Telugu News

తెలంగాణ సిరుల గని సింగరేణి : మంత్రి పువ్వాడ

వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్

0

 తెలంగాణ సిరుల గని సింగరేణి : మంత్రి పువ్వాడ

బీజేపీ హఠావో సింగరేణి బచావో

సింగరేణిని వేలం వేస్తే మహోద్యమం తప్పదు

సింగరేణిని కాపాడుకుంటాం..మోడీకి గుణపాఠం చెపుతాం

వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మహాధర్నా

హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఎంపీలు, ప్రజాప్రతినిధులు

(భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ సిరుల గని సింగరేణి, ఆ సింగరేణిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. తాజాగా సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్తగూడెం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని..

ఇదికూడా చదవండి: సింగరేణి కాపాడుకుంటాం.:రేగా కాంతారావు

 

తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని అన్నారు.ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్న కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందని అజయ్ కుమార్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నామని కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.  తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను భారత రాష్ట్ర సమితి తరపున, అలాగే తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

ఈ మేరకు సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని మంత్రి అజయ్ ఆరోపించారు.  లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని దుయ్యబట్టారు. పోరాటాల పురుటిగడ్డ అయిన తెలంగాణలో.. ఎట్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం పైకోమాట.. అంతర్గతంగా లోపలో కుట్రకు తెర లేపుతుందని అన్నారు.న మరోసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణకు ఏమి చేశారు అని దుయ్యబట్టారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా అని నిలదీశారు.సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు.సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోంది మంత్రి పువ్వాడ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసిఆర్ గారి సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ బరిలో తమ్మినేని

బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని… మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిందన్నారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంతో.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు.

== తెలంగాణ సిరుల గని సింగరేణిని వేలం వేస్తే మహోద్యమం తప్పదు: రేగా కాంతారావు

తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని, కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటీకరణ కుట్రలకు తెర లేపిందని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణ్‌పల్లి, పెనగడప గనులకు మరోసారి వేలంకు నోటిఫికేషన్ వేసిందని అయా ప్రక్రియలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మహోద్యమం చేపడతామని ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు  హెచ్చరించారు. తెలంగాణకు సిరుల గని అయిన మన బొగ్గు గనులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా బొగ్గు గనుల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుని, ప్రజల ప్రయోజనాలు, వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

== సింగరేణి మనకు దూరం చేసే కుట్ర జరుగుతోంది: గాయత్రి రవి

దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పించిందని, రోడ్లు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి మనకు అశ్రమాన్ని కల్పించిందన్నారు. నేడు కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణిని మనకు దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం పై రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: బీజేపీ హటావో దేశ్ కీ బచావో పేరుతో సీపీఐ బస్ యాత్ర: కూనంనేని

సింగరేణిని ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, బొగ్గు గనుల్లో వచ్చే లాభాలను పంచే సంస్థ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్‌లు, అలవెన్సులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతయన్నారు..సింగరేణి ఉద్యోగులకు అత్యధిక బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయాడని, ఇది సహించలేని కేంద్రం దాని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని విమర్శించారు.

== ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ రక్షగా నిలబడటం వల్లనే సింగరేణి మిగిలింది : సండ్ర

ముఖ్యమంత్రి కేసీఅర్ శ్రీరామ రక్షగా ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా సింగరేణి ఇంకా మిగిలి ఉందని లేకపోతే దాన్ని ఇప్పటికే కార్పొరేట్ లకు దరాదత్తం చేసి ఉండేవారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.

సింగరేణి నీ ప్రైవేటీరణ చేయమని చెప్పి మళ్ళీ గనులకు వేలంకు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. సింగరేణి ఏ విధంగా ప్రైవేటు పరం చేస్తారో మేము కూడా చూస్తామన్నారు. ప్రతి ఏడాది లాభాలలో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టకుండా కుట్రలతోనే సమర్థవంతమైన అధికారులను తప్పిస్తారాని తప్పించేందుకు కేంద్రం కుట్రలు చేస్తారని అన్నారు. విదేశాలకు ముందు మోడీ వెళతారు ఆ తరువాత అదాని వారి వెనకాల పోతారని, నీ స్నేహితులైన ఆదానికి ప్రభుత్వ సంస్థలను బంగారు పళ్లెంలో పలహరంలా పెడతావని, కేవలం వాళ్లకు మేలు చేసేందుకే ప్రభుత్వ అసుతులను, ప్రభుత్వ సంస్థలను అమ్మి వారికి లాభం చేకూర్చడం సిగ్గుచేటన్నారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి  పంపాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్యఉద్దేశం అని అన్నారు.. సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు.. ఇది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. దీన్నీ అమ్మాలని చూస్తే తెలంగాణ సమాజం గుండెల్లో రగులుతున్న అగ్నిని మీరు చూడల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో తిరంగా మార్చ్ నిరసన.. హాజరైన ఖమ్మం ఎంపీలు

వందే భారత్ రైళ్ళను ఇప్పటికే 10సార్లకు పైగా ప్రధాని మోడీ ప్రారంభించారని, ఒకే రైలును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.సింగరేణి వేలం విషయంపై కేంద్రం వెనకి తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తామని,  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఅర్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ నేతృత్వంలో మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు,సండ్ర వెంకటవీరయ్య,కందాల ఉపేంద్ర రెడ్డి,మెచ్చ నాగేశ్వరరావు,బాణోత్ హరిప్రియ, లావుడ్యా రాములు నాయక్,ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ లు నాగభూషణం, శేషగిరిరావు,మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రావు,  గ్రంధాలయ సంస్థ చైర్మన్లు రాజేందర్, ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు వెంకటేశ్వరరావు, సీత మహాలక్ష్మి మరియు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.