క్రీడాల్లో తెలంగాణ ముందుండాలనేదే లక్ష్యం: మంత్రి పువ్వాడ
== ఊరూరా క్రీడాప్రాంగాణాలను ప్రారంభించాం
== ఖమ్మం జిల్లా క్రీడాకారులకు పెట్టిన పేరు
== టెన్నిస్ క్రీడా ప్రాంగణం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రం క్రీడాపోటీల్లో ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఊరూరా క్రీడాప్రాంగాణాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.96లక్షల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన 3 సింథటిక్ టెన్నిస్ కోర్టులను మంత్రి పువ్వాడ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి: పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ
తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది తార్కాణమని, ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మించిన మూడు టెన్నిస్ కోర్టుల ద్వారా క్రీడాకారులు మంచి శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఖమ్మం జిల్లా ప్రతిష్టను దేశ స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు. పటేల్ స్టేడియంలో ఇప్పుడు అన్ని క్రీడలకు వేదిక గా మారిందని, స్టేడియంకు కొత్త సౌకర్యాలు జోడించి అందమైన కళాఖండాలతో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయని అన్నారు. కోటి రూపాయలతో కార్యాలయ స్థలం, రూ.25 లక్షలతో స్కేటింగ్ రింక్, స్టేడియంలో క్రికెట్ టర్ఫ్ వికెట్, అథ్లెటిక్స్ సాండ్ ట్రాక్, అథ్లెటిక్స్ ఇండోర్ స్టేడియం ఇలా అనేక క్రీడలకు ప్రత్యేక నిధులతో అభివృద్ది చేసుకున్నాం అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అనేక సౌకర్యాలు లేక అస్తవ్యస్తంగా ఉండేదని అన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత చాలా దృడ సంకల్పంతో నిశ్చయించామన్నారు. స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఖమ్మంను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అన్నారు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారని వారి ప్రతిభకు పదును పెట్టడానికి వారికి కావాల్సింది మంచి సౌకర్యాలు కల్పించి క్రీడాకారుల కోసం వసతిని అభివృద్ధి చేశామన్నారు.
ఇది కూడా చదవండి: కార్మిక, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:మంత్రి
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, కలెక్టర్ వీ.పి..గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా చైర్మన్ విజయ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా క్రీడా అధికారి పరందామ రెడ్డి, పీఆర్ఏఈ ఆదిత్య రాజ్, కార్పొరేటర్ చావా నారాయణ రావు, పగడాల నాగరాజు, కిసాన్ శ్రీనివాస్, మద్దినేని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.