Telugu News

నైతిక విజయం మాదే.

** ఓటర్లను ప్రలోబాలకు గురిచేశారు..భయపెట్టారు

0

నైతిక విజయం మాదే
** ఓటర్లను ప్రలోబాలకు గురిచేశారు..భయపెట్టారు
** ఖమ్మంలో జరిగిన పోలింగ్ అనైతికం
** అయినప్పటికి కాంగ్రెస్ కు భారీగా ఓటింగ్ వచ్చింది
** సవాల్ చేసి ముచ్చెమటలు పుట్టించాం
** కాంగ్రెస్ పార్టీన ఆపడం ఎవరి తరం కాదు
** ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంధి
** కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులందరికి, సహాకరించినవారందరికి ధన్యవాదాలు
విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైన అనంతరం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 96 ఓట్లు మాత్రమేనని, కానీ ఫలితాల్లో మాకు వచ్చింది 242 ఓట్లు అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసినట్లుగా భావిస్తున్నారని, అయితే ఇది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమేనని అన్నారు. సంఖ్యాపరంగా వారు గెలిచి ఉండోచ్చేమో కానీ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించి నిలబడి కోట్లాడి గెలిచిందని, నైతికంగా విజయం సాధించామని తెలిపారు.

ఒక్కసారి ఖమ్మం పోలింగ్ కేంద్రంలో ఈనెల 10న జరిగిన పోలింగ్ చూస్తే చాలా దారుణమని, ఇలాంటి ఎన్నిక నేనేప్పుడు చూడలేదన్నారు. ఎమ్మెల్సీగా నేను స్థానిక సంస్థలో పోటీ చేసి గెలిచానని, కానీ ఇలాంటి దుర్మార్గమైన రీతిలో వ్యవహరించలేదని అన్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు హుందాగా ఉండేవారని అన్నారు. ఇప్పుడు ఓటర్లకు తాగుడు పోయించి డ్యాన్సులు వేయించి, బెదిరించి, భయపెట్టి, పక్కనుండి పోలింగ్ కేంద్రంలో కుర్చిలేచుకుని కుర్చోని ఓట్లు వేయించడమంటే ఎంత బాధ్యత రహిత్యమో ప్రజలే పరిశీలించాలని కోరారు. మేము కూడా క్యాంప్ కు తీసుకెళ్లామని, కానీ ఎంత బాధ్యతగా మెలిగామో మీడియా వారు, ప్రజలందరు చూశారని తెలిపారు. ఓటర్లకు డబ్బులిచ్చి, బెదిరించి, భయపెట్టి దగ్గరుండి ఓట్లు వేయిస్తే ఆ మాత్రం ఓటింగ్ వచ్చిందన్నారు. కండ్లు లొట్టబోయినట్లుగా చాలా తక్కువ మెజారిటీతో విజయం సాధించారని అన్నారు. అయినప్పటికి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిలు సహాజమేనన్నారు. కానీ మంత్రి స్థాయిలో, ఎమ్మెల్యేల స్థాయిలో చాలా దారుణంగా పోలింగ్ చేయడం అనైతికమని, ఈ విషయంపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అవసరమైతే రాష్ట్రపార్టీని సంప్రదించి లీగల్ గా వెళ్లేందుకు కూడా వెనకాడేది లేదన్నారు. ఇలాంటి పోలింగ్ కు స్వస్తీ చెప్పాల్సిన అవసరం ఉందని, లేదంటే ప్రజాస్వామ్యం చాలా దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
** సవాల్ చేసి ముచ్చెమటలు పట్టించాం
అతి తక్కువ ఓట్లు ఉన్నప్పటికి ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ నిలుస్తుందని, గట్టి పోటినిస్తామని ముందుగానే సవాల్ చేశామని, చెప్పినట్లుగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, రాయల నాగేశ్వరరావుకు దక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముందుగానే చెప్పామని కచ్చితంగా 200 ఓట్లకు పైగా సాధిస్తామని, అవసరమైతే గెలుస్తామని చెప్పామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని, అందుకే పరుగులు పెట్టారని అన్నారు. ఖమ్మంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్చూసి అని భట్టి జోస్యం చెప్పారు. రాబోయేది కచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ శక్తి, ఏ నాయకుడు ఆపలేడని స్పష్టం చేశారు.
** అందరికి ధన్యవాదాలు : రాయల
నాపై నమ్మకముంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇన్చార్జ్ మాణిక్యఠాగూర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రధాన నాయకులు, నాకు ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలని కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు తెలిపారు. నాకు వెనంటి ఉండి నాకు సలహాలు సూచనలు ఇచ్చిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలో వచ్చిన ఫలితం వల్ల ప్రజలపై మరోసారి విశ్వాసం ఉంచే విధంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని పార్టీలకు అతీతంగా ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తిడి చేయడం, బెదిరించడం లాంటి సంఘటనలు లేకపోతే కచ్చితంగా నేనే గెలిచేవాడినని, అయినప్పటికి గెలుపు ఓటమిలు ప్రజాస్వామ్యంలో సాధ్యమేనని అన్నారు.

ఓటమికి కుంగిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని, అనేక దఫాలుగా ఓటమిలను చూసి తిరిగి అధికారాన్ని దక్కించుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉందని అన్నారు. మాకు సహాకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసానికితగ్గట్లుగా నేను పనిచేస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కమిటీ అధ్యక్షుడు ఎం.డీ జావిద్, వివిధ సంఘాల జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్, పుచ్చకాయల వీరభద్రం, ఎడ్లపల్లి సంతోష్, దొడ్డ సౌజన్య, ఉదయ్, మాజీ కార్పోరేటర్ బాలగంగాధర్ తిలక్, గంగరాజుయాదవ్, హుస్సెన్, మహిళ రాష్ర్ట ఉపాధ్యాక్షురాలు మాదవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

also read :- హై స్పీడ్ ఓవర్ లోడ్ తో వస్తున్న కంకర లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన సిర్పూర్ టీ గ్రామస్తుల