పీకల్లోతు అప్పుల ఊబిలోకి నెట్టిన మోదీ: నామా
== దేశం అప్పు రూ.155.8 లక్షల కోట్లు
== విదేశీ అప్పు రూ.7.03 లక్షల కోట్లు
== ఇదేనా ఆర్ధిక క్రమశిక్షణ అంటే ?
== బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం
ఖమ్మం, మార్చి 20(విజయంన్యూస్):
మోదీ పాలనలో దేశం పీకల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి తానడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. తన సమాధానంలో కేంద్ర మంత్రి కేంద్రం అప్పులను వివరించారని అన్నారు. కేంద్ర మంత్రి వివరణ చూస్తే దేశాన్ని ఏ స్ధాయిలో అప్పుల కుప్పగా మార్చారో స్పష్టమవుతుందన్నారు. ఇంతస్థాయిలో ఏ ప్రధాని ఇంత పెద్ద మొత్తంలో గతంలో అప్పు చేయలేదని నామ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు:నామ
మార్చి 31, 2023 నాటికి భారత దేశం మొత్తం అప్పు రూ.155.8 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తాజాగా స్పష్టం చేశారని నామ చెప్పారు. దీనిని బట్టి చూస్తే దేశం పరిస్థితి ఇట్టే అర్ధమవుతుందన్నారు. అందులో విదేశీ రుణం రూ. 7.03 లక్షల కోట్ల వరకు ఉండడం దారుణమన్నారు. ఈ లెక్కలు చూస్తే దేశం ఎటుపోతుందో ఆందోళనగా ఉందన్నారు. వివిధ ఆర్ధిక సంస్ధలు,ఏజెన్సీలు, విదేశాల నుంచి భారీ ఎత్తున అందినకాడికి అప్పులు గుంజుకువచ్చారని అన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం నిందలు మోపుతుందన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ గురించి మాట్లాడే ప్రధాని దేశాన్ని దివాలా తీయించేలా అప్పులు ఎలా చేశారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పరిమితికి మించి చేసిన అప్పులు వల్ల ప్రతి ఒక్క పౌరుడిపైనా మోయలేని భారం పడుతుందన్నారు. మోడీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి, దేశాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు.మోదీ చేసిన అప్పులు చూస్తే భయమేస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ కు ఈ అప్పులు మరింత భారం అవుతాయన్నారు. దీన్ని చూస్తే ఇండియా మరో శ్రీలంక అవుతుందా? అన్న అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కాగ్ హెచ్చరించినా ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పోటీ పడి చేస్తున్న అప్పులు దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు జీడీపీ వృద్ధిరేటు అనుగుణంగా పోటీపడి అప్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరమన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర
మరో వైపు దేశ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని అన్నారు. తెస్తున్న అప్పుల డబ్బుంతా ఎటు పోతుందన్నారు. మన కళ్ల ముందు శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలిన సంగతి తెలిసిందేనని అన్నారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి, ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని అన్నారు. ఇంకో వైపు డాలర్ మారకం విలువ రోజు రోజుకు దిగజారిపోతుందని ఆవేధన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులు సద్వినియోగం కాకపోతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుందని నామ పేర్కొన్నారు.