Telugu News

తెలంగాణ పై నరేంద్ర మోడీ కుట్రలు మానాలి: కూనంనేని 

రాష్ట్రంలో అధికారం కోసం వ్యవస్థల దుర్వినియోగంతో అడ్డదారులా?

0

తెలంగాణ పై నరేంద్ర మోడీ కుట్రలు మానాలి: కూనంనేని

== రాష్ట్రంలో అధికారం కోసం వ్యవస్థల దుర్వినియోగంతో అడ్డదారులా?

== ఆర్థిక, రాజకీయ, అనైతిక చర్యలతో ముప్పేట దాడులు సరి కాదు

== బైటి ప్రపంచానికి తెలంగాణను చీకటిలో చూపే పన్నాగం

== ఎనిమిదేళ్ళలో రూ.100 కోట్ల అప్పులు చేసిన ఘనులు తెలంగాణ నిధులు అడ్డుకుంటారా?

== చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేయండి

== కేంద్ర దుర్నీతిని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరు

== సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

(హైదరాబాద్-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, ప్రగతిని ముందుకు సాగనీయకుండా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలోని పరిపాలనను అస్థిరపరచడంతో పాటు , ప్రభుత్వాన్ని కూలద్రోసే విధంగా స్వతంత్ర, రాజ్యాంగ సంస్థలైన ఐటి, ఎన్నికల కమిషన్, గవర్నర్ వ్యవస్థలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.155 లక్షల కోట్లకు చేరిందని, ఎనిమిదేళ్ళలో రూ.100 లక్షల కోట్ల అప్పులు అదనంగా చేసిన ఘనులు ఎఫ్ పేరుతో తెలంగాణకు ఆంక్షలు పెడుతూ ఆర్థిక దిగ్భంధనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: పాలేరు లో పోటీ చేయడం ఖాయం : తుమ్మల 

తమ చేతుల్లోని వ్యవస్థలతోరాష్ట్రంపై ఆర్థిక, రాజకీయ, అనైతిక పద్ధతుల్లో కేంద్రం ముప్పేట దాడి చేస్తోందన్నారు. తద్వారా తెలంగాణలో అస్థిర పరిస్థితుల ఉన్నాయని బైటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అసలు విభజన హామీలే అమలు చేయని బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇచ్చి, అభివృద్ధి చేసి ప్రజల మనసులు చూరగొనాలే తప్ప కుయుక్తులతో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒకవైపు రాష్ట్రం స్వంత వనరులతో ముందుకు సాగుతోంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణకు వివిధ రూపాలలో రావాల్సిన రూ.50 వేల కోట్ల వరకు నిధులకు మోకాలడ్డుతూ ఆర్థిక దాడి పాల్పొడుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్, పదహారవ ప్రణాళిక సంఘం చేసిన సిఫార్సులను తుంగలో తొకి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేస్తామనుకున్న అంచనాలను ఓటర్లు పటాపంచలు కావడంతో బిజెపి జీర్ణించుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో తన చేతిలోని ఈడి, ఐటిలను దుర్వినియోగం చేయడం, గవర్నర్ ద్వారా ఇబ్బందులు సృష్టించడం ద్వారా రాజకీయ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరో వైపు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మఠాధిపతులతో ఎంఎల్ కొనుగోలు చేసే అనైతిక పద్ధతులకు పాల్పడుతోందన్నారు. పాద యాత్రల పేరుతో బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలంగాణను తప్పుడు కోణంలో చూపే ప్రయత్నాలేనని కూనంనేని అన్నారు. తక్షణమే తెలంగాణకు రావాల్సిన జిఎస్ బకాయిల నుండి ఇతర నిధుల వరకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరిత వైఖరిని కొనసాగిస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే సమస్యే లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ కూడా కేంద్ర దుర్నీతికి వ్యతిరేకంగా కుట్రలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సంసిద్ధమవుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి: పువ్వాళ్ల దుర్గప్రసాద్