తెలంగాణలో మూడు రోజులు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
(హైదరాబాద్:విజయం న్యూస్):-
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.సోమవారం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసని’.. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఇవాళ ఉదయం కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
also read :-అశ్వారావుపేట లో టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు
ఈ తీవ్ర తుపాను వాయువ్య దిశగా పయనించి ఈరోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్ర తుపాను కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. విమాన సర్వీసుల రద్దును రేపు కూడా కొనసాగించనున్నట్లు పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి.