Telugu News

పాలన వ్యవస్థలో సంస్కరణలు..

ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం

0

పాలన వ్యవస్థలో సంస్కరణలు..

ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం
నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

మరింత మెరుగైన సేవలకు ఉన్న అవకాశాలపైనా కమిటీ పరిశీలన

సమగ్ర నివేదికకు సీఎం ఆదేశం
ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం

నేడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులకు మరింత భాగస్వామ్యం

రాష్ట్రంలో సమగ్ర పరిపాలనా సంస్కరణలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు.

ఉద్యోగాల భర్తీ, పాలనాపరమైన మార్పులు, చేర్పులే లక్ష్యంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేయడానికి, అవసరమైన మార్పులకు సంబంధించి సూచనలు ఇచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 33 జిల్లాల్లో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం దాదాపు పూర్తిచేసిన విషయం తెలిసిందే. దీంతో పాలనాపరమైన సంస్కరణలను సీఎం ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలకు సంబంధించి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

also read :-ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఈ సమావేశంలో పరిపాలనా సంస్కరణలు, ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. పరిపాలనా సంస్కరణలకు సంబంధించి అధ్యయనం చేయడానికి స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షుడిగా, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ వెంటనే పని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఖాళీలను గుర్తించండి.. నోటిఫికేషన్లు ఇద్దాం
ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా.. నోటిఫికేషన్లు జారీచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని ఐఏఎస్‌ల కమిటీకి సీఎం సూచించారు. ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉంది?.. అంచనావేసి దానికి అనుగుణంగా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించి, ఇంకా సాంకేతికంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి..

also read :-కిరాయి కట్టలేదని ఓ మాజీ ప్రధాని సామాన్లేనంటా..? ఆయనేవరంటే..?

తదితర అంశాల మీద ఈ కమిటీ అధ్యయనం చేయాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ఇప్పటికే ప్రథమస్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన సంసరణలు తీసుకొచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని నిర్ణయించామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం ఎకువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని సూచించారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇద్దామని సీఎం చెప్పారు.

also read :-ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళల పై దాడి

హెచ్‌వోడీ నుంచి క్షేత్రస్థాయి వరకు..
ప్రజల కోణంలో పాలన సాగేందుకు అవసరమైన సూచనలను ఐఏఎస్‌ల కమిటీ ఇవ్వనున్నది. ప్రతి శాఖలో శాఖాధిపతి కార్యాలయం మొదలు.. క్షేత్రస్థాయి వరకు ఉద్యోగుల పనితీరు, పనివిభజన ఎలా ఉండాలో ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నది. కొన్ని శాఖల్లో ఇప్పటికీ అవసరం లేకపోయినా సిబ్బంది ఉన్నారు. అలాంటివారి సర్దుబాటుపై సూచనలు ఇవ్వనున్నది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొన్ని రకాల పనుల స్వభావం మారింది.

ఆ పనులను గుర్తించి, దానికి సంబంధించిన మౌలిక మార్పులను చేపట్టడం, నిర్మాణాత్మక సంస్కరణలు చేయడం, సేవలను అందించడంపై శాఖలవారీగా అధ్యయనం చేయనున్నది. అవసరమైతే విధానాలను కూడా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కాలానుగుణంగా లేని పాలసీలను మార్చాలని కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఆ కమిటీ సలహాలను ఇవ్వనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

కమిటీ అధ్యయనం చేసే అంశాలు
ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, పనివిభజన ఎలా ఉండాలి..

కొత్త పోస్టుల అవసరం.. సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలు

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల భాగస్వామ్యం

ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏలసేవలను ఉపయోగించుకోవడం

విద్య, వైద్యం, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ ద్వారా మెరుగైన సేవలు

ప్రభుత్వ విధానాలు.. కాలానుగుణంగాలేని విధానాల మార్పు