Telugu News

పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల

ఆయన బీజేపీలో చేరతారనే నమ్మకం ఉంది

0

పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల

== ఆయన బీజేపీలో చేరతారనే నమ్మకం ఉంది

== బీజేపీ ఎమ్మెల్యే ఈటేల రాజేందర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం సీఎం కేసీఆర్ ను గద్దే దింపడమేనని, ఆయన లక్ష్యం రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా నేరవేరుతుందని బీజేపీ నేత, హుజురబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించేందుకు గాను హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావులు  వచ్చారు. పొంగులేటి నివాసానికి వెళ్లిన వారు డిన్నర్ చేశారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపిన అనంతరం బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ  మధ్య కాలంలో పొంగులేటి బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పొంగులేటితో మాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉందని, ఆయనతో ఉన్న సంబంధంతోనే బీజేపీ పార్టీలోకి రావాలని అహ్వానిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రాబోయేది కాషాయ రాజ్యమే : ఈటేల

పొంగులేటి ఆశయం కెసీఆర్ నిరంకుశ పాలనను గద్దె దించడమేనని, అదే బాటలో జూపల్లి క్రిష్ణారావు కూడా ఉన్నారని అన్నారు. ఇద్దరిది ఒక్కటే నిర్ణయమని, సీఎం కేసీఆర్ ను గద్దె దింపితేనే తెలంగాణకు మోక్షమని భావించారని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దించే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. మేమంతా కలిసి కెసిఆర్ ను గద్దె దింపుతామని అన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ ఉన్న రాచరిక పాలనకు స్వస్తి పలుకుతామని స్పష్టం చేశారు. అమిత్ షా, నడ్డా ఆదేశాల మేరకు మేము పొంగులేటి ని కలిశామని, ఆయన కూడా మాతో సానుకూలంగా స్పందించేలా ఉన్నారని అన్నారు. ప్రజల, కార్యకర్తల నిర్ణయం మేరకే ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారని అన్నారు. ఈ రాష్ట్రంలో కెసీఆర్ ను గద్దె దించే పార్టీ, కెసీఆర్ ను అడ్డుకునే పార్టీ బీజేపీ మాత్రమేనని, అందుకే చాలా మంది ముఖ్యనాయకత్వం బీజేపీ వైపు చూస్తున్నరని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

కెసిఆర్ టీడీపీ, వైసీపీ పార్టీలను నామరూపాలు లేకుండా చేశారని, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. పొంగులేటి త్వరలో కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి ఆలోచనల మేరకే నిర్ణయం తీసుకుంటానని మాకు చెప్పారని అన్నారు. మాకు నమ్మకం, విశ్వాసం ఉంది, కచ్చితంగా జూపల్లి, పొంగులేటి ఇద్దరు బీజేపీ పార్టీలో చేరతారని అన్నారు.

ఇది కూడా చదవండి: మాకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత: పొంగులేటి