దళితులకు గుడ్ న్యూస్.. దళితబంధు నిధులు విడుదల
ప్రతి నియోజకవర్గానికి రూ.50కోట్ల.. చింతకానికి రూ.100 కోట్లు విడుదల
దళితులకు గుడ్ న్యూస్
** ’దళితబంధు‘ నిధులు విడుదల చేసిన సర్కార్
** ప్రతి నియోజకవర్గానికి రూ.50కోట్ల.. చింతకానికి రూ.100 కోట్లు విడుదల
** నేరుగా కలెక్టర్ ఖాతాల్లోకి జమ..
** హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
(హైదరాబాద్ –విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు తీపికబురు చెప్పింది. ఎన్నికల కోసమే ఈ పథకం వచ్చిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న ఈ తరుణంలో దళితబంధు ఎన్నికల పథకం కాదని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. దళితబంధు పథకంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలకు గాను నిధులు విడుదల చేశారు. నియోజకవర్గానికి రూ.50 కోట్లు చొప్పున మూడు నియోజకవర్గాలకు రూ.150 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లు జమ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దళితబంధు నిధులను విడుదల చేయడంతో దళిత సంఘాలు రాష్ట్ర వ్యాపంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
** విడుదలైన నిధుల వివరాలు..
– సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ. 50 కోట్లు.
– ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు.
– నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు.
– కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ. 50 కోట్లు.