Telugu News

పార్టీలకు తప్పని రెబల్స్ బెడద.. ఉమ్మడి ఆదిలాబాద్ లో ధిక్కార స్వరాలు

ఆదిలాబాద్: ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగిసింది.

0

పార్టీలకు తప్పని రెబల్స్ బెడద.. ఉమ్మడి ఆదిలాబాద్ లో ధిక్కార స్వరాలు

ఆదిలాబాద్: ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగిసింది.

ఆదిలాబాద్: ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 24 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల పర్వంలో అధికార పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ధిక్కార స్వరాలు వినిపించడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. అధికార తెరాస అభ్యర్థిగా హైదరాబాద్‌లో స్థిరపడి.. కాగజ్‌నగర్‌కు చెందిన దండె విఠల్‌ను ఖరారు చేయడంతో ఆపార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంది. స్వయంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌ నియోజకవర్గంలోని సారంగపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి పార్టీ నేతలతో కాకుండా వేరుగా వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం ఆసక్తిగా మారింది.

అయితే ముందు నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశించిన నిర్మల్‌కు చెందిన శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్, మంచిర్యాలకు చెందిన అరవిందరెడ్డి సహా చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్‌ నామినేషన్ల పర్వానికి హాజరు కాలేదు. దండె విఠల్‌ తరఫున 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు తెరాస నాయకులు. విఠల్‌ సహా మొత్తం 24 మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు తెరాస నేతల అంతర్గత మద్దతుతోనే నామినేషన్‌ వేసినట్లు నేతల దృష్టికి వచ్చింది.

కాంగ్రెస్, భాజపాలోనూ అదే పరిస్థితి

ఉమ్మడి జిల్లాలోని జడ్పీలు, మండలాలు, మున్సిపాల్టీలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌కు 80, భాజపాకు మరో 75మంది వరకు ఓటర్ల బలం ఉన్నప్పటికీ ఆ పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించకపోవడం శ్రేణులను నివ్వెరపరిచింది. ఫలితంగా కొందరు నామపత్రాల చివరి రోజైన మంగళవారం స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. దండెపల్లి కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యురాలైన నాగారాణి భర్త గడ్డం త్రిమూర్తి, మాజీ మండలాధ్యక్షుడైన మరో కాంగ్రెస్‌ నాయకుడు జాబుకాంతారావు నామినేషన్‌ వేశారు. తెరాస, కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులతో వచ్చిన జన్నారం మండలం దేవునిగూడ కిష్టాపూర్‌ ఎంపీటీసీ సభ్యురాలు ముచ్చ పోశవ్వ నామినేషన్‌ వేయడం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లయింది.ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాందా(టి)కి చెందిన ఉగ్గె సత్యనారాయణ, ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని విద్యానగర్‌ కౌన్సిలర్‌ కలాల శ్రీనివాస్‌లు వేర్వేరుగా భాజపా నేతల మద్దతుతో వచ్చి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేయడం రాజకీయ ప్రాధాన్యతను రేకెత్తిస్తోంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములనేవి ముఖ్యం కావు, పోటీలో నిలిచామా? లేదా ? అనేదే ప్రామాణికం అని నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా ప్రకటించడం విశేషం.

మాట నిలబెట్టుకున్న ఇద్దరు నేతలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించిన భాజపా ఎంపీ సోయం బాపురావు, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ అనుకున్నట్లుగానే అభ్యర్థులను నిలబెట్టి వారి మాట నిలబెట్టుకున్నారు. తుడుందెబ్బ తరఫున ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఆదివాసీ మహిళ పుష్పరాణితో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. తిర్యాణి మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిగౌడ్‌తో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతామని కుమురం భీం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో ఆమెకు ఆసిఫాబాద్‌ ఆర్డీవో ద్వారా రావాల్సిన ఓటింగ్‌ ధ్రువపత్రం రాలేదు. దాంతో మంగళవారం చివరి నిమిషంలో ఆమెకు బదులుగా కాగజ్‌నగర్‌ ఆర్డీవో ద్వారా ధ్రువీకరణ పత్రం పొందిన సిర్పూర్‌(టి) కాంగ్రెస్‌ ఎంపీటీసీ సోయల్‌ అహ్మద్‌ను బరిలో నిలిపారు.ఆసిఫాబాద్‌ ఆర్డీవో కావాలనే కార్యాలయంలో అందుబాటులో ఉండక ఓటరు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదనీ.. పలుమార్లు ఫోన్‌చేసిన స్పందించలేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, తిర్యాణి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి భర్త అనిల్‌గౌడ్‌ ఆరోపించారు. ఎన్నికల నిబంధన నియామవళిని ఉల్లంఘించిన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

బరిలో నిలిచిన 24 మంది

తెరాస అభ్యర్థి దండె విఠల్‌ సహా 24 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్‌ సెట్లను దాఖలు చేశారు. ఈ 24 మందిలో దండె విఠల్‌ను మినహాయించి నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఖానాపూర్‌ నుంచి ఆరుగురు, ముథోల్‌ నుంచి నలుగురు, మంచిర్యాల నుంచి ముగ్గురు, బోధన్, సిర్పూర్ కాగజ్​నగర్, ఆదిలాబాద్, నిర్మల్‌ నుంచి ఇద్దరేసి చొప్పున స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస నామినేషన్లు వారి వివరాలు సేకరించి ఉపసంహరించుకునేలా ప్రాంతాలవారీగా పావులు కదుపుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన కొంతమంది నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో తెరాసకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను బుధవారం నుంచి క్యాంపునకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నిక అనివార్యమైతే ఓటింగ్‌రోజు రప్పించడం.. లేనట్లయితే నామినేషన్ పత్రాల ఉపసంహరణ వరకు వేచిచూడాలనే ప్రణాళికకు తెరాస సిద్ధం చేసింది.

also read :- పెట్రోల్‌ను దాటేసిన టమాటా.. కిలో రూ.140.

also read :- చరిత్రలో ఈరోజు నవంబర్ 24.