Telugu News

కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నిద్దం కావాలి: కలెక్టర్

కౌంటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

0

కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నిద్దం కావాలి: కలెక్టర్

== కౌంటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

ఖమ్మం, మే 29(విజయం న్యూస్):

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 4న ఉదయం 8 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల నందు ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన తనిఖీ నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతి ఒక్కరూ తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటి సంభాషణలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఖమ్మం అసెంబ్లీ సెగ్నెంట్ లో మాత్రం 18 టేబుళ్లు ఏర్పాటు ఉంటుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కంట్రోల్ యూనిట్ లెక్కింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ పూర్తిగా చెక్ చేసుకోవాలని, కంట్రోల్ యూనిట్ యొక్క పింక్ సీల్, గ్రీన్ ఫీల్డ్ చెక్ చేసి కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలని, కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు సరి చూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్ ను సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ అన్నారు. కంట్రోల్ యూనిట్ లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని, కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని అన్నారు. కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు ట్యాలీ చేసుకొని రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపించి వాటిని నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలని, టేబుల్ వద్ద కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఆ రౌండ్ వివరాలు సహాయ రిటర్నింగ్ అధికారి వెల్లడించిన తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటింగ్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.
కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వివి ప్యాట్ల లెక్కింపు ప్రారంభమవు తుందని, వివి ప్యాట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ.టి.పి.బి.ఎస్ విధానం ద్వారా సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారులు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కౌంటింగ్ అధికారులకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. శిక్షణ ఇవిఎం యంత్రాలతో మాక్ కౌంటింగ్ నిర్వహించి, కౌంటింగ్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, జి. గణేష్, జెడ్పి సిఇఓ వినోద్, డిఆర్డీవో సన్యాసయ్య, శిక్షణ నోడల్ అధికారి కె. శ్రీరామ్, సహాయ శిక్షణ నోడల్ అధికారి మదన్ గోపాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.