Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
ఊళ్లో పెత్తనం..సభల్లో మౌనం
== సమస్య పరిష్కారం దిశగా నోరు మెదపని ప్రజాప్రతినిధులు.
== పదవిపై వ్యామోహం.. ప్రజా సమస్యలకు దూరం.
== రహదారి పనులపై ఆర్ & బి అధికారి పిట్ట కథ.
== ప్రజల సౌకర్యం పై అధికారుల దొంగ చూపు?
== అత్యవసర సమయంలో అనర్ధాలు.
== నుగునూరు వెంకటాపురంలో పాలనాధికారి పర్యవేక్షణ లోపం?
“ప్రభుత్వాన్ని నడిపించే పాలకులకు, అధికారులకు జీతభత్యాలు ప్రజలు కట్టే పన్నుల ప్రతిఫలమే. ప్రజల సమస్యలను పారద్రోలడంలో అధికారులు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.నిత్యం ప్రజల మధ్యలో సంచరించే ప్రజాప్రతినిధులు పరిష్కార మార్గం దిశగా అడుగులు వేయాలి. అధికారులు నిర్లక్ష్య ధోరణి కనపరిస్తే గళమెత్తి ఖండించాలి. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించడం కాదు కదా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. గ్రామాల్లో పెత్తనం చలాయించే ప్రజాప్రతినిధులు.. సభలో మౌనం వహించడంపై ఆయా పార్టీల పెద్దలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.”
9నూగురు వెంకటాపురం-విజయం న్యూస్:-)
సామాన్యులకు చట్ట సభల్లో ప్రశ్నించేందుకు అవకాశం లేదు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారికి అది ఓ మంచి వేదిక. ఎన్నికకు ముందు ప్రజల సమస్యలను పొలిమేర నుండే తరిమికొడతామని వాగ్దానాలు చేస్తారు. సభల్లో మాత్రం వారి నోరు మూగబోతుంది. అధికారం దక్కినప్పటి నుండి వారి గ్రామాల్లో పెత్తనం చలాయిస్తూ గొప్పలు చెప్పుకుంటారు. మినీ అసెంబ్లీగా పిలవబడే సర్వసభ్య సమావేశాల్లో మాత్రం మౌనం వహిస్తున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఇదే తంతు కొనసాగింది. సభకు హాజరైన ప్రజాప్రతినిధులందరిలో ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారందరి నోటికి తాళం వేసుకున్నారు. మౌన వ్రతం ఆచరించినట్లుగా గమ్మున కూర్చొని వేడుక తిలకించారు. వారి ప్రదర్శన శూన్యంగా మిగిలింది. ప్రతి గూడెంలో కో కొల్లలుగా సమస్యలు ప్రజలను వెక్కిరిస్తున్నారు. ప్రజాప్రతినిధులందరికీ దృష్టిలోపం ఉన్నట్లుగా వ్యవహరించిన తీరుపై ఆయా పార్టీల నాయకులు, ప్రజలు గుస్సా అవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?
== పదవిపై వ్యామోహం.. ప్రజా సమస్యలకు దూరం :
ప్రజా ప్రతినిధి అంటే సమాజంలో గౌరవం లభిస్తుంది. అధికారుల చెంత కీర్తించబడతారు. ఎక్కడికి వెళ్లిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ప్రజా పాలకుడిగా పరిగణించబడతారు. ఆ పాలకుడు చేయవలసిన విధులను మర్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రహదారి. జగన్నాధపురం నుండి యాకన్న గూడెం వరకు ఉన్న జాతీయ రహదారి అంతట చిన్న భిన్నం అయింది. మరమ్మత్తులు చేపట్టిన కాంట్రాక్టర్ కొద్దిరోజులుగా పనులను నిలుపుదల చేసి కాలయాపన చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులలో ఒకరు ఇద్దరు మాత్రమే ప్రతిఘటించారు. మండల కేంద్రంలో భారీ వాహనాల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యపై కూడా ఇదే తంతు కొనసాగింది. ప్రజా ప్రతినిధులకు పదవిపై ఉన్న వ్యామోహం.. ప్రజల సమస్యలను దూరం చేయడంలో లేదనే విమర్శలు వస్తున్నాయి.
== రహదారి పనులపై ఆర్ &బి అధికారి పిట్ట కథ :
రహదారి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సమావేశానికి హాజరైన రహదారులు భవనాల శాఖ అధికారిని ప్రజా ప్రతినిధులు ప్రశ్నించగా వారికి పిట్ట కథ చెప్పారు. ఆ కథ వింటూ ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహించడంపై పలువురు అవహేళన చేస్తున్నారు. సహోద్యోగులు సైతం అధికారి సమాధానానికి, ప్రజా ప్రతినిధులు తీరుకు హాస్యం ఘటిస్తున్నారు. ఆ అధికారి సగం లో నిలిపిన పనులు ఇప్పట్లో మొదలు కావన్నారు. కాంట్రాక్టర్ వద్ద పైసలు లేవన్నారు. కాంట్రాక్టర్ కు పైసలు జమయితే తప్ప నిలిచిన పనులు పూర్తికావంటూ కాంట్రాక్టర్ ను వెనుకేసుకొచ్చారు. అంతసేపు బూడిద మయంగా మారిన గ్రామాలకు, మండల ప్రజలకు అవస్థలు తప్పవనే సంకేతాన్ని ఇచ్చారు. అలా మాట్లాడిన అధికారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులందరూ ప్రయత్నం చేయకపోవడం పై ప్రజలు అసంతృప్తి కనబరుస్తున్నారు.
== ప్రజల సమస్యలపై అధికారుల దొంగ చూపు? : ఇదికూడా చాదవండి: నేడు ఇల్లందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర
ఇసుక లారీల మూలంగా రహదారి గుంతల మయంగా మారింది. ప్రజలు ప్రయాణించడంలో సౌకర్యాన్ని కోల్పోయారు. నూగురు, జగన్నాధపురం మధ్య రహదారిపై బూడిద కలిపిన కంకరను పోసి వదిలేశారు. దీనితో ప్రజలు, ప్రయాణికుల అవస్థలు రెట్టింపు అయ్యాయి. జరుగుతున్న విషయాన్ని పలు పత్రికలు ప్రచురించి అధికారులు దృష్టికి తీసుకు వెళ్లాయి. కానీ పనులను పూర్తి చేయడంలో అధికారులు దొంగ చూపు చూస్తున్నారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. అత్యవసర పరిస్థితి సంభవిస్తే ప్రాణాలు రక్షించుకోవడం దేవుడెరుగు కానీ ప్రాణాలు కోల్పోవడం వంటి అనర్ధాలు జరగడం ఖాయం అన్నట్లుగా పరిస్థితులు రూపు దాల్చుకున్నాయి. అయినప్పటికీ అధికారులలో మార్పు శూన్యంగానే కనిపిస్తుంది.
== పాలనాధికారి పర్యవేక్షణ లోపం? :
చాలాకాలంగా జిల్లా పాలనాధికారి పర్యవేక్షణ కనుమరుగయింది. మారుమూల ప్రాంతం కావడంతో కాంట్రాక్టర్ ఆడింది ఆట.. పాడింది పాటగా కొనసాగుతుంది. అందుకు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పాలనాధికారి తనిఖీలు నిర్వహించడనే ధీమాతో పనులు జాప్యం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపిస్తేనే రహదారి పనులు పూర్తికావని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.

Vijayam Daily (విజయం డైలీ) is a Telugu News Network, Vijayamdaily News provide Latest and Breaking News in Telugu (తెలుగు ముఖ్యాంశాలు, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్). Vijayam Daily brings the latest Andhra Pradesh news headlines, Telugu News and Live News Updates on Telangana. Find Telugu Latest News, Videos & Pictures on Telugu and see latest updates only on vijayamdaily.com
Prev Post
Next Post