పల్లెల్లో సందడే సందడి
** అంబరాన్ని అంటిన ‘సంక్రాంతి’ సంబురం ** మూడు రోజుల పాటు ఆనందోత్సవాల నడుమ వేడుకలు ** సంక్రాంతి రోజున పూజలు.. కనుమ రోజున సంబురాలు ** దేవాలయాలన్ని కిటకిట ** జోరుగా పంద్యాలు.. పంతంగుల సందడి ** ఇంటిళ్లపాది సంతోషంగా జరుపుకున్న పండుగ వేడుకలు ** మూడురోజుల అనంతరం ముగిసిన సంక్రాంతి పర్వదిన సంబురం
పల్లెల్లో సందడే సందడి
** అంబరాన్ని అంటిన ‘సంక్రాంతి’ సంబురం
** మూడు రోజుల పాటు ఆనందోత్సవాల నడుమ వేడుకలు
** సంక్రాంతి రోజున పూజలు.. కనుమ రోజున సంబురాలు
** దేవాలయాలన్ని కిటకిట
** జోరుగా పంద్యాలు.. పంతంగుల సందడి
** ఇంటిళ్లపాది సంతోషంగా జరుపుకున్న పండుగ వేడుకలు
** మూడురోజుల అనంతరం ముగిసిన సంక్రాంతి పర్వదిన సంబురం
(ఖమ్మం – విజయం న్యూస్) :-
ముగ్గుల సందడిలో మగువలు.. కోళ్ళ పంద్యాల్లో పురుషులు.. పతంగుల సందడిలో యువకులు, చిన్నారులు.. ఇంటింట పిండివంటలు..ఇంటిళ్లపాది సంతోష సంబురం.. అదే సంక్రాంతి పర్వదినం.. ఇంటిళ్ళిపాది సుఖసంతోషాలతో ఆనందోత్సవాల నడుమ సంబురంగా చేసుకునే పండుగ సంక్రాంతి.. ఆ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరు అద్భుతంగా జరుపుకున్నారు.
శుక్రవారం రోజున ప్రారంభమైన సంక్రాంతి పండుగ వేడులను మూడు రోజుల పాటు సంస్కతి సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా అంగరంగవైభవంగా జరుపుకున్నారు. మొదటి రోజున భోగి మంటలతో యువకులు సందడి చేయగా, రెండవ రోజున సంక్రాంతి పర్వదినాన్ని ఇంటిళ్లపాది సంబురంగా జరుపుకున్నారు. కనుమ రోజున ఇళ్లంత పూజల్లో మునిగిపోయారు. దీంతో మూడు రోజుల వేడుక అద్భుతంగా జరిగింది. ప్రతి ఇళ్లు సంతోషాల నడుమ సందడిగా మారింది.. దూరప్రాంతాల్లో ఉన్న బందువులు, చుట్టాలు, పనుల నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన జనం స్వంతూళ్లకు తరలిరావడంతో పల్లెలన్ని సందడిగా మారిపోయాయి. ఇంటిళ్లపాది సంతోషంగా గడిపారు. ఎన్నడు లేనంతగా మూడురోజుల పాటు సంతోషంగా గడిపారు.
also read :- రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ
** బోసిపోయిన పట్నం.. కళకళలాడిన పల్లెటూర్లు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెలన్ని సందడిగా మారాయి.. హైదరాబాద్,ఇతర నగరాల నుంచి పల్లెటూర్లకు, స్వంత ఊర్లకు జనం తరలిరావడంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించింది. పండుగంటే ఇలా ఉండాలి అనే విధంగా పల్లెలు జనంతో కళకళలాయి. ఏ ఇంటిలో చూసిన కుటుంబ సభ్యులతో సందడి కనిపించింది. చాలా రోజుల తరువాత స్నేహితులు కనిపించడంతో ముచ్చట్లలో మునిగిపోయారు. ముఖ్యంగా యువకులు చాలా సందడి చేశారు. పార్టీలు చేసుకున్నారు. స్నేహితులు, క్లాస్ మెంట్స్, ఆడబిడ్డల రాకతో పల్లెల్లో పాత రోజులు కనిపించాయి. మిత్రులు పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. దీంతో పల్లెలో పండుగ వాతావరణం అద్భుతంగా కనిపించింది. అయితే సంక్రాంతి పర్వదినంరోజున మాత్రం పట్టణాల్లోని కొన్ని వీధులు బోసి పోయాయి. పట్టణాల్లో ఉన్న వారంతా వారి స్వగ్రామాలకు తరలివెళ్లడం, లేదంటే పల్లెటూర్లలోని బందువులు, చుట్టాల ఇంటికి, స్నేహితుల వద్దకు వెళ్లడంతో పట్టణాలు బోసిబోయి కనిపించాయి. సంక్రాంతి పండుగ సమయంలో పల్లెల్లో గడపాలనే ఆలోచనతో పట్టణాలు చాలా వరకు సందడి కనిపించలేదు.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లోని పలు వీధులు బోసియినట్లు కనిపించాయి. ప్రతి పండుగకు సందడిగా ఉండే పట్టణాలు ఈ సంక్రాంతికి మాత్రం సందడి కనిపించలేదు.
also read :- ఘనంగా గోశాలలో విజయం దినపత్రిక ప్రారంభోత్సవం..,..
** అందమైన ముగ్గులు వేసిన మగువలు
సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు అందమైన ముగ్గులు వేయడం ఎన్నో ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మూడు రోజుల ముందునుంచే మహిళలు వారి ఇంటి ముందు అందమైన ముగ్గులను వేసి సందడి చేశారు. మహిళలు ముగ్గులు వేసే విషయంలో పోటీపడ్డారు. ఇంటిముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి, అందులో కూరగాయలు, రేగిపండ్లు సంస్కతి సంప్రధాయం ఉట్టిపడే విధంగా ముగ్గులను వేసి అలకరించారు. అలాగే చాలా గ్రామాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించి, మంచి ముగ్గులను వేసిన వారికి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.
** కోళ్ళ పంద్యాలలో సందడే సందడి
సంక్రాంతి పండుగ అంటే ముగ్గులతో పాటు ముఖ్యమైన వేడుక కోళ్ళ పంద్యాలు.. తెలంగాణ రాష్ర్టంలో అనుమతులు లేకపోయినప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రసరిహద్దులో కోళ్ల పంద్యాలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఆంద్రాశివారు ప్రాంతాల్లో కోళ్ల పంద్యాలకు అనుమతులు ఉండటంతో ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలందరు ఆ కోళ్ల పంద్యాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి సందడి చేశారు. కొంత మంది పంద్యాలో నేరుగా పాల్గొనగా, మరికొంత మంది వాటిని చూస్తు సందడి చేశారు. అక్కడ నడిచే పేకాట, దొంగబిల్ల ఆటలాంటి వాటిలో పాల్గొని సందడి చేశారు. కొంత మంది నష్టపోయినప్పటికి సంతోషంతో తిరిగి వచ్చారు. లాభాలు వచ్చిన వారు సంతోషంతో మరింత ఊపుతో పండుగను జరుపుకున్నారు.
** గ్రామాల్లో హరిదాసులు, గంగిరెద్దుల సందడి
సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో హరిదాసులు, గంగిరెద్దుల వారు సందడి చేశారు. ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ గంగిరెద్దును ఆడిస్తూ సందడి చేశారు. ప్రజలందరు వారికి సంతోషంగా డబ్బులు, ధాన్యంను అందజేశారు. హరిదాసులు కూడా ఇంటింటికి తిరిగి ప్రజలను దీవించారు. ప్రజలు కూడా వారికి కావాల్సినవి అందించి ఆశీర్వచనాలను అందుకున్నారు.
%% పల్లెల్లో పతంగుల సందడి
సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో పతంగుల సందడి కనిపించింది. చిన్నారులు, యువకులు పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు. పట్టణాల్లో డాబాలపై ఎగరవేస్తూ సందడి చేయగా, గ్రామాల్లో మాత్రం వీదుల్లో పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు.
also read :- ప్రభుత్వం కీలక నిర్ణయం..!
** ఇంటింట గుమగుమలు
సంక్రాంతి పండుగ సందర్భంగా గుమగుమల సందడి కనిపించింది. మూడు రోజుల ముందునుంచే ప్రజలు పిండివంటలను చేసుకున్నారు. ఆడబిడ్డలు, బందువులు, చుట్టాలు రాకతో ఇళ్లంత సందడిగా మారింది. అలాగే మాంసాహారాలను తీసుకున్నారు. దీంతో ప్రతి ఇంటి సందడే సందడి కనిపించింది. మొత్తానికి మూడు రోజుల సంక్రాంతి సంబురాలను ప్రజలు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.