Telugu News

ఖమ్మం నగరంలో పారిశుధ్య పనులు వేగవంతం చేయండి: మంత్రి

సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశించిన మంత్రి పువ్వాడ 

0

ఖమ్మం నగరంలో పారిశుధ్య పనులు వేగవంతం చేయండి: మంత్రి

== సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశించిన మంత్రి పువ్వాడ 

ఖమ్మం, జూలై 28(విజయంన్యూస్):

భారీ వర్షాలు, మున్నేరు వరద అనంతరం పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం టిటిడిసి సమావేశ మందిరంలో అధికారులతో వరద అనంతరం చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నేరు స్వల్పంగా శాంతించిందని, ముంపు బాధితులకు అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. ప్రజా రవాణాను ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రమాద స్థాయికి ఉన్న ప్రాంతాల్లో తప్ప క్షేమకరం దారులన్నీ పునరుద్ధరించాలని మంత్రి అన్నారు. వాహనాల రాకపోకలు మూసివేసిన ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై రవాణా అనుమతించాలని తెలిపారు. మున్నేరు శుక్రవారం మధ్యాహ్నం నాటికి 21.10 అడుగులు ఉందని, 19 అడుగులకు చేరిన అనంతరం కాల్వొడ్డు మున్నేరు పై వాహనాలు అనుమతించాలని సూచించారు. పూర్తి స్థాయిలో మున్నేరు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో  అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తతో బ్లీచింగ్ చల్లి, మురుగు తొలగించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 సీట్లతో ఈ ఏడాది ప్రారంభం: మంత్రి

ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా ఉండాలని అన్నారు. సురక్షిత త్రాగునీరు ఎంతో ముఖ్యమైన విషయమని, దీనిపట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.      సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని, అవసరమైన సిబ్బందిని ఇతర మునిసిపాలిటీల నుండి రప్పించాలని అన్నారు. నగరంలో 7 బస్తీ దవాఖానాలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బందిని చుట్టుప్రక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి విధుల్లో నియమించాలని అన్నారు. క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. సురక్షిత త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.      సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, వరద భీభత్సం అనంతరం ఆరోగ్యం, ఇతర సమస్యలు లేకుండా చూడడం అధికారుల ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు. ప్రభుత్వం చేపట్టే చర్యలు ప్రజల మంచి కోసమే అని భావించి, ప్రజలు, అధికారులకు సహకరించాలని తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, వరద నీటికి భయపడకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేసారన్నారు. వరదల అనంతరం బురద, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సమిష్టి గా పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలన్నారు.      పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం చక్కగా పనిచేసి, ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తొలగించాలన్నారు. ముంపు బాధితుల సహాయానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పై మంత్రి పువ్వాడ సమీక్ష..
ఈ సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, మధుసూదన్ నాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా,  ఇరిగేషన్ సిఇ శంకర్ నాయక్, అదనపు డిసిపి ఏ.ఎస్.సీ. బోస్, జెడ్పి సిఇఓ అప్పారావు, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, ఎసిపిలు,
జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.