Telugu News

సీఎం కేసీఆర్ పై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

పొత్తుల సంగతి అప్పుడే చూస్తామంటూ వ్యాఖ్య

0

దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదం
– లౌకిక శక్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
– రాజ్యాంగ ధర్మాలనూ మార్చేందుకు కుట్ర
– కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
– దక్షిణ తెలంగాణలోని నీటి వనరులపైనా దృష్టి పెట్టాలి
– ఎన్నికల పొత్తులకు సమయం ఇంకా రాలేదు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ధర్మాలనూ మార్చి మను ధర్మాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మునుగోడు ఎన్నికల అనంతరం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించిన అంశాలు, భవిష్యత్ ప్రజా ఉద్యమాలను మీడియాకు వివరించారు. దేశంలో బీజేపీ భావజాలం, విషసంస్కృతి విస్తరించే ప్రమాదముందన్నారు.

ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ గడల సంచలన వ్యాఖ్యలు

లౌకికశక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు‌ ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మధ్యయుగాల నాటి అభివృద్ధి, చాతుర్వర్ణ వ్యవస్థ అమలుకు అడ్డుగా ఉన్న రాజ్యాంగ ధర్మాలను సైతం మార్చేందుకు పూనుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ప్రైవేటీకరణ దిశగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్న తీరును ఖండించారు. పౌరసత్వ సవరణ, ప్రతిపక్షాల అణచివేత, రాష్ట్రాల హక్కులను హరించేలా బీజేపీ విధానం ఉందన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న విధానాలు- ప్రజలకు జరుగుతున్న నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అపరిష్కృత సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు. పోడు భూముల విషయంలో చట్టప్రకారం సర్వే నిర్వహించాలని సీఎం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఎఫ్ఆర్సీలు, గిరిజన, రెవెన్యూశాఖలను విస్మరించి అటవీశాఖకు సర్వే బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. పొజిషన్ లో ఉన్న ప్రతిఒక్కరి భూమి సర్వే చేయాలన్నారు. వలస ఆదివాసీలకు హక్కు లేదనడం సరికాదన్నారు. వలస ఆదివాసీలను నక్సల్స్ గా చిత్రీకరించడం తగదన్నారు.

ఇది కూడా చదవండి: ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది రానివ్వం:మంత్రి

అర్హులందరికీ పట్టాలివ్వాలని కోరారు‌. అసంఘటిత రంగ కార్మికుల వేతన జీవో సవరించాలని డిమాండ్ చేశారు. 1998, 2008 డీఎస్సీ అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. స్పౌజ్ సమస్యను పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ళ జాప్యాన్ని నివారించాలన్నారు. పంటలపై తామర నల్లి ప్రభావం మళ్లీ ప్రారంభమైందని, నివారణ చర్యలు తీసుకోవసలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఇలాగే నిర్వహిస్తే ప్రాజెక్డు పూర్తయ్యేందుకు 40 ఏళ్లు పడుతుందన్నారు. దక్షిణ తెలంగాణలో నీటివనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో లౌకిక, జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలుపుకు పోతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్ పాల్గొన్నారు.