు 5వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 11వేల దరఖాస్తులకు ఒక్కోక్క దరఖాస్తుకు రూ.2లక్షలు చెల్లించాల్సి ఉండగా, మొత్తం 22లక్షల ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆధాయం వచ్చినట్లైంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైన్స్ ద్వారా ప్రతి ఏడాది రూ.2200 కోట్ల ఆధాయం వస్తున్నట్లుగా అబ్కారీ శాఖాధికారులు చెబుతున్నారు. 2021-22కు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.2,029 కోట్ల ఆదాయం రాగా, 2022-23 సంవత్సరానికి రూ.2,271 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్లు అబ్కారీశాఖ చెబుతోంది. ఈ ఏఢాద ఏప్రిల్ నుంచి నేటి వరకు సుమారు రూ.742 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మొత్తం ఎన్నికల ఈయర్ కావడంతో భారీగా మద్యం అమ్ముడు పోయే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో..?