ఉద్యమాల పురిటిగడ్డ… చిన్న గూడూరు
*చరిత్రాత్మక నేపథ్యం కలిగిన దేవాలయం
*సాహితీ యోధులు దాశరధి సోదరులు జన్మించిన గ్రామం చిన్న గూడూరు
*శిథిలావస్థలో విజ్ఞాన గ్రంధాలయం
*మండలంగా ఏర్పడినా అభివృద్ధి శూన్యం
(మహబూబాబాద్ జిల్లా విజయం న్యూస్):-
స్వరాష్ట్రంలో నూతన మండలంగా ఏర్పడ్డ చిన్న గూడూరు ఎంతో చరిత్రాత్మక నేపథ్యం కలిగిన గ్రామం నాటి తెలంగాణా సాయుధ పోరాటంలో ఇక్కడ ప్రజలు పసిప్రాయంలోనే జమీందార్లు, భూస్వాములపై తిరగబడ్డ చరిత్ర కలిగిన గ్రామం. నాటి తెలంగాణా సాయుధ పోరాటం దగ్గర నుంచి నేటి వరకు అనేక ప్రజా ఉద్యమాలకు చిన్న గూడూరు వేదికగా నిలవడం విశేషం. తెలంగాణా ఉద్యమంలో సైతం ఇక్కడి యువత పోరాడి చిన్న గూడూరు ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేశారు.అంతే కాకుండా సాహితీ యోధులు దాశరధి సోదరులకు జన్మనిచ్చిన పుణ్య భూమి చిన్న గూడూరు పసి ప్రాయంలోనే దాశరధి కృష్ణమాచర్య తెలంగాణా విముక్తి కోసం తన తోటి స్నేహితులను కలుపుకుని నాటి పెత్తందార్ల పై ,దొరలపై తిరగబడి తన కలంతో అగ్ని దారలు కురిపించాడు.
also read :-ప్రజలకు చేరువగా నాయకులుండాలి
నేటికి గ్రామంలోని ఆ కాలంలోని వారు ఈ విషయాలు చర్చించుకోవటం విశేషం తన కలంతో నిజాం నిరంకుశ పాలకులపై కవితాస్త్రాలను ఎక్కుపెట్టి నిజాం రాజులను గడగడ లాడించిన చరిత్ర కూడా చిన్న గూడూరు గ్రామానికి దక్కిందని ఇక్కడి ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు.ఈ గ్రామానికి ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన గ్రామంగా చెప్పుకునేందుకు ఎన్నో చారిత్రక ఆధారాలు మనకు నేటికి గ్రామంలో కనిపిస్తాయి.ఇక్కడ గ్రామం నడి బొడ్డున అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా శ్రీ సీతా రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం ఇస్తుంది.దాశరధి రంగాచార్యులు తన జీవన యానంలో ఈ విషయాన్ని పొందుపరిచి నేటి తరానికి నాటి ఉద్యమ జ్ఞాపకాలను అందించేందుకు కృషి చేశారు.
also read :-అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు…!
నాటి సాయుధ పోరాట స్పూర్తితో దాశరధి సోదరుల ఉద్యమ కాంక్షతో తెలంగాణా మలిదశ ఉద్యమంలో చిన్న గూడూరు ప్రజానీకం యువత విద్యార్థులు చూపిన తెగువ అనన్యసామాన్యం అని చెప్పుకోవచ్చు ఇక చిన్న గూడూరు ను మండలంగా సాధించటం కోసం చిన్న గూడూరు ప్రజలంతా ఏకమై మండలంగా సాధించుకున్నప్పటికి నేటికి మండలంగా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా కార్యాలయ భవనాలు లేక పోవడం బాధాకరం.గ్రామంలో ఉన్నటువంటి యువతకు విజ్ఞానాన్ని అందించి భావి భారత పౌరులుగా మలిచేందుకు అవసరమైన దాశరధి గ్రంధాలయం శిథిలావస్థలో ఉండి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నా దాని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇంత చారిత్రక నేపథ్యం కలిగి నాటి,నేటి ఉద్యమ సిందూరాలైన దాశరధి సోదరులు జన్మించిన చిన్న గూడూరు మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.