Telugu News

తీగల వంతెన… జిల్లాకే మణి కిరీటం

తీగల వంతెన అప్రోచ్ రోడ్డు పనులను మే 15లోగా పూర్తి చేయాలి

0

తీగల వంతెన… జిల్లాకే మణి కిరీటం

తీగల వంతెన అప్రోచ్ రోడ్డు పనులను మే 15లోగా పూర్తి చేయాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

స్మార్ట్ సిటీ, అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షా సమావేశం

పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మేయర్, కలెక్టర్

(కరీంనగర్-విజయంన్యూస్);-

కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దుతామని, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు, తీగల వంతెన, మానేర్ రివర్ ఫ్రంట్ పనుల ప్రగతి, పెండింగ్ పనులు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్  ఆర్ వి కర్ణన్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేసిన కృషి వల్లనే కరీంనగర్ కు  స్మార్ట్ సిటీ వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాపస్ పోకుండా ఉండేందుకు వచ్చే నెల మార్చి 15వ తేదీ లోపు మంజూరైన స్మార్ట్ సిటీ  పనులను త్వరిత గతిన ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంకా పూర్తి చేయవలసిన పనులకు ఈ నెల చివరిలోగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని అన్నారు.

also read :-ఎలక్ట్రిక్‌ నానో కారులో రతన్‌ టాటా

కరీం నగరం నలువైపులా 4 కొత్త  సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కరీంనగర్ లోని కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో ఇప్పటికే టెండర్లు పిలిచి సమీకృత మార్కెట్ పనులు ప్రారంభించామని అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట నీటి పారుదల శాఖ కార్యాలయానికి గల 2.30 ఎకరాల స్థలంలో సమీకృత మార్కెట్ కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. పద్మా నగర్ లోని కరీంనగర్ డైరీ పక్కన రెండు ఎకరాల స్థలంలో, జగిత్యాల రోడ్డు లోని ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో మరో రెండు ఎకరాల స్థలంలో సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయం, టిబి ఆస్పత్రి స్థలాన్ని పార్కింగ్ కు వినియోగింఛాలని  మంత్రి సూచించారు.

నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కు సూచించారు. ప్రతిరోజు  రహదారులను పర్యవేక్షించాలని అన్నారు.   మానేరు జలాశయం కిందిభాగంలో మొదటి దశలో సుమారు ఏడు కిలోమీటర్ల మేర మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపడతామని మంత్రి వివరించారు. ఇందుకు గాను నీటిపారుదల శాఖ నుంచి రూ. 310 కోట్లు, పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాకు మణిహారంగా నిర్మించిన తీగల వంతెనను  జూన్ మొదటి వారంలో  ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయని రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పనులను వచ్చే మే నెల 15వ తేదీ లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.  తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ ల వల్ల జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని,  నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

also read :-నేలకొండపల్లి రామదాసుని మందిరంలో రామభక్తుని ఛాయ

స్మార్ట్ సిటీ పనులన్నింటినీ మార్చి 15వ తేదీ లోపు ప్రారంభించాలని నిధులు వాపస్ పోకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో  గణేష్ నగర్ బైపాస్ రోడ్డు,  ఎలగందుల పాత రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.  ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో నిర్మించనున్న ఆడిటోరియం పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  నగరంలో డంపింగ్ యార్డు ను మరో చోటకు తరలించాలని ఇందుకు కావాల్సిన ఆరు ఎకరాల స్థలాన్ని అప్పగించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. డంపింగ్ యార్డును ట్రీట్మెంట్ ప్లాంట్ గా పిలవాలని,  నగరపాలక సంస్థ ప్రతిరోజు సేకరించే 150 టన్నుల చెత్తను బయో మైనింగ్ చేయాలని తెలిపారు. ఆర్ అండ్ బి అతిథి గృహం, ఎమ్మెల్యే కార్యాలయం,  షాదీఖానా తదితర నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

also read;-ఖమ్మంలో ఘనంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ ను  సుందరంగా, పచ్చదనం గా తీర్చిదిద్దాలని సూచించారు.  రోడ్లు పార్కులు అభివృద్ధి చేయాలని అన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మల్టీపర్పస్ హైస్కూల్ ను హెరిటేజ్ చేయాలని,  ఇందులో లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని మార్చి 31 డెడ్ లైన్ లో గా పనులన్నీ పూర్తి చేసుకోవాలని కోరారు. పనులు పెండింగ్లో పెట్టవద్దని గుత్తేదారుల ను కోరారు. ఇంకా కావాల్సిన నిధులు మంజూరు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తెలిపారు. ఒకసారి వేసిన రోడ్లను తవ్వి పాడుచేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్లను తవ్వి పాడు చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని వినోద్ కుమార్ తెలిపారు.

ఈ సమావేశంలో  జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, నగరపాలక సంస్థ కమిషనర్ సేవ ఇస్లావత్, నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బీ శాఖ ఎస్ ఈ లు, ఈ ఈ లు, మున్సిపల్  ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు,  విద్యుత్ శాఖ ఎస్ఇ, పోలీస్ అధికారులు, స్మార్ట్ సిటీ ఏజెన్సీ ప్రతినిధులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు