Telugu News

మంత్రి హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్..

హైదరాబాద్-విజయం న్యూస్

0

మంత్రి హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్..
(హైదరాబాద్-విజయం న్యూస్);-

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.. శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ అక్రమాల కేసుకు.. ఈ ప్లాన్‌కు లింక్‌ ఉన్నట్టు ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. గతంలో శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌లో అక్రమాలున్నాయంటూ ఫిర్యాదులు ఉన్నాయి.. ఆ ఫిర్యాదులు ఇచ్చినవారినే కిడ్నాప్‌ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఆ కిడ్నాప్‌ కేసుకు.. ప్రస్తుత హత్య కుట్ర కేసుకు లింకులు తెరపైకి వచ్చినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి, మరో ముగ్గురు కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. నేత అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే అపహరణ ఘటనలు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు అదృశ్యమయ్యారు. అయితే హైదర్‌ అలీ అనే వ్యక్తిపై ఆ ముగ్గురూ హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చూపి.. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. తాజాగా, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూర్‌ రవి ఢిల్లీలో అపహరణకు గురయ్యారు.

also read :-తెలంగాణలో ఆంధ్ర అధికారుల పెత్తనం

మహబూబ్‌నగర్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. వాటిపై కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు సహచరులతో కలిసి రవి మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చి.. సౌత్‌ అవెన్యూలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫ్లాట్‌లో ఉంటున్నారు. అక్కడి నుండి రవిని, ఇద్దరు సహచరులను, జితేందర్‌ రెడ్డి డ్రైవర్‌ను బలవంతంగా కార్లలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు.

పార్లమెంట్‌కు, రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో అపహరణ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఏడెనిమిది మంది వ్యక్తులు వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. తమవారిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని నాగరాజు భార్య గీత, యాదయ్య భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు.

also read :-బంగాళాఖాతంలో అల్పపీడనం…

కావాలనే కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. మరోవైపు, సుఫారీ గ్యాంగ్‌తో హత్యకు కుట్రపన్నిన మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేశామని సైబరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు.. మంత్రి అనుచరులతో పాటు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మంత్రి సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌ను కూడా టార్గెట్‌ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. హత్యకు రూ. 12కోట్లను ఫరూక్‌కు సుఫారీకి ప్రయత్నం చేశారని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై పేట్‌బహీరాబాద్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.. హత్య కుట్రలో భాగస్వాములైన మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌, నాగరాజుపై గతంలో హత్య కేసులు ఉన్నాయని.. ఈ ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.. నాగరాజు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి అయిన రఘును అరెస్ట్‌ చేశామంటున్నారు.. దీంతో.. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుపుకుంది.