Telugu News

పేదల నడ్డి.. విరుస్తున్న వారాల వడ్డీ ..!

*వారాల వడ్డీ ఆలస్యమైతే చుక్కలు చూడాల్సిందే

0

పేదల నడ్డి.. విరుస్తున్న వారాల వడ్డీ ..!

*వారాల వడ్డీ ఆలస్యమైతే చుక్కలు చూడాల్సిందే

*ఇతర జిల్లాల నుంచి వచ్చి వడ్డీ వ్యాపారం

*చిరు వ్యాపారులు,రోజూ కూలీలే వారికి టార్గెట్

*నిరుపేదల అవసరాలే వారికి పెట్టుబడి

*కా(ల)ల్” నాగుల్లా వడ్డీ వ్యాపారులు

*చిన్న గూడూరు – విజయం న్యూస్

ఎటు చూస్తే అటు ‘కాల్‌’నాగులు! రెచ్చిపోయే రుణ సర్పాలు! బుసలు కొడుతున్నాయి! పేదల అవసరాలే దన్నుగా అల్లుకుపోతున్నాయి. జనారణ్యంలో విషం చిమ్ముతూ చెలరేగుతున్నాయి. పాముల్లో రకరకాల జాతులున్నట్లే… ‘కాల్‌’నాగుల్లోనూ రకరకాల రూపాలు. ఒక్కోచోట ఒక్కో పేరు! ఒక్కోచోట ఒక్కో తీరు! అవి చిమ్మే ‘వడ్డీ విషం’ మాత్రం ఒక్కటే
చిన్న గూడూరు మండలంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. సినీఫక్కీలో ఇళ్లకొచ్చి వారం వడ్డీకి డబ్బులిచ్చి మరీ అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు.

అప్పు తీసుకుని గ్రహపాటుగా చెల్లించటంలో ఆలస్యమైతే ఇక చుక్కలు చూపిస్తున్నారు. వడ్డీ మాఫియా ఉచ్చులో చిక్కితే చాలు జలగల్లా రక్తాన్ని పీల్చుతున్నారు. వారాల వడ్డీతో నిలువు దోపిడి చేస్తున్నారు.మహబూబాబాద్, ఖమ్మం,నగరాల నుంచి బడా వడ్డీ వ్యాపారులు మండలంలోని వివిధ గ్రామాల్లో నిరుపేదలను ఆసరా చేసుకుని వారి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వడ్డీ రాబంధుల ఉచ్చులో చిక్కుకుని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి.మండలంలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు వ్యాపారులు అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. మరికొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అమాయకులను రెట్టింపు వడ్డీలతో దోపిడీ చేస్తున్నారు. దీంతో అసలు కన్నా వడ్డీ ఎక్కువై అప్పు కట్టలేని పరిస్ధితుల్లో లబోదిబోమంటున్నారు.

వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో అప్పు తీసుకున్న ప్రజలు అల్లాడిపోతున్నారు.వడ్డీ వ్యాపారులు రెండు వేల నుంచి రెండు లక్షల వరకు అప్పు ఇస్తున్నారు. రకరకాల సంస్ధల పేరుతో వ్యాపారులు వడ్డీలు ఇస్తున్నారు. పల్లెలు, చిరువ్యాపారులు వడ్డీ మాఫియా చేతిలో కుదేలవుతున్నారు. తీసుకున్న అప్పును వారాల వారీగా వసూలు చేస్తున్నారు వడ్డీ బకాసురులు. పదివేల నుంచి వారి అవరాన్ని బట్టి డబ్బులు తీసుకున్నా ప్రతి వారం అసలు, వడ్డీ చెల్లించాల్సిందేనని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టలేకపోతే నానా బీభత్సం సృష్టించడంతో పాటు బండబూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందాతో పరువు తీస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటే జలగల్లా తమ నెత్తూరు తాగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పక్క జిల్లాలకు చెందిన వడ్డీ వ్యాపారులు అమాయక ప్రజలు, చిరువ్యాపారులను టార్గెట్‌ చేసుకుని దందా చేస్తున్నారని వాపోయారు. అప్పులు తీసుకున్న తాము వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నామని ఇప్పటికైనా వారి ఆగడాలకు కళ్లెం వేయాలని చిరువ్యాపారులు, సామాన్య ప్రజలు వేడుకుంటున్నారు.

also read;- చి”వరి”కి మద్దతుధర దక్కేనా…?-ప్రకటనలకే పరిమితమైన అధికారులు.