Telugu News

వాగుదాటాల్సిందేనా..? — ద్దశాబ్దాలు గడిచినా మారని పల్లెల దశ

నేటికీ అభివృద్ధికి నోచుకోని గ్రామాలు

0

వాగుదాటాల్సిందేనా..? — ద్దశాబ్దాలు గడిచినా మారని పల్లెల దశ*

– నేటికీ అభివృద్ధికి నోచుకోని గ్రామాలు

– కనీస వసుతుల కరువు

– అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇబ్బందులే
(తిర్యాణి-విజయం న్యూస్)
తిర్యాణి, మండలంలో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆదివాసులు అంటున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య నేటికీ సరిగ్గా అందడం లేదు. మండలంలోని మంగి, గుండాల, దొడ్డిఊడ, పూనగూడ, అర్జుగూడ, సల్పలగూడ, దాబాగూడ, కుంటగూడ, గీసిగూడ, తాటిగూడ, గోపెర, గోవేన, బొజ్జిగూడ, కోటగాం, ఎర్రబండ, నాగుగూడ, మందగూడ, పుర్కగూడ, పంగిడి, రొంపల్లి, కోలాంగూడ, అర్జున్‌లొద్ది, మార్కగూడ, గుడిపేట, కొర్లొంక తదితర గ్రామాల్లో సరైన వసతులు లేక గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉట్నూరు ఆధ్వర్యంలో సంవత్సరానికి నిధులు కేటాయిస్తున్న అవి అందడం లేదని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. అదివాసుల అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నా మారుమూల గ్రామాల్లో సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలాగానే మిగిలిపోతున్నాయి. ప్రత్యేక అధికారులు ఆయాగ్రామాల్లో పర్యటించి అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడా ల్సిన బాధ్యత అధికారులదేనని అంటున్నారు.

వానొస్తే.. ఇబ్బందులు తప్పడం లేదు..

వర్షాకాలంలో చిన్న వాన కురిసిన ఆయా గ్రామాల్లో సరైన రోడ్డు లేక ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్థులు అంటున్నారు. గర్భిణులు, జ్వరం, ఇతర అత్యవసర వేళల్లో 108వాహనం రావడం కష్టమవుతోంది. ఎండ్ల బండలో అతి కష్టం మీద ఆస్పత్రులకు చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో మధ్యలోనే ప్రసవాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

రోడ్డు సౌకర్యం కల్పించాలి..

– మడావి భీంరావు, గుడిపేట

అత్యవసర సమయంలో మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తే సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఏళ్ల తరబడి సమస్యలు అలానే ఉన్నాయి. విద్యార్థులు పై చదువులకు జిల్లాకేంద్రానికి, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి. గ్రామాలు అభివృద్ధి చెందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.v