రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి
సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించిన మంత్రి పువ్వాడ..
రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి
== సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించిన మంత్రి పువ్వాడ..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రైతు పంట రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంట రుణమాఫీ పై చేపట్టిన ప్రత్యేక జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం రుణమాఫీ చేపట్టిందని అన్నారు. 1 ఏప్రిల్, 2014 నుండి 11 డిసెంబర్, 2018 వరకు మంజూరు చేయబడిన/పునరుద్ధరణ పంట రుణాలు రుణమాఫీకి అర్హమని ఆయన తెలిపారు. డిసెంబర్ 11, 2018 నాటికి బకాయి మొత్తం పరిగణిస్తారని, ఒక కుటుంబానికి ఒక లక్ష వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు. జిల్లాలోని 3 లక్షల 41 వేల 23 మంది రైతులకు ఈ పంట రుణమాఫీ అందుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మొదటి విడత క్రింద రూ. 25 వేల రుణం వరకు 20891 మంది రైతులకు రూ. 26.759 కోట్లు, రెండో విడత క్రింద రూ.25 వేల నుండి రూ. 50 వేల మధ్య గల 19443 మంది రైతులకు రూ. 66.43 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. మూడో విడత క్రింద రూ. లక్షా పది వేల వరకు రుణం ఉన్న 53222 మంది రైతులకు రూ 297.251 కోట్లు అందించినట్లు మంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి
డిబిటి క్రింద ఫెయిల్ అయి పంట రుణమాఫీ అందని కేసులు 582 ఉన్నట్లు, వీరి జాబితాను తీసుకొని సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. పంట రుణమాఫీ విషయమై సమాచారం రాని రైతులు, సంబంధిత క్లస్టర్ రైతువేదికలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు కారణం తెలుసుకొని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. లక్షకు పైగా రుణం ఉన్నవారికి లక్ష రూపాయల పంట రుణమాఫీ అవుతుందని ఆయన తెలిపారు. సంబంధిత శాఖలచే సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, సమస్యలు ఉంటే పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా రైతులకు ప్రభుత్వం రైతు బందు ఇస్తుందని, అందుచేత బ్యాంక్ లు క్రొత్త పంట ఋణాలివ్వాలని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, వ్యవసాయ, సహకార శాఖలు క్రియాశీలక పాత్ర పోషించాలని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ప్రత్యేక సమస్యలతో రైతులకు పంట రుణమాఫీ అందడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. బ్యాంకర్లు ఏ రైతుకు పంట రుణమాఫీ అందజేశారో జాబితా కలెక్టర్, వ్యవసాయ శాఖకు సమర్పించాలన్నారు. వృద్దాప్య పెన్షన్లు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను బ్యాంకర్లు ఆపవద్దని, మానవతా దృక్పథంతో ఉన్న సమస్యగా అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?
ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ.. పంట రుణమాఫీ పై అవగాహన కల్పించాలన్నారు. రైతు వేడుకల్లో రుణమాఫీ జాబితా ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, వ్యవసాయ అధికారులు, రైతులకు పంట రుణమాఫీ పై అవగాహన కల్పిస్తామన్నారు. పంట రుణమాఫీ నిధులను పంపిణీ చేయడానికి ఆధార్ నెంబర్ల ద్వారా రైతుబంధు ఖాతాలను గుర్తించడం, బ్యాంకులు, ఎన్పిసిఐ సహాకారంతో రైతులకు అందేలా చూడడం చేస్తామన్నారు.
వ్యవసాయ, సహకార, బ్యాంకింగ్ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రక్రియ పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, LDM శ్రీనివాస రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, జిల్లా సహకార అధికారిణి విజయ కుమారి, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, బ్యాంకింగ్ కంట్రోలర్లు, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.