ఏండ్లుగా గార్లఒడ్డులో రేషన్ దందా.. !
== పట్టిస్తే పోలీస్ బెదిరింపులు.. ?
==ఇరువురినుండి ప్రాణభయం
== విలేకర్ల సమావేశంలో బాధితుడు కాకాని అభిలాష్
(ఖమ్మం-విజయం న్యూస్);-
కొన్నేళ్లుగా ఏనుకూరు మండలం గార్లఒడ్డు గ్రామంలో ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. సంబంధిత రెవెన్యూ అధికారి కూడా అందుబాటులో ఉండకపోవడంతో ఈ అక్రమ రేషన్ దందాదారులు స్థానిక పోలీస్ అధికారులను మచ్చిక చేసుకొని లోడ్లకు లోడ్లు అక్రమంగా పంపుతూ జోరుగా వ్యాపారం కొనసాగిస్తూ ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని అదే గార్లఒడ్డు గ్రామానికి చెందిన కాకాని అభిలాష్ ఆరోపించాడు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 12 మంగళవారం అర్ధరాత్రి గార్లఒడ్డు గ్రామంలో మా ఇంటిపక్క నుండి టాటా ఏసీ, బొలెరో వాహనాలు తిరుగుతుంటే వాటి వెంట వెళ్లి అక్కడ జరుగుతున్న రేషన్ బియ్యం లోడింగ్ చూసి 100కు డయల్ చేసి చెప్పాను. గతంలో కూడా వాహనాలు బాగా తిరిగేవి అప్పుడు నాకు తెలియదు.
also read :-గాంధీభవన్ లో పోలిటికల్ ఆపైర్స్ కమిటీ భేటీ
ఇప్పుడు కల్లూరు ఏసీపికి వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాను. వారు రావడం లేటవుతుందని నేనే నేరుగా ఏన్కూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరాను. అది తెలిసిన కూరాకుల రమేష్ తన అనుచరులతో కారుతో వెంబడించి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. క్రిందపడ్డ నేను భయంతో పక్కనే ఉన్న సాయి టాగూర్ ఫంక్షన్ హాల్ లో దాక్కున్నాను. అక్కడ నుండి ప్రాణభయంతో మరల ఏసిపికి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే ఏన్కూరు ఎస్ఐ నుండి ఫోన్ వచ్చింది. తదుపరి వెంటనే పోలీసులు నుండి సమాచారం తెలుసుకున్న రేషన్ దందాదారులు కూరాకుల రమేష్ తన అనుచరులతో వచ్చి నీవు పోలీసులకు చెబితే నాకు తెలియదా.. అంటూ దాడిచేశారు. నా ఫోన్ లాకున్నారు. అంతలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చేసరికి నేను వారిని తప్పించుకొని పోలీసులకు వెళ్లి చెప్పాను. అప్పటికీ దుండగుల కారు నా ద్విచక్ర వాహనం అక్కడే ఉన్నాయి. పోలీసులు రేషన్ కాడికి వెల్దామని తీసుకెళ్లారు. దుండగులు తప్పించుకున్నారు. నేను రేషన్ బియ్యాన్ని చూపించితే ట్రాక్టర్ ద్వారా స్టేషన్ కు తరలించారు.
also read :-యాదగిరి గుట్టలో ఘోర ప్రమాదం
నాతోనే 40బస్తాల బియ్యాన్ని ట్రాక్టర్ లోకి మోపించారని తెలిపాడు. మరుసటిరోజు అక్రమ రేషన్ దందాదారులు, దాడిచేసిన వారు కూరాకుల రమేష్ ఒక్కల్లే కావడంతో ఫిర్యాదు చేశాను. నా పిర్యాదుపై కేసునమోదు చేయకుండా.. నేను పట్టించిన బియ్యాన్ని ఎస్సై అనుమానిత బియ్యంగా పత్రికా ప్రకటన చేయడం దారుణమని.. అక్రమ వ్యాపారులనుండి ఎంత అమ్యామ్యాలకు పాల్పడుతుండో దీన్ని బట్టి అర్ధమవుతుందని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో నేను పట్టించిన 40బ్యాగుల రేషన్ బియ్యాన్ని ట్రాక్టర్ నుండి నాతోనే పోలీసులు మోపించారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ కేసును రద్దు చేసినట్టు ఎస్సై ప్రకటించడం శోచనీయమన్నారు. దీనిపై ఎంతటి న్యాయ పోరాటమైన చేస్తానని తెలిపాడు. లోకాయుక్త, మానవహక్కుల కమీషన్, ఖమ్మం పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ రేషన్ వ్యాపారాన్ని అరికట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు