Telugu News

పాలేరు‘ కాంగ్రెస్ లో లొల్లి

** వర్గాలుగా విడిపోతున్న కార్యకర్తలు

0

పాలేరు‘ కాంగ్రెస్ లో లొల్లి
** వర్గాలుగా విడిపోతున్న కార్యకర్తలు
** సమన్వయం చేసేవారులేక ఇక్కట్లు
** గ్రామ స్థాయి కమిటీలు లేక 10ఏళ్లు
** 8ఏళ్లుగా అమలుకునోచుకుని మండల పూర్తిస్థాయి కమిటీలు
** సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న భూతుపురాణం
** ఎమ్మెల్సీ ఎన్నికల ముందే బహిర్గతమైన వర్గపోరు
క్యాడర్ ఉన్న నాయకత్వ లేమితో సతమతం
** పార్టీని కాపాడాలని మొత్తుకుంటన్న పార్టీ శ్రేణులు
** పాలేరు కాంగ్రెస్ కు ఎమైంది..? పార్ట్ -1
(కూసుమంచి –విజయంన్యూస్);-
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పాలేరు నియోజకవర్గం.. సుమారు 14 సార్లు సాధాహరణ ఎన్నికలు జరిగితే 11 సార్లు గెలిచిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్.. రాష్ట్రం మొత్తం ’కారు‘ వేయ్ లో ముందుకు వెళ్తుంటే.. అభివద్ధి ప్రధాతనే ఓడించిన దమ్మున్న క్యాడర్ కల్గిన పార్టీ అది.. గెలిచారంటే మంత్రి పదవిని అందించే నాయకత్వ కల్గిన పార్టీ కూడా అదే.. అంతటి శక్తి కల్గిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కలవరంలో పడి కష్టాల్లో మునిగితెలుతోంది..మస్తుగా క్యాడర్ బలం ఉన్నప్పటికి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది.. నడిపించే నాయకుడి కోసం పార్టీ శ్రేణులు వేయ్యికళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. పదేళ్లు గడిచిన పార్టీ పూర్తి స్థాయి కమిటీలకు దిక్కులేదు.. ఎనిమిదేళ్లైనప్పటికి గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటే లేదు..? నాలుగు మండలాలకు ముగ్గురు అధ్యక్షులు ఉండగా ఒక మండలానికి అధ్యక్షుడు లేక ఐదేళ్లు..అయినప్పటికి వారి కమిటీల నియామకం పూర్తి కాలేదు.. ఎవరిపెత్తనం వారిదే.. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పదవులను పంచేసుకుంటున్నారు.. వర్గాలుగా విడిపోయి తిట్లపురాణం మొదలెట్టారు.. సోషల్ మీడియా సాక్షిగా సవాల్ విసురుకుంటున్నారు.. నడిపించేవాడు వస్తే సీనయర్లమంటూ తొక్కేస్తున్నారు..? పదవులున్న వారు పత్తాలేకుండా పోతున్నారు.. ప్రజాప్రతినిధులను పట్టించుకునే నాథుడే కరువైయ్యారు.. కష్టకాలం వచ్చిందంటే అదుకునే నాథుడే కరువైయ్యారు… ఇలాంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకునేవారేవ్వరు…? వైఫల్యం ఎవరిది..? అసలు పాలేరు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? ’విజయం‘ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం..
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పాలేరు నియోజకవర్గం. ఖమ్మం నియోజకవర్గం నుంచి 1962లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన పాలేరు నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీదే పైచెయ్యి ఉండేది. వరసగా మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధించగా, ఆ తరువాత మరో రెండు సార్లు వరసగా విజయం సాధించింది. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టి విజయం సాధించినప్పటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే మొత్తం 14 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలోనే విజయం సాధించింది. జనరల్ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలుపుకుంది.. అంటే వరసగా నాలుగుసార్లు జనరల్ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చరిత్ర ఉంది. 2004లో జరిగిన ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్ విజయం సాధించి మంత్రి కాగా, 2009 ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. తిరిగి 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికి రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ కు ఒకరకమైన ఫలితాలు వస్తే, పాలేరులో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా పదవిలో ఉండగానే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. కాగా అనివార్యమైన ఉపఎన్నికల్లో అప్పటికే మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించాడు. ఆ తరవాత 2018లో జరిగిన సాధాహరణ ఎన్నికల్లో మంత్రివర్గంలోనే అత్యంత కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. మొదటి సారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కందాళ ఉపేందర్ రెడ్డిని ఆ పార్టీ కార్యకర్తలు కసితో కష్టపడి గెలిపించారు. ఇప్పటికి పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అభ్యర్థి ప్రచారం చేయకపోయిన 50వేల ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. అంతటి బలమున్న పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..?
** నాయకత్వ లేమితో సతమతం..
పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వలేమి కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించినప్పటికి అతి కొద్ది కాలంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పార్టీ నుంచి ఆయనతో పాటు ఎవరు వెళ్లకపోయినప్పటికి ఆ స్థాయి నాయకుడు ఆ పార్టీలో తయారు కాలేదు. దీంతో పాలేరు నియోజకవర్గంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో అధికారపార్టీని ఢీకొట్టే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికి, పార్టీ శ్రేణులకు భరోసానిచ్చి నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. కార్యకర్తలకు భరోసానిచ్చే నాయకుడే లేడు. పంచాయతీలు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో కష్టం వచ్చిందంటే అదుకుని సమస్యలను పరిష్కరించే నాథుడే కరువైయ్యారు. అంతేకాదు నేను ఉన్నా అంటూ భరోసా ఇచ్చే నాయకుడే లేడు. దీంతో క్యాడర్ సందిగ్ధంలో పడిపోయారు. కొంత మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా, కొంత మంది కాంగ్రెస్ లోనే ఉంటూ స్తబ్ధతగా ఉండిపోయారు.
** ఏళ్లతరబడి కమిటీలు లేవు…?
పాలేరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉండగా, మూడు మండలాలకే కమిటీ అధ్యక్షులు ఉన్నారు. గత నాలుగేళ్ల క్రితమే నేలకొండపల్లి మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ లో చేరగా, ఆ స్థానాన్ని నేటి వరకు భర్తి చేయలేదు. కనీసం ఇన్ చార్జ ను కూడా నియమించలేదు. ఇక మిగిలిన మూడు మండలాల్లో అధ్యక్షులు మినహా ఇప్పటి వరకు పూర్తి స్థాయి కమిటీ, అనుబంధ కమిటీల నియామకం కాలేదు. గత పదేళ్ల నుంచి మూడు మండలాలకు మండల అధ్యక్షులుగా వారే కొనసాగుతున్నారు. నేటి వరకు పూర్తి స్థాయి కమిటీ వేయలేదు. అలాగే గ్రామస్థాయి కమిటీలు కూడా వేయకపోవడం గమనర్హం.. స్వతహాగా ఆయా గ్రామాలకు చెందిన నాయకత్వం నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు.
** వర్గాలుగా విడిపోతున్న కార్యకర్తలు
పాలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఎన్నడు లేనంతగా వర్గాలు ఏర్పడుతున్నాయి.. గతంలో కూడా రేణుకచౌదరి, సంభాని, వెంకట్ రెడ్డి వర్గీయులుగా ఉండేవారు కానీ పార్టీ కార్యక్రమాలకు వచ్చేసరి అందరు హాజరైయ్యేవారు. కానీ ఇప్పడు నడిపించేవారు లేకపోవడంతో కార్యకర్తుల, నాయకులు వర్గాలుగా విడీపోతున్నారు. సంభాని వర్గం, రేణుకచౌదరి వర్గం, భట్టి వర్గమంటూ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ముఖ్యంగా కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తుతం మరో కొత్త వర్గం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మేము సీనియర్లం అనే అహం ఆ పార్టీని పూర్తిగా దెబ్బతిసే పరిస్థితి కనిపిస్తోంది.. మేము సీనయర్లం, పార్టీని ఎప్పటి నుంచో నడిపిస్తున్నాం..ఎవరైనా వస్తే మా వద్దకే రావాలే..లేదంటే బాగుండదు, తిరిగితే మేమే గ్రామాల్లో తిరగాలి..మేము పిలిస్తేనే రావాలి.. కొత్తవారు వచ్చి గ్రామాల్లో తిరిగితే బాగుండదన్నట్లు కొంత మంది నాయకులు హుకుం జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. అది పార్టీకి పెనుప్రమాదంగా తయారైంది. పార్టీని నడిపించాలని తాపత్రయపడే యువకులు కూడా వారి దెబ్బకు రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
** కమిటీలను మార్చాలని మొత్తుకుంటున్న వినని అదిష్టానం
పాలేరు నియోజకవర్గంలో గత 12ఏళ్ల నుంచి పాత కమిటీలే కొనసాగుతున్నాయని, మండల కమిటీలు పూర్తి స్థాయిలో నియామకం కాలేదని, గ్రామకమిటీలు లేకపోవడం వల్ల ఎవరికివారే ఎమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కమిటీలను మార్చి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అనేక దఫాలుగా రాష్ట్ర, జిల్లా అదిష్టానానికి వినతి చేశారు. లేఖలు రాశారు. నేరుగా కలిసి వినతి చేశారు. పార్టీ బలంగా ఉంది, మరోసారి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాము, కమిటీలను మార్చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని అనేక ధపాలుగా నాయకులు, కార్యకర్తలు మొత్తుకుంటున్న రాష్ట్రంలో వినేనాథుడే కరువైయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్ కు అనేక మంది వినతులు చేయగా, ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనేక దఫాలుగా వినతి చేశారు. నాయకులు అందించే వినతులు, ఫిర్యాదులను కూడా ఆయనకు అందించిన ఫలితం లేకపోయింది. ఎన్నిసార్లు వినతులు చేసిన, మొత్తుకున్న, ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తల గోసను పట్టించుకోలేదు.
** రెండు పడవలపై కాలుమోపిన కొంతమంది నేతలు..?
పాలేరు కాంగ్రెస్ పార్టీలో మరో విచిత్రకరమైన పరిస్థితి నేలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు రెండు పార్టీలో కాలుపెట్టి డ్రామాలాడుతున్నారు. మండల స్థాయిలో నాది కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకునే నాయకులు, కందాళ ఉపేందర్ రెడ్డితో పూర్తిగా టచ్ లో ఉంటున్నట్లు ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, ఎమ్మెల్యే కందాళకు సంపూర్ణంగా మద్దుతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా నాయకత్వం కూడా ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మోద్దో కూడా అర్థం కావడంలేదని నియోజకవర్గ నాయకులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటూ మరో పార్టీకి సపోర్టు చేస్తుండటం వల్లనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పోతుందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతూ నన్ను ఎవరు చూడటం లేదని అనుకున్నట్లు కొంత మంది నాయకులు, కార్యకర్తలు కందాళ ఉపేందర్ రెడ్డితో తిరుగుతూ మమ్మల్ని ఎవరు చూడలేదులే అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పలువురు నాయకులు ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన ఎమ్మెల్యే కాబట్టి పనులు చేయించుకునేందుకు వెళ్తున్నామని చెబుతున్నారని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు.
** ప్రజాప్రతినిధులను పట్టించుకుని అదిష్టానం
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలు, సోసైటీ డైరెక్టర్లుగా విజయం సాధించినవారు ఉన్నారు. వారిని పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. గడిచిన మూడేళ్ల కాలంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టిన రోజు లేదంటే నమ్మాల్సిందే..? వారి సమస్యలను పరిష్కరించే నాథుడే లేరు.. వారికి, వాళ్ల గ్రామాల్లో సమస్యలోస్తే, పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే పై స్థాయిలో పైరవి చేసే నాథుడే లేరు. వారికి భరోసా కల్పించే నాయకుడే లేడంటే నమ్మాల్సిందే. అధికార పార్టీ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలపై తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికి వారికి మేమున్నామంటూ కాపాడే వారే కరువైయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిశబ్ధంగా ఉండిపోయారు. కొంత మంది అధికారపార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి పార్టీ మారకపోయినప్పటికి పనులు చేయించుకుంటున్నారు.. ఇలా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై కార్యకర్తలు, నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ పెద్దలు వస్తే నిలదిసీ కడిగేయాలనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది నాయకత్వాన్ని ప్రశ్నిస్తునే ఉన్నారు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు పాలేరు నియోజకవర్గంపై కన్నేసి తమ ఆవేదనను అర్థం చేసుకుని, కార్యకర్తలను కాపాడాలని, నూతన కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు కోరుతున్నారు.. మరీ ఇప్పటికైనా అదిష్టానం మారుతుందా..? కార్యకర్తల కోరిక తీరుస్తుందా..? వేచి చూడాల్సిందే.?
** (’పాలేరు‘ కోసం నేతల ప్రయత్నాలు.. పసలేని రాజకీయాలు..? ’పాలేరు‘ కాంగ్రెస్ కు ఏమైంది..?రెండవ భాగం రేపటి సంచికలో..?)

ALSO READ;-పాలేరు జలాశయంలో వివాహిత మృతిదేహం లభ్యం