పుష్ప తరహాలో టేకు కలప స్మగ్లింగ్
== లారీని పట్టుకున్న అటవీ అధికారులు
== పరారీలో డ్రైవర్
నూగురు వెంకటాపురం/మే19(విజయం న్యూస్):-
పుష్ప సినిమాలో కథానాయకుడు అధికారుల కళ్ళుగప్పి ఎర్రచందనాన్ని తరలించడంలో విభిన్న మార్గాలను ఎంచుకొని అక్రమ వ్యాపారాన్ని సాఫీగా కొనసాగిస్తుంటాడు. అలాంటి సంఘటన ములుగు జిల్లా, వాజేడు మండలం, చతిష్ ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే టేకు కలపను ముందుగానే లారీలో అమర్చి, అనుమానం రాకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం వాటిపై ఇసుకను నింపి తరలిస్తున్న క్రమంలో అటవీ అధికారుల వలకు చిక్కారు. ముందుగానే అందిన సమాచారంతో పలుచోట్ల మాటేసిన అధికారుల చర నుండి తప్పించుకునేందుకు టేకులగూడెం అటవీ ప్రాంగణంలో సేద తీరుతున్న వాహనాన్ని గుర్తించి అటవీ నిఘా బృందం పట్టుకున్నారు. అటవీ అధికారులను గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని విడిచి పరారైనట్లు అటవీ రేంజ్ అధికారి చంద్రమౌళి తెలిపారు. పట్టుకున్న వాహనాన్ని వెంకటాపురం రేంజ్ కార్యాలయానికి అధికారులు తరలించారు. లారీ పట్టుబడ్డ ప్రాంతం కృష్ణాపురం సెక్షన్ పరిధిలో కేసు నమోదు చేసినట్టు మీడియాకు తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలలో ఇసుక లారీలు అధికంగా ప్రయాణిస్తుండడం చేత ఎవరికి అనుమానం కలగదనే దుండగుల ఆలోచనను అటవీ నిఘా బృందం చెక్ పెట్టడంతో పలువురు అధికారుల పనితీరును ప్రశంసిస్తున్నారు. టేకు స్మగ్లింగ్ ను చూసిన ప్రజలు పుష్ప సినిమాను యాది చేస్తుందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనాప్పటికీ సినిమాల ప్రభావం నిజ జీవితంలో పడుతుందనడంలో ఇటువంటి సంఘటనలే నిదర్శనంగా మారుతున్నాయి. ముందు ముందు ఇలాంటి అక్రమాలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.