Telugu News

ఖమ్మం  రోటరీనగర్ లో క్షుద్రపూజలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

0

ఖమ్మం  రోటరీనగర్ లో క్షుద్రపూజలు

== అమవాస్య రోజున పూజలు చేస్తుండటంతో స్థానికులు ఆగ్రహం

== పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

== పూజలు చేసేవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో క్షుద్రపూజలు చేస్తున్నారు.. ఖమ్మం నగర నడిబొడ్డున జనం తిరిగే ప్రాంతంలో ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్న ఓ ఇద్దరు క్షుద్రపూజలు చేస్తుండటంతో స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది మహిళలు, స్థానికులు కలిసి ఆ ఇంటిని పరిశీలించి అక్కడ జరుగుతున్న సంఘటనను నేరుగా వీడియోలు తీసి అక్కడ క్షుద్రపూజలు చేస్తుండటంపై ఆగ్రహించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, తక్షణమే స్పందించిన టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూజలు చేస్తున్న ఓ మహిళ, ఓ పురుషుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా ఇక్కడ అమవాస్య రోజు, శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని, ఇతర రోజులో పొగలు రాకపోవడంతో అనుమానించామని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: *ప్రజలకు మరింత చేరువగా మంత్రి పువ్వాడ

అక్కడ ఏదో జరుగుతుందని అనుమానించి గురువారం స్థానికులందరం కలిసి ఈ ఇంటిని పరిశీలించగా క్షుద్రపూజలు చేస్తున్నారని తెలిపారు. ఏం పూజలు చేస్తున్నారని అడిగితే లక్ష్మిదేవికి పూజ చేసుకుంటున్నమని, హోమం చేస్తున్నామని చెబుతున్నారని, కానీ అక్కడ పుర్రెలు, కత్తులు, పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా క్షుద్రపూజలు చేస్తున్నారని, ప్రజలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో కిరాయికి తీసుకుని క్షుద్రపూజలు చేయడంతో భయమేస్తుందన్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.