Telugu News

కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యం: భట్టి విక్రమార్క

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

0

కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యం

== రాహుల్ ను అరెస్టు చేస్తే ఉప్పెన తప్పదు

== రాహుల్ కు అండగా 13న కాంగ్రెస్ ఆందోళన

== విచారణ పేరిట సోనియా, రాహుల్ ను వేధించాలని చూస్తే ఊరుకోం

== దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఇందిరమ్మ వారసులు  ఈ.డి, ఐ.టీ నోటీసులకు  భయపడతారా?

== దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై బిజెపి రాజకీయ కక్ష్య సాధింపు

== సొంత ఇల్లు  లేని గాంధీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు

== వచ్చే ఎన్నికల్లో బిజెపి ని గద్దె దింపడం ఖాయం

==  కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదికి వస్తే బిజెపి తట్టుకోలేదు

== పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

ఎర్రుపాలెం/ఖమ్మంప్రతినిధి, జూన్ 10(విజయంన్యూస్)

కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యమని, ప్రజా పరిపాలన కావాలంటే ప్రజలందరు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని, అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొట్టాల్సిన సమయం అసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం మోతీలాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నోటీసులు ఇప్పించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఈనెల 13న రాహుల్ గాంధీని విచారణకు ఈ.డి ఆఫీస్ కు రావాలని నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం ఎరుపాలెం మండలం ఇనగాలి గ్రామం నుంచి బయలుదేరి రాజుల దేవరపాడు, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు గ్రామాల్లో కొనసాగింది

ఇది కూడా చదవండి :మంటలార్పి మానవత్వం చాటుకున్న మందపల్లి

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహనీయులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి , నందమూరి తారకరామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాలకుల వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షాలను భయపెట్టి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న కుట్రపూరిత ఆలోచనతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ.డి, ఐ.టి సంస్థలతో దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. దేశం కోసం, ప్రజల బాగు కోసం పని చేయాల్సిన న్యాయ శాఖ, ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ టాక్స్, అవినీతి నిరోధక తదితర సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఆర్ఎస్ఎస్, బిజెపి కోసం పని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వాటిని నియంత్రణ చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ మాట వినని బీజేపీ యేతర ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలపై రాజకీయ కక్ష్య సాధింపు కోసం ఇష్టానుసారంగా దాడులు చేయించడానికి ఈ. డి,  ఐ.టీ లను వాడుకుంటూ మోడీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలకు అచ్చే దిన్ తీసుకొస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి దేశాన్ని తెగ నమ్ముతున్న మోడీ సర్కార్ కు  దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చి, తమ ఆస్తులను జాతికి అంకితం చేసి, నవభారత నిర్మాణం చేసిన మోతీలాల్ నెహ్రూ కుటుంబం పై అవినీతి ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలి అని విమర్శించారు.  ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో  కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీలకు ఈ.డీతో నోటీసులు ఇప్పించినంత మాత్రాన వారిని భయపెట్టలేరనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఎల్.టి.టి, పంజాబ్ టెర్రరిస్టుల బెదిరింపులకు భయపడకుండా దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల వారసులు ఈ.డీ నోటీసులకు ఎలా భయపడుతారని బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. మోడీ సర్కార్ తప్పిదాలను ఎత్తి చూపుతున్న ప్రతి సందర్భంలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐ.టి, ఈ.డిలతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన వారిపై ఈడి కేసులు, ఐటీ దాడులు చేసినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరు భయపడరనే ఈ విషయాన్ని బీజేపీ తెలుసుకోవాలన్నారు. అక్రమంగా కేసులు బనాయించి  100 నోటీసులిచ్చిన సోనియా గాంధీ కుటుంబాన్ని ఏమి చేయలేరు అని యావత్ జాతి మొత్తం సోనియా కుటుంబానికి అండగా ఉన్నారని తెలిపారు.  ఇది కూడా చదవండి : – రేపటి నుంచి మీనవోలు నుంచి భట్టి పాదయాత్ర

మతతత్వ పార్టీని గద్దె దించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ చింతన్ శిబిర్ లో అనేక నిర్ణయాలు చేయడం బిజెపికి కంటగింపుగా మారిందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను జాగృతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టే కార్యక్రమాలను కట్టడి చేయాలన్న ఆలోచనలో భాగంగానే బిజెపి చేస్తున్న దురాలోచన లో భాగంగానే ఈ.డి నోటీసుల పేరిట కుట్రలు చేస్తున్నదని వివరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్ర నేతల పై అక్రమ కేసులు బనాయించేందకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. గతంలో ఈడితో  నోటీసులు ఇప్పించి వేధించి, వేధించి ఏమీ లేదని తేల్చి చెప్పిన బిజెపి ప్రభుత్వం మళ్లీ  నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా, రాహుల్ గాంధీ లకు ఈడి తో నోటీసులు జారీ చేయించడం జుగుప్సకరంగా ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఉందన్నారు. సోనియా రాహుల్ గాంధీలకు దేశంలోని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు అండగా ఉంటారని వారిని బిజెపి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల బిజెపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా రోడ్డుమీదకి వస్తారని, అప్పుడు బిజెపి తట్టుకోలేదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, స్థానిక

సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పాదయాత్ర కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.