Telugu News

గోదావరిని తోడేస్తున్న ఇసుక తోడేళ్లు..

అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు.

0
గోదావరిని తోడేస్తున్న ఇసుకాసురులు.
★ అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు.
★ చేసేదంతా జీరో దందా నే.
★ ఒకే డిడి తో రెండు, మూడు ట్రిప్పులు.
★ రాష్ట్ర ఖజానా భకాసురుల పాలు…
★ అధికలోళ్ళతో రోడ్లెక్కుతున్న లారీలు.
★ టిఎస్ఎండిసి మైనింగ్ అధికారుల అవినీతి లీలలు…?
నిఘా విభాగం,అక్టోబర్07, (విజయం న్యూస్)
“మేమింతే.. మారమంతే” అన్న చందంగా ఇసుక క్వారీల గుత్తేదారులు రెచ్చిపోతున్నారు. అవినీతి అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలపడంతో వందల కొద్ది కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా వారి ఖాతాల్లో వేసుకుంటున్నారు. విజిలెన్స్ నిఘా విభాగాలు ఏవి వీరి అక్రమ దందాను అరికట్టలేకపోతున్నాయి. దీంతో సహజ సంపద అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని పినపాక మండలం లో గల గోదావరి నది ఇసుక మాఫియా కు అడ్డాగా మారింది. ఇసుక మేటలు తొలగించాలని అనుమతులు పొందిన బినామీ కాంట్రాక్టర్లు హద్దులు మీరుతున్నారు ఎవరి ఇష్టానుసారంగా వారు గోదావరి నదిని తోడేస్తూ భారీ యంత్రాలతో అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్, ఖనిజ, అభివృద్ధి శాఖ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ.. సరిహద్దులు దాటి ఇసుకను తోడేస్తున్నారు. రాత్రి వేళల్లో చీకటి వ్యాపారాలకు తెరలేపుతూ సహజ సంపదను దోపిడీ దొంగల దోచుకుపోతున్నారు, సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని వీరి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం లోని సొసైటీ సభ్యులను మభ్యపెడుతూ కోట్ల సంపాద కొల్లగొడుతున్నారు.
== అర్ధరాత్రి అక్రమ దందా…    
 టిఎస్ఎండిసి మైనింగ్ శాఖ ఆదేశాల మేరకు సొసైటీ క్వార్యులకు ఉపాధి కల్పించేందుకు సొసైటీ సభ్యులకు పూర్తి అనుమతులు ఉన్నాయి కానీ బినామీ కాంట్రాక్టర్లు సొసైటీ సభ్యులను వారి కదంబ హస్తాలలో బిగించి ఉపాధిని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక క్వారీలా సరిహద్దులను నిర్ణయించిన అధికారులు గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది కానీ జానంపేట, సజ్జత్ పల్లి గ్రామాలలో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు అర్ధరాత్రి భారీ యంత్ర పరికరాలతో గోదావరి నదిని తోడేస్తూ గిరిజనుల ఉపాధిని కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారం అంతా అర్ధరాత్రిలో జరుగుతుందని తెలిసినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు అంతేకాక రాత్రుల్లో కొన్ని వాహనాలు చెక్పోస్టులు వద్దా డీడీలు లేకపోయినా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇసుక క్వారీల్లో మెగా నేత్రాలు లేకపోవడంతో బరువును నిర్ధారించే కాటాలు ఉండకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించిన బరువు కంటే అధిక సామర్థ్యంతో లారీలు రోడ్లెక్కుతున్నాయి. ఇదంతా జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యంతోనే వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.
== ఒకే డిడి పై రెండు,మూడు ట్రిప్పులు…                    
ఇసుక క్వారీలలో నిత్యం జీరో దందా విచ్చలవిడిగా సాగుతుంది ఓకే డి డి తో రెండు లేక మూడు ట్రిప్పులు వేస్తూ ప్రభుత్వ ఖజానా ఎండగడుతున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో కాంట్రాక్టర్లు ఈ దందాకు రెడ్ కార్పెట్ పరుస్తూ రోజు పదులకొద్ది వాహనాలు జీరో దందాకు పాల్పడుతున్నాయి. ఉదాహరణకు పినపాక నుండి ఖమ్మం వెళ్లవలసిన ఇసుక లారీ ఖమ్మం వెళ్లకుండా  సరిహద్దుల్లో ఉన్న రహస్య ప్రదేశాల్లో  ముందుగానే ఒప్పందం చేసుకున్న దళారులకు గాని ఇసుక అన్లోడ్ చేస్తూ అదే డీడీతో మళ్లీ సంబంధిత క్వారీకి వెళ్లి రెండో ట్రిప్ లోడ్ చేసుకొని ఖమ్మం చేరుకుంటున్నాయి క్యూ లైన్ లో ఎన్ని వాహనాలు ఉన్నా ఇసుక కాంట్రాక్టర్లు మాత్రం జీరో లారీలకు అనుమతులు ఇస్తూ ముందు వరుసలో పెడుతున్నారు. ఇలా నిత్యం అదే పనిగా జీరో దందా కొనసాగుతుంది అప్పుడప్పుడు అధికారుల దాడులలో పట్టుబడిన కొద్దోకొప్పో జరిమానాలు కడుతూ తప్పించుకుంటున్నారు. ఇలా నిత్యం వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమార్కుల పాలవుతున్నా వీటిని నియంత్రించాల్సిన అధికారులు లంచావతారంతో మారి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.