చర్లలో సీపీఎంకి గట్టి షాక్ – మండల కార్యదర్శి ‘కొండా’ రాజీనామా
- పార్టీ సభ్యత్వం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన
చర్లలో సీపీఎంకి గట్టి షాక్ – మండల కార్యదర్శి ‘కొండా’ రాజీనామా
– పార్టీ సభ్యత్వం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన
( భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీపీఎంకి గట్టి షాక్ తగిలింది. అన్నీ తానై పార్టీని నడిపించే కార్యదర్శి కొండా చరణ్ ఎవరూ ఊహించని విధంగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇకపై తనకు పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామం చర్ల మండల సీపీఎం పార్టీని ఓ కుదుపు కుదిపిందని చెప్పవచ్చు. పార్టీ పట్ల కమిట్మెంట్‌తో పనిచేసే చరణ్ ఆకస్మికంగా వైదొలగడానికి కారణాలు ఏంటి, అసలు చర్ల సీపీఎం పార్టీలో ఏమి జరుగుతుందనేది రాజకీయంగా స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.
పార్టీలో నెలకొన్న నిర్మాణ సమస్యల కారణంగా 2021 జూన్ 30న తనకు మధ్యంతర కార్యదర్శి భాద్యతలు అప్పగించారని, తదుపరి 2021 అక్టోబర్ 29న జరిగిన పార్టీ మండల మహాసభలో ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఎన్నికైనట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ తనపై పెట్టిన భాద్యతకు అనుగుణంగా వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలే మిన్నగా భావించి నీతి, నిజాయితీలకు కట్టుబడి పార్టీ గౌరవాన్ని, పార్టీ ప్రతిష్ఠతను ప్రజల్లో మరింత పెంచుతూ పార్టీ అభివృద్ధి కోసం ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శక్తిమేరకు కృషి చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధానంగా విజయకాలనీ గిరిజనుల భూపోరాటం, చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపైన, శివలింగాపురం పైగుంపుకు కరెంట్ కోసం, కోరేగడ్డ నిర్వాసితులకు నష్టపరిహారం కోసం ఇలా అనేక పోరాటాలు నిర్మించి అందులో కొన్నిటిని సాధించినట్లు పేర్కొన్నారు. పార్టీ రోజువారీ పైకమిటీ పిలుపుల కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తూనే గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే పోడుభూమి, మంచినీరు, రోడ్లు, పింఛన్లు, తదితర సమస్యలు పరిస్కారమయ్యే దిశగా కార్యాచరణ అమలు చేస్తూ ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. ఆఫీస్ కేంద్రంగా నివాసం ఉండి నిరంతరం ఆఫీసు నిర్వాణహణ, ప్రజాసంఘాల పునర్నిర్మాణం పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
also read :-ఉద్యమాల పురిటిగడ్డ… చిన్న గూడూరు
also read :- అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు…!
పార్టీ సభ్యులతోగానీ, నాయకులతోగాని ఎటువంటి విబేధం, విరోధము లేదని పేర్కొన్నారు. తన ప్రకటనలో అనారోగ్య సమస్యలే పార్టీ నుంచి వైదొలగానికి కారణమని కొండా చరణ్ చెప్పినప్పటికీ ఇంత ఆకస్మికంగా, అంత ఈజీగా సీపీఎం మండల కార్యదర్శి తప్పుకోవడం ఉండదనేది అందరికీ తెలిసిందే. అసలు చర్ల మండల సీపీఎంలో ఏమి జరుగుతోంది. చరణ్ పార్టీలో ఇమడలేక పోవడానికి కారణాలు ఏమిటి అనేది ఇపుడు చర్లలో ప్రధాన చర్చనీయాంశమైంది. చరణ్ రాజీనామాపై సీపీఎం పైనాయకత్వం ఎలా స్పందిస్తుందనేది రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు….