Telugu News

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని: పొంగులేటి 

తాళిబొట్లు ముస్లింలకు ఇస్తామన్న దుష్ప్రచారం నీచం

0

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని: పొంగులేటి 

– తాళిబొట్లు ముస్లింలకు ఇస్తామన్న దుష్ప్రచారం నీచం

– లౌకికవాదం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే..

– నగరంలో రోడ్ షోలో రెవెన్యూ మంత్రి పొంగులేటి

– మా సర్కార్ ను పడేస్తామన్నంత దమ్ము విపక్షాలకు లేదు

– సోనియా పిలిచి మరీ రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చారు: మంత్రి తుమ్మల

(ఖమ్మం-విజయం న్యూస్):

యావత్ దేశాన్ని చల్లగా చూసుకోవాల్సిన ప్రధాని మత విద్వేషాలను రెచ్చగొడుతూ.. పదవి కోసం వెంపర్లాడుతూ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని వన్ టౌన్, త్రీ టౌన్ ప్రాంతాల్లో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి తో కలిసి రోడ్ షో నిర్వహించారు. జిల్లా పరిషత్ నుంచి మొదలై ముస్తఫా నగర్, చర్చి కాంపౌండ్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో కొనసాగింది.

ఇది కూడా చదవండి:- ప్రచారంలో దూసుకుపోతున్న హీరో వెంకటేష్ కూతురు

ఈ సందర్భంగా రెండు కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హిందువుల తాళిబొట్లు తీసేసి ముస్లింలకు ఇస్తారని.. బీజేపీ నీచపు వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలన నచ్చకనే మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు నక్క వినయాలతో కర్ర పట్టుకుని యాత్ర కు వస్తుండు అని, ప్రజలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు ఉంటాయనీ బీఆర్ఎస్ నాయకులువిమర్శిస్తున్నారని..

ఇది కూడా:- నేడు కొత్తగూడెంకు ముఖ్యమంత్రి రాక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. బీజేపీపై బహిరంగంగా విమర్శలు చేస్తూ, రాత్రుల్లేమో రహస్యంగా కలిసి మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి పక్కా ఇంటి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందని, మీ అందరి దీవెనలతో కేంద్రం లో కూడా రానుందని తెలిపారు. రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*ప్రభుత్వాన్ని పడేసే అంత దమ్ముందా..?: మంత్రి తుమ్మల*
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొందరు అంటున్నారని.. బీజేపీ కి కానీ బీఆర్ఎస్ కు కానీ అంత దమ్ముందా అని ప్రశ్నించారు. వారిలాగా అరాచకాలు చేయడం తమకు తెలియదని అన్నారు. తనకు కేవలం అభివృద్ధి మాత్రమే తెలుసని, మున్నేరు బ్రిడ్జి నుంచి లకారం వరకు తాను చేసిన పనులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం కృషి చేస్తున్నానని అన్నారు.

*మచ్చలేని కుటుంబం రఘురాం రెడ్డిది..*
గాంధీ కుటుంబంతో.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి కుటుంబానికి మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీతో కూడా మంచి స్నేహం ఉందని తెలిపారు. అందుకే సోనియమ్మ ఖమ్మం ఎంపీ టికెట్ ను పిలిచి మరీ.. రఘురాం రెడ్డికి ఇచ్చారని అన్నారు. సౌమ్యుడు, విద్యావంతుడిగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కగా సరిదిద్దుతారని చెప్పారు.

*ముగ్గురు మంత్రుల సమన్వయంతో పని చేస్తా: రఘురాం రెడ్డి*
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ సభ్యురాలి పర్యవేక్షణలో తాను ఎంపీగా సమర్థంగా పనిచేస్తానని, జిల్లాను వదిలిపెట్టి పోనని కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. సామాన్యుడికి అందకుండా అన్ని ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్న బీజేపీని ఓడిద్దామన్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సీపీఐ, సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.