రైతు బంధు జిల్లా కమిటీకి మందడపు రాజీనామ
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మలకు రాజీనామ అందజేత
– పొంగులేటి శీనన్న బాటలో కొనసాగుతానని వెల్లడి
(ఖమ్మం-విజయంన్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతుబంధు జిల్లా కమిటీ సభ్యత్వానికి రాజీనామ చేసినట్లు మందడపు తిరుమలరావు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయ నిర్మలకు తన రాజీనామ పత్రాన్ని బుధవారం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన వర్గంలో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఆసరా కల్పించకపోవడం, సాగునీటి సరఫరాలో విఫలం, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సీడి అందించడంలో నిర్లక్ష్యం, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రైతులకు సరైన న్యాయం చేయలేని ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామ చేసినట్లు వివరించారు. సబ్బండ వర్గాల ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాటలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తిరుమలరావు తెలిపారు.
ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి