Telugu News

తెలంగాణలో నామినేషన్ల పర్వం.

12 స్థానాలకు నామినేషన్లు వేసిన టీఆర్ఎస్.

0

తెలంగాణలో నామినేషన్ల పర్వం
 12 స్థానాలకు నామినేషన్లు వేసిన టీఆర్ఎస్
 2 స్థానాలకు నామినేషన్ వేసిన కాంగ్రెస్
 నిజామాబాద్లో ఒక స్థానానికి ఇద్దరు నామినేషన్లు
 చాలా చోట్ల స్వతంత్రులు నామినేషన్లు
 రంగారెడ్డిలో స్వల్ప ఉదృక్తత

(హైదరాబాద్‌ -విజయం న్యూస్)
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులు 12 స్థానాల్లో నామపత్రాలు సమర్పించగా.. కాంగ్రెస్‌ రెండు చోట్ల మాత్రమే పోటీలో దిగింది. పలు చోట్ల స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

నిజామాబాద్‌లో ఒక స్థానానికి ఇద్దరు నామినేన్లు వేశారు. తెరాస నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామ పత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల సంఘం నుంచి కోటగిరి శ్రీనివాసరావు నామినేషన్‌ వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు తెరాస అభ్యర్థులు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్‌లో రెండు స్థానాలకు తెరాస నుంచి భాను ప్రసాద్‌, ఎల్‌.రమణ నామినేషన్లు వేశారు. తెరాసకే చెందిన కార్పొరేటర్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు.

నల్గొండ జిల్లాలో తెరాస నుంచి కోటిరెడ్డి, స్వతంత్రులు 10 మంది, ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో దండె విఠల్‌ పోటీకి దిగారు. ఖమ్మంలో తెరాస నుంచి తాతా మధు, కాంగ్రెస్‌నుంచి రాయల నాగేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు.

మెదక్‌నుంచి తెరాస అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీ చేస్తున్నారు. వరంగల్‌లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సహా 11 మంది నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఈనెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. డిసెంబరు 10న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. రంగారెడ్డిలో ఎంపీటీసీల సంఘం తరఫున స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా ఉద్రిక్తత తలెత్తింది. తెరాస కార్యకర్తలు… ఎంపీటీసీల సంఘం నాయకులను అడ్డుకుని వారి నామపత్రాలు చించేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ్గా .. పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసుల తీరుపై ఎంపీటీసీల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read :- సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.