Telugu News

ఖమ్మంలో నాడు దుర్వాసన..నేడు సువాసన: మంత్రి పువ్వాడ

75 ఏళ్లలో లేని  అభివృద్ధికి 7ఏళ్లలో చేసి చూపించాం

0
నాడు దుర్వాసన..నేడు సువాసన: మంత్రి పువ్వాడ
== ఖమ్మం అభివృద్ధికి ఎనలేని కీర్తి
== 75 ఏళ్లలో లేని  అభివృద్ధికి 7ఏళ్లలో చేసి చూపించాం
== ఖమ్మం రోల్ మోడల్ గా మార్చేశాం
== రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 
== ఘనంగా పట్టణ ప్రగతి దినోత్సవం
ఖమ్మం, జూన్ 16(విజయంన్యూస్):
 రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని, చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు.
ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అత్యంత దారుణమైన దుస్థితిలో సరైన రోడ్లు లేక, త్రాగునీరు రాక, ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు. ముఖ్యంగా ఖమ్మం త్రీ టౌన్ లో త్రాగునీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని దానిని నేడు శాశ్వతంగా పరిష్కరించగలిగామని గుట్టల బజార్ లో రూ. 3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల బహుబలి ట్యాంక్ తో మొత్తం గృహాలను నల్లా కనెక్షన్లు ఇచ్చి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు. సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తు, అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఖమ్మం ఒక రోల్ మోడల్ గా నిలిపామని ఆయన తెలిపారు. ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు అయి తనవంతు కర్తవ్యంగా ఖమ్మంను టైర్ సిటీస్ వరుసలో నిలుపలని దృఢంగా సంకల్పించుకున్నానని అది నేడు ఆచరణలో చేసి చూపించగలిగామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నేతృత్వంలో, పురపాలక మంత్రి కేటిఆర్ సహకారంతో నేడు ఖమ్మం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లుకు ఆదర్శంగా నిలువడం మనకు గర్వకారమన్నారు. ఖమ్మం నగరంలో ఒకప్పుడు వాటర్‌ ట్యాంకులు గల గల అంటూ తిరుగుతానే ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలతో ఉండేదని, ఇపుడు ఎక్కడ అయిన ఏ రోడ్లు చూసినా విశాలంగా ఉన్నాయని అన్నారు. రోడ్లు విస్తరించాం, ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదని, కానీ ఇప్పుడు బల్లెపల్లి, ప్రకాశ్ నగర్, అల్లిపురం, కాల్వఒడ్డునగరం నాలుగు దిక్కుల నాలుగు వైకుంఠధామాలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఖమ్మం ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్ లో పార్కులు, అందులో ఓపెన్‌ జిమ్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, త్రాగునీరు ఇలా అనేక వసతులు అందుబాటులోకి తీసుకొచ్చామని, తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్రజా అవసరాల కోసం, అభివృద్ధి కోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసిందన్నారు. నగరంలో పబ్లిక్ టాయిలెట్స్, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు, అన్ని ప్రాంతాలలో రైతు బజార్ లు, వాక్ వే లు, సెంట్రల్ లైటింగ్ లు, వైకుంఠదామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఫుట్ పాత్ లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు కోసం నూతన ఓవర్ హెడ్ టాంక్ లు, అన్ని కూడళ్ల సుందరీకరణ, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుని ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందిస్తూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించి పరిష్కరించుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారుల్ని ముందుపెట్టి, పట్టణ ప్రగతి దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రాణాలకు తెగించి, ఏమాత్రం భయపడక, పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారన్నారు. మునిసిపల్ కార్యాలయంలో సఫాయి అన్న.. సలాం అన్న.. సఫాయి అమ్మ.. సలాం అన్న.. స్లోగన్ తో విగ్రహాలు ఏర్పాటుచేసినట్లు, సఫాయి కార్మికుల సేవల గుర్తింపుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గత 5-6సంవత్సరాల్లో సఫాయి కార్మికుల వేతనాలు రెట్టింపు అయినట్లు ఆయన అన్నారు. నగరంలో 40 కోట్లతో లకారం ట్యాoక్ బండ్ అభివృద్ధి, రూ. 100 కోట్లతో గోళ్లపాడు ఛానల్ సుందరీకరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ వినూత్న మౌళిక సదుపాయాల కల్పన విభాగంలో రాష్ట్రంలో ఉత్తమ నగరంగా ఎంపిక కాబడి, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పొందనున్నదని కలెక్టర్ అన్నారు.   కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి, పిపిఈ కిట్లు పంపిణీ చేశారు. విశిష్ట సేవలు అందించిన మునిసిపల్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మునిసిపల్ కార్పొరేషన్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.      ఈ సందర్భంగా మంత్రి, మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సఫాయి అన్న సలాం అన్న.. సఫాయి అమ్మ సలాం అమ్మ.. స్లోగన్, విగ్రహాలను ఆవిష్కరించారు. క్రొత్త పారిశుద్ధ్య వాహనాలు, ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించారు. కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్టేట్ ఛాంబర్, గెస్ట్ రూంలు, రిక్రియేషన్ రూంలకు ప్రారంభోత్సవం చేశారు. జాతీయ పతాకావిష్కరణ గావించారు.  అంతకుముందు మంత్రి, కలెక్టర్ తో కలిసి అవతరణ ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఎస్ఆర్&బిజీఎన్ఆర్ కళాశాల మైదానం నుండి నూతన మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ సిబ్బంది చే భారీ సంఖ్యలో చేపట్టిన వాహనాల ర్యాలీ ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, డిఇ రంగారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.