Telugu News

భద్రగిరిలో ముక్కోటి సంబరాలు…!

-- వైకుంఠ అధ్యయనోత్సవాలు ప్రారంభం

0

భద్రగిరిలో ముక్కోటి సంబరాలు…!
— వైకుంఠ అధ్యయనోత్సవాలు ప్రారంభం
— తొలిరోజు మత్స్యావతారంలో భద్రాద్రి రాముడు
— కనులారా వీక్షించి తరించిన భక్తజనం
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి-విజయంన్యూస్)
శ్రీ సీతారామచంద్ర స్వామి వారు సతీసమేతంగా నడయాడిన పుణ్యం నేల భద్రగిరి…! రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన భవ్య ధరిత్రి…! నిత్యం వేద ఘోషతో అలరారే పుణ్యక్షేత్రం…! తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం భద్రాద్రి రాముడు…! ముక్కోటి సంబరాలకు భద్రగిరి సిద్ధమైంది…! రోజుకో అవతారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు భక్తులను కనువిందు చేయనున్నారు….! వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ…. సోమవారం శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి…! తొలిరోజు భద్రాద్రి రాముడు మత్స్యావతారంలో భక్తులను కనువిందు చేశారు…! ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించిన భక్తులు పునీతులయ్యారు……. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు (ముక్కోటి ఉత్సవాలు) సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

also read;-రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ ఆంక్షలు…

తొలిరోజు భద్రాద్రి రాముడు మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. వైకుంఠ అధ్యయన మహోత్సవాల ప్రారంభం సందర్భంగా రామాలయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత్యావతారంలో ఉన్న స్వామివారిని వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలులో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 4న కూర్మావతారం,5న వరాహవతారం, 6న నరసింహావతారం, 7న వామనవతారం, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామావతారం,11న శ్రీకృష్ణవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ముక్కోటి ప్రధాన వేడుకలు శ్రీ సీతా రాములవారి తెప్పోత్సవం జనవరి 12 న జరగనుంది. అదేవిధంగా ఉత్తరద్వార దర్శనము వేడుక 13 న జరగనుంది. ఇందుకు సంబంధించి దేవస్థానం ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఇదిలా ఉండగా ముక్కోటి ఉత్సవాలను నేపథ్యంలో… భద్రాద్రి రామాలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. భద్రాద్రికి ముక్కోటి శోభ వచ్చింది