Telugu News

‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

ఎన్నికలకు సిద్దమవుతున్న ఆ ఇద్దరు నేతలు

0

‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

== వ్యూహత్మకంగా తెరపైకి వచ్చిన ఆ పేర్లు

== ఎన్నికలకు సిద్దమవుతున్న ఆ ఇద్దరు నేతలు

== ఇంతకు ఎవరు..?

== పొంగులేటి వ్యూహామేంటి..? ఫార్ట్ -3

(పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు రేసులో మరో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి..  ఉన్నట్టుండి ఆ ఇద్దరు నేతలు రేసులోకి వచ్చారు.. ఎవరు ఊహించి ఉండరు.. కానీ ఇది నిజం.. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, వైఎస్ఆర్ టీపీ నుంచి కొందరు పేర్లు వినిపిస్తున్నప్పటికి.. ఆ ఇద్దరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చారు.  వీరు ఓ జాతీయ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు ఇప్పటికే నియోజకవర్గంలో వారి అత్యంత సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.. ఇంతకి  వీరు ఏవరు..? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..?  అయితే ఒక్కసారి ఈ కింది వివరాలను చూద్దాం..

ఇది కూడా చదవండి:  ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

పాలేరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు  ఇద్దరు నేతలు అనూహ్యంగా రంగంలోకి వచ్చారు. అందులో ఒకరు మహిళ నేత మద్దినేని బేబి స్వర్ణకుమారి, మరోకరు సీనియర్ నాయకుడు రామసహాయం నరేష్ రెడ్డి.. వీరిద్దరు పాలేరు నియోజకవర్గం, తిరుమలాయపాలెం మండలం వాసులే. రామసహాయం నరేష్ రెడ్డి  పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన వారు కాగా, మద్దినేని బేబి స్వర్ణకుమారి తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన వారు. అయితే వీరిద్దరు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వారే కావడం, అంతే కాకుండా 2014 ఎన్నికల్లో ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన వారు కావడం గమనర్హం.  నరేష్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా ఎదిగారు.  సర్పంచ్ గా, ఎంపీటీసీ, సోసైటీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం బీరోలు సోసైటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన తిరుమలాయపాలెం మండలంలోని అత్యంత కీలక వ్యక్తి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వైసీపీ పార్టీలో చేరారు. 2014 కంటే ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువ శాతం రాజకీయాలకు ప్రీయార్టీ కల్గించడం.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో తెలంగాణ వాధిగా నరేష్ రెడ్డి వైసీపీ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత  తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేస్తుండగా  పాలేరు ఉప ఎన్నిక రావడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నరేష్ రెడ్డి, ప్రస్తుతం పొంగులేటిశ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.

== రెండు ఎన్నికల్లో పోటీ చేసిన స్వర్ణకుమారి

మద్దినేని బేబి స్వర్ణకుమారి ప్రభుత్వ అధికారిగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడి హాయంలో తొలిసారిగా రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2004 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్ణకుమారి రేణుక చౌదరి చేతిలో ఓటమి చెందారు. అనంతరం  ఉమెన్ చైల్డ్ వెల్పేర్ సోసైటీకి చైర్మన్ గా పని చేసిన స్వర్ణకుమారి 2014 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత నామా నాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు.

ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

2018 వరకు తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా పనిచేసిన స్వర్ణకుమారి, ఆ తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం 2019  పార్లమెంట్ ఎన్నికల సమయంలో నామా నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల పాటు నామా నాగేశ్వరరావుతో కలిసి ఉన్న స్వర్ణకుమారి, ఆ తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు చేరారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారిపోతున్న తరుణంలో ఆమె రేసులోకి రావడం గమనర్హం.

== పాలేరు  రేసులో ఆ ఇద్దరు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకుని ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న రామసహాయం నరేష్ రెడ్డి, మద్దినేని బేబి స్వర్ణకుమారి ఇద్దరు పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల రేసులోకి అనూహ్యంగా వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతి త్వరలోనే పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ లేదంటే వైసీపీ, కాలం కలిసివస్తే కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు లేకపోలేదు. మహాశివరాత్రి తరువాత ఆయన పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయనను నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను కూడా ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులుగా నియమించాలని నిర్ణయించి పొంగులేటి ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లికి మట్టా దయానంద్, ఇల్లందుకు కోరం కనకయ్య, అశ్వరరావుపేటకు ఆదినారాయణ, పినపాకకు పాయం వెంకటేశ్వర్లు, మధిరకు కోటా రాంబాబులను ఎంపిక చేసిన ఆయన పాలేరు నియోజకవర్గానికి రామసహాయం నరేష్ రెడ్డి, మద్దినేని బేబి స్వర్ణకుమారిలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  ఇక ఖమ్మం నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాలేరుకు ఇద్దర్ని ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలున్నాయి. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే పాలేరుకు మరో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్వర్ణకుమారిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం సిప్ట్ అయితే నరేష్ రెడ్డిని ఎంచుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉంది. బీజేపీ పార్టీలో చేరితే కొత్తగూడెం నుంచి ఇప్పటికే కోనేరు చిన్ని కొత్తగూడెంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయన్ను కాదనలేము అందుకే కొత్తగూడెం బీసీ, ఖమ్మం రెడ్డి, పాలేరు కమ్మ అన్నట్లుగా ఉంటుందని అనుకుంటున్నారు. లేదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ కానీ, కాంగ్రెస్ లో కానీ చేరితే కొత్తగూడెంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిప్ట్ అయ్యి, పాలేరు నుంచి నరేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆయన అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. మద్దినేని బేబి స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డిలు ఇద్దరు స్థానికులు కావడంతో కలిచివచ్చే అవకాశాలు ఉందని పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా అనేక రకాలుగా రాజకీయ వ్యూహంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో బడాబడా నేతలు రేసులోకి వస్తున్న నేపథ్యంలో వీరి పేర్లు తెరపైకి రావడం అనూహ్యంగా వారిపేర్లను తీసుకరావడం పట్ల పాలేరు నియోజకవర్గ ప్రజలు ఆశ్ఛర్యానికి గురవుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎవరు పాలేరు కు కింగ్ అవుతారో..?