Telugu News

ఉత్తరప్రదేశ్ అందుకే గెలిచిందా..?

(లక్నో- విజయంన్యూస్

0

ఉత్తరప్రదేశ్ అందుకే గెలిచిందా..?
(లక్నో- విజయంన్యూస్)
మిస్టర్‌ బుల్‌డోజర్‌.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు.. ఎవరు ఎన్ని అనుకొన్నా వదలి పెట్టరు.. ఇలా ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా విమర్శించినా.. మూడు వ్యవసాయ చట్టాలపై పశ్చిమ యూపీలో అసంతృప్తి ఉన్నా.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అరాచకం సృష్టించినా.. ఎన్ని వ్యతిరేక అంశాలు ఎదురైనా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు యోగి నేతృత్వంలోని భాజపాకు పట్టం కట్టారు.

మరోపక్క యోగి అన్నంతా చేశారు.. ‘నొయిడా అపశకునం’ కేవలం బూటకమని నిరూపించారు. తాను విజయం సాధించడంతో పాటు.. పార్టీని కూడా అధికారంలోకి తెచ్చారు. యూపీలో విజయం కోసం కేంద్ర-రాష్ట్ర భాజపా నాయకత్వాలు సమష్టిగా కృషి చేసినా.. యోగి ఛరిష్మా ఇక్కడ బాగా అక్కరకొచ్చిందనే చెప్పాలి. దేశరాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో లభించిన విజయంతో 2024 ఎన్నికలకు భాజపా రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు. యూపీలో భాజపా విజయానికి ప్రధాన కారణాలు..

also read;-వనమా రాఘవకు బెయిల్
యోగి వ్యక్తిగత ఆకర్షణ..
జాతీయ రాజకీయాల్లో భాజపాకు నరేంద్ర మోదీలా.. యూపీ రాజకీయాల్లో యోగి వ్యక్తిత్వం ఓటర్లను ఆకర్షిస్తోంది. స్థానిక భాజపా నాయకుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా.. సీఎం యోగిపైకి అది మళ్లలేదు. యోగి ఆదిత్యనాథ్‌పై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం బాగా కలిసొచ్చే అంశం. కీలకమైన 36 మంత్రిత్వశాఖలను తన ఆధీనంలోనే ఉంచుకొన్నారు. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం ఉన్న హోం, రెవెన్యూ, హౌసింగ్‌, మైన్స్‌ వంటి కీలక శాఖలు వీటిల్లో ఉన్నాయి. యోగితో పోలిస్తే ఆయన ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ కుటుంబంపై పలు ఆరోపణలున్నాయి. ఎంత వివాదాస్పద అంశమైనా యోగి ముక్కుసూటిగా తన అభిప్రాయం చెబుతారనే పేరుంది.

80-20’ ‘యూపీ మరో పశ్చిమబెంగాల్‌ అవుతుంది’ అంటూ బహిరంగంగా హిందుత్వ వ్యాఖ్యలు చేయడం వంటివి దీనికి ఉదాహరణలు. సగటు రాజకీయ నాయకుడిలా నాన్చుడు ధోరణి కనిపించదు. ఇది ముఖ్యంగా యువతను బాగా ఆకర్షించే అంశం. భాజపాలో మోదీ 2.0గా యోగికి పేరుంది. ఇటీవల ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో భాజపా తరపున మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా యోగి నిలిచారు. యోగి వయస్సు 49 సంవత్సరాలే. రాజకీయాల్లో ఈ వయస్సు వారిని యువత కిందే లెక్కగడతారు. వ్యక్తిగత ఛరిష్మా, వయస్సు ఆయనకు యూపీ భాజపాలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వంటి వారి నుంచి పోటీ లేకుండా చేసింది.

also read;-టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు
== మహిళా ఓట్‌ బ్యాంక్‌ మద్దతు..
యూపీలో నేరాలను అదుపు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ అనుసరించిన వైఖరికి మహిళల నుంచి మద్దతు లభించింది. ఈ సారి పలు ఎన్నికల సర్వేల్లో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు భాజపా పక్షాన నిలిచినట్లు తేలింది. కొవిడ్‌ సమయంలో ఉచిత రేషన్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటివి మహిళలు భాజపాకు మద్దతు ఇచ్చేందుకు ఉపయోగపడ్డాయి. ఈ సర్వేల్లో భాజపాతో పోలిస్తే ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌ వాదీకి దాదాపు 15శాతానికి పైగా తక్కువగా మహిళల మద్దతు ఉంది. పీఎం ఆవాస్‌ యోజన పథకంలో మహిళలకే యాజమాన్య హక్కును కల్పించడం భాజపాకు వారిని దగ్గర చేసింది. మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు స్కూటర్లు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి హామీలను కూడా ఇచ్చింది.
== నేరగాళ్ల అణచివేత..
యూపీలో లా అండ్‌ ఆర్డర్‌ అంశం చాలా కీలకం. 2007లో ఇదే అంశంపై వాగ్దానాలు చేసి బీఎస్పీ గెలిచింది. కానీ, ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. సమాజ్‌ వాదీ ప్రభుత్వ హయాంలో నేరగాళ్లకు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. ఒక రకంగా సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి ఇది కారణమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొన్నారు. హోంశాఖ తన ఆధీనంలోనే ఉంచుకోవడంతో యూపీలో నేరగాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. ఒక దశలో కొందరు జైళ్లలో ఉండటమే మంచిదని భావించే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం ఐదేళ్లలో 182 మంది నేరగాళ్లను హతమార్చగా.. కీలక ఆపరేషన్లలో 4,206 మందికి కాళ్లపై కాల్పులు జరిపారు.

alos read ;-ఆర్టీసీ బ‌స్సు దుర్ఘటన‌పై మంత్రి అజయ్ దిగ్భ్రాంతి

1,625 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. యోగి పాలనలో మొత్తం 72శాతం బందిపోటు ఘటనలు, 62శాతం దోపిడీలు, 31శాతం హత్యలు, 50శాతం అత్యాచారాలు తగ్గినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
ఈ క్రమంలో భాజపా మద్దతు వర్గాల్లోని నేరగాళ్లను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. వీరిలో వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ కారణంగా యూపీ బ్రాహ్మణ-ఠాకూర్‌ వర్గ విభేదాలకు కారణమైంది. కానీ, ఎన్నికల సమయంలో అజయ్‌ మిశ్ర కుమారుడికి బెయిల్‌ రావడం వంటి అంశాలు బ్రాహ్మణ వర్గాల్లో ఆగ్రహాన్ని కొంత తగ్గించి భాజపాతో కలిసి నడిచేట్లు చేశాయి. ఇక ముక్తార్‌ అన్సారీ వంటి యూపీ బాహుబలి పంజాబ్‌ జైళ్లలోనే ఉంటానంటూ మొరాయించే పరిస్థితి కల్పించారు. ఇవన్నీ లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో యోగీ శైలికి ప్రజల్లో మద్దతు పెంచాయి.
== ఫలించిన పథకాలు ..
కేంద్ర ప్రభుత్వ పథకాలను యూపీలో బలంగా అమలు చేశారు. 2.4 కోట్ల మందికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, 1.5 కోట్ల మందికి పీఎం ఉజ్వల, 7.8 కోట్ల జన్‌ధన ఖాతాలు, 80లక్షల కుటుంబాలుకు ఉపాధి హామీ , 10.2 కోట్ల మందికి పీఎం ఆవాస్‌, 1.3 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌, రూ.36 వేల కోట్లతో పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాలను అమలు చేశారు. ఇక విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌ అలవెన్స్‌ కేటాయింపు వంటివి భాజపాకు మతాలకు అతీతంగా ఓట్లను తీసుకొచ్చాయి. ముఖ్యంగా పథకాలు పేదలకు చేరేట్లు చూసుకొంది. ఉదాహరణకు కిసాన్‌ నిధి, ఉజ్వల పథకాల లబ్ధిదారులను కలిపితే దాదాపు నాలుగోవంతు యూపీ ఓటర్లు ఉంటారు.
== కొవిడ్‌ సమయంలో ఉచిత రేషన్‌..
కొవిడ్‌ తొలినాళ్ల నుంచి పేదలు ఇబ్బంది పడుతుండటంతో యోగి సర్కారు ఒక్కో వ్యక్తికి 5 కిలోల గోధుమలు, 5 కిలోల బియ్యం, దీంతోపాటు కుటుంబానికి లీటర్‌ రిఫైన్డ్‌ నూనె, కిలో చక్కెర, ఉప్పు అందజేస్తోంది. 18ఏళ్ల లోపువారితో కలిపి 15 కోట్ల మంది యూపీ వాసులు రెండేళ్లుగా ఈ ప్రయోజనాలు పొందుతున్నారు.
== బలమైన కులాల కూడికలు..!
యూపీలో అధికారం చేపట్టాలంటే కులాల కూడికలు.. తీసివేతలు బాగా తెలియాలి. ఈ సారి భాజపా కుల సమీకరణలను అత్యంత చాకచక్యంగా నిర్వహించింది. సమాజ్‌వాదీకి మద్దతుగా నిలిచే ‘యాదవ’, బీఎస్పీకి మద్దతుగా నిలిచే ‘జాతవ్‌’ కులాల నుంచి భాజపాకు వచ్చే ఓట్లు కొంత తక్కువగానే ఉంటాయని కమలనాథులు గ్రహించారు. ఎస్పీ (సమాజ్‌వాదీ పార్టీ) అధికారంలో ఉన్న సమయంలో నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన జాతవ్‌ల్లో ఉంది. యూపీలో 21శాతం ఉన్న దళిత కులాల్లో వీరే అత్యధికంగా ఉంటారు. దీంతో బేబీరాణి మౌర్య, దుష్యంత్‌ గౌతమ్‌ వంటి దళిత దిగ్గజాలను వారిని కమలం గుర్తు తరపున బరిలోకి దింపారు. ఫలితంగా దాదాపు 30శాతం వరకు ఈ ఓటింగ్‌ భాజపాకు దక్కే అవకాశాన్ని సుగమం చేసుకొన్నారు. మరోపక్క బీఎస్పీ బలహీనంగా ఉండటంతో భాజపా వైపు మళ్లిన వారు కూడా ఉన్నారు.

ఇక మిగిలిన దళిత వర్గాల్లో పాసి, దోబీ, బింద్‌, కోలీ, ముస్‌హర్‌, హారీల జనాభా 11శాతం ఉంది. వీరు గతంలో బీఎస్పీ పాలన సమయంలో జాతవ్‌లకు లభించిన ప్రాధాన్యంపై ఆగ్రహంగా ఉన్నారు. వీరు భాజపా పక్షాన బలంగా నిలిచారు. ఇక యూపీలో 44 శాతం ఉండే ఓబీసీల్లో ఎస్పీ పాలన సమయంలో యాదవులకు ప్రాధాన్యం లభించిందనే ముద్ర ఉంది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీలో నిలవడంతో భాజపా పరిస్థితిని మార్చేసింది. వెనుకబడిన ఘాంచీ కులానికి చెందిన వ్యక్తిగా మోదీ ఓబీసీలను ఆకర్షించారు. ఆ తర్వాత నుంచి యాదవేతర ఓబీసీలు భాజపాకు అండగా నిలిచారు. 35శాతం ఉన్న వీరి ఓటింగ్‌ 200 స్థానాల్లో ప్రభావం చూపించింది. 2017 ఎన్నికల్లో భాజపాకు అధికారం ఇప్పించడంలో వీరిదే కీలక పాత్ర. ఈ సారి కూడా వీరు భాజపా పక్షాన నిలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాగుచట్టాలు జాట్ల ఓట్లను భాజపాకు దూరం చేశాయనే ప్రచారానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. ఈ కులం ఎక్కువగా ఉండే పశ్చిమ యూపీలో కూడా మెజార్టీ స్థానాల్లో కమలం వికసించింది. ఇక్కడ మిగిలిన హిందూ కులాలు కూడా భాజపాకు బలమైన మద్దతు ఇచ్చాయి.
== ప్రతిపక్షాలకు ఓ హెచ్చరిక..
ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఆయుధాలుగా మలిచి వారిపైనే ప్రయోగించడంలో ప్రధాని మోదీ దిట్ట. గతంలో చాలా ఎన్నికల్లో ఈ శైలిని చూశాము. 2017లో గుజరాత్‌ ఎన్నికల సమయంలో మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన కామెంట్లు భాజపా ఆయుధంగా వాడుకొంది. తాజాగా యూపీ ఎన్నికల్లో ‘‘ చివరి రోజుల్లో కాశీకి వస్తారు’’ అంటూ అఖిలేశ్‌ చేసిన కామెంట్లను మోదీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో వాడుకొన్నారు. తాను కాశీలో చనిపోవడాన్ని గౌరవంగా భావిస్తానంటూ భావోద్వేగాలు ప్రేరేపించారు.
== హిందుత్వ ముద్ర..
హిందుత్వ ముద్ర ఈ సారి కూడా భాజపాకు కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రారంభం. యోగి హయాంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ వంటి అంశాలు హిందూ ఓటర్లు భాజపా వెన్నంటి నడిచేలా చేశాయి. ఎన్నికల ప్రచార సమయంలో హిజాబ్‌ వివాదం వంటివి చెలరేగడం హిందుత్వ ఓట్లు ఏకం కావడానికి కారణం అయ్యాయి. మతమార్పిడి నిరోధక చట్టానికి సవరణలు చేసి లవ్‌జిహాద్‌కు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష వంటి హామీలను భాజపా ఇచ్చింది.

రైతు వ్యతిరేక ముద్రను పోగొట్టుకునేలా హామీలు.. సాగుచట్టాలతో భాజపాకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో.. యూపీ ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా హామీలు ఇచ్చింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గోధుమ, వరికి కనీస మద్దతు ధర వంటివి ప్రకటించింది.
== బలహీన ప్రతిపక్షాలు..
ఒక సమాజ్‌ వాదీ పార్టీ మినహా మరే పార్టీ భాజపాకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇవి రెండంకెల సీట్లను సాధించడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితి భాజపాకు కలిసొచ్చింది