Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
జులై 2 న ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ సభ
== భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగిలేటి చేరిక*
== తెలంగాణ గర్జన సభ వేదికపై భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించనున్న రాహుల్ గాంధీ*
== లక్షల మందితో జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన*
== ఖమ్మంలో ప్రవేశించే భట్టి యాత్రకు ఘన స్వాగతం పలకనున్న పొంగులేటి*
== భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సక్సెస్*
== భట్టి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన*
== మీడియా సమావేశంలో వెల్లడించిన మాణిక్ రావు ఠాక్రే*
== పాదయాత్ర ముగింపు బహిరంగ సభ పై భట్టిని కలిసి చర్చించిన మాణిక్రావు ఠాక్రే*
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనంగా సన్మానం చేస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిల్లగూడెం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దే దించుడే ఏకైక లక్ష్యం: పొంగులేటి
ఏఐసీసీ నిర్దేశించిన మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకువెళ్లడంలో భట్టి విక్రమార్క సఫలీకృతమయ్యారని వెల్లడించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదని వివరించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర, ఏఐసిసి దిశా నిర్దేశం ప్రకారంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేశారని తెలిపారు. ఈ యాత్రలు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు కొనసాగిన పాదయాత్రలో ఏఐసీసీ, పిసీసీ నాయకత్వం పాల్గొన్నారని వెల్లడించారు. మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముయ్యనున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 02న నిర్వహించే తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు, పాదయాత్ర ముగింపు నిర్వహణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి కోఆర్డినేషన్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
తెలంగాణ ప్రజల బాగుకోసం యుపిఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, తెలంగాణ ప్రజలు బాగుపడలేదని అన్నారు. ప్రజల సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనక దాగివున్న ఉద్దేశం ఏంటి అని కేసీఆర్ ను ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి కెసిఆర్ కు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. కెసిఆర్
ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజలది కాదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి లాభం చేకూర్చే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఇప్పటికి జైల్లోనే ఉన్నారని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సైతం విచారణ చేశారని, అదే స్కాంలో నిందితురాలుగా ఉన్న కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఇవ్వాల, రేపు అరెస్టు చేస్తామని హడావిడి చేసిన దర్యాప్తు సంస్థలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో చేరే లిస్ట్ ను ప్రకటించిన ఏఐసీసీ
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇద్దరు ఒక కేసులో నిందితులైనప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలలో నిరుద్యోగ లకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వెల్లడించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత కొత్త కలయిక తోటి కాంగ్రెస్లో సరికొత్త జోష్ కనిపిస్తుందని వివరించారు. కాంగ్రెస్కు రాష్ట్రవ్యాప్తంగా అనుకూల పవనాలు కనిపిస్తున్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి
మీడియా సమావేశానికి ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎఐసిసి జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 1221 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా భట్టిని వారు అభినందించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించి తెలంగాణ గర్జన సభ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో జాయిన్ అయ్యారు.

Vijayam Daily (విజయం డైలీ) is a Telugu News Network, Vijayamdaily News provide Latest and Breaking News in Telugu (తెలుగు ముఖ్యాంశాలు, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్). Vijayam Daily brings the latest Andhra Pradesh news headlines, Telugu News and Live News Updates on Telangana. Find Telugu Latest News, Videos & Pictures on Telugu and see latest updates only on vijayamdaily.com
Next Post