Telugu News

మారుమూలకు పల్లె వెలుగు.

ప్రజల విజ్ఞప్తులకు స్పందిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.

0

మారుమూలకు పల్లె వెలుగు.

ప్రజల విజ్ఞప్తులకు స్పందిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.

అడిగిన వెంటనే బస్సు సర్వీసుల పునరుద్ధరణ.

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు సర్వీసులు.

నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వినూత్న సేవలు.

సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సే శ్రేయస్కరం. ప్రైవేట్‌ వాహనాలతో పోలిస్తే తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేర్చుతున్న ఏకైక సంస్థ ఆర్టీసీ. ఇంటిల్లిపాదినీ సంతోషంగా తమ తమ గ్రామాలకు చేరవేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నది. ఎన్ని రవాణా సదుపాయాలు వచ్చినా ఆర్టీసీ డ్రైవర్ల క్రమశిక్షణే వేరు. పరిస్థితులకు అనుగుణంగా సంస్థలో మార్పులు తీసుకొచ్చి గాడినపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే కొన్ని కొన్ని గ్రామాల రూట్లకు దశాబ్దాల క్రితం ఆపివేసిన పల్లె వెలుగు బస్సు సర్వీస్‌లను తిరిగి ప్రారంభించి ప్రజాదరణ పొందుతున్నది. జిల్లాలోని కొత్తగూడెం డిపో పరిధిలో ప్రజల విజ్ఞప్తుల మేరకు మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతున్నది.

టీఎస్‌ ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గతానికంటే భిన్నంగా మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. గ్రామస్తులు, విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన వెంటనే ఆ పల్లెకు బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నది. మారుమూల ఏజెన్సీ గ్రామాలకూ బస్సులు నడుపుతున్నది. అంతేకాదు, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకూ ఎటువంటి డిపాజిట్‌ లేకుండా బస్సులను నడిపేందుకు సంస్థ సంసిద్ధంగా ఉంది. మాలధారణ భక్తులకు, పెళ్లిళ్లకు, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నది. రానున్నరోజుల్లో తల్లీపిల్లల ఫీడింగ్‌ సెంటర్లను కూడా ఆయా పరిధిలో ఏర్పాటు చేయనున్నది.

మూడు గ్రామాలకు బస్సుల పునరుద్ధరణ

కొత్తగూడెం డిపో పరిధిలో జూలూరుపాడు మండలం కాకర్ల, టేకులపల్లి మండలం బోడు, పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి బస్సులను ఆర్టీసీ అధికారులు పునరుద్ధరించారు. ఈ గ్రామాల నుంచి ఎక్కువగా విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, ఇతరత్రా పనుల కోసం మండల కేంద్రానికి వస్తుంటారు. కొత్తగూడెం నుంచి కాకర్లకు 12సంవత్సరాల క్రితం బస్సు నడిచేది. రోడ్డు సక్రమంగా లేకపోవడం, దీనికి తోడుగా ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు చొరవ చూపడంతో బస్సు సర్వీస్‌ను నిలిపివేశారు. టేకులపల్లి మండలంలోని బోడు ప్రాంతానికి 17సంవత్సరాల క్రితం ప్రతిరోజు బస్సు సర్వీస్‌ నడిచేది. అనివార్య కారణాలు, కొన్ని ఇబ్బందుల నడుమ బస్సు సర్వీస్‌ను తిప్పడం నిలిపారు. పాల్వంచ మండలంలోని మారుమూల గ్రామం ఉల్వనూరు పాల్వంచ నుంచి సుమారు 20కిలోమీటర్లపైనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, ఇతరత్రా పనులకు పాల్వంచ రావాల్సిందే. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం భారంగా మారింది. ఈ మూడు గ్రామాలకు దగ్గరలోని మండల కేంద్రానికి వెళ్లాలంటే ఆటో చార్జీలు రూ.40 పైగానే వసూలు చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో వారి విజ్ఞప్తుల మేరకు గతవారం నుంచి ఈ గ్రామాలకు బస్సులను నడుపుతుండగా విశేష ఆదరణ లభిస్తున్నది.

బస్సుల అద్దెకు డిపాజిట్లు లేవు

శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు ఎటువంటి డిపాజిట్‌ లేకుండా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో డిపాజిట్‌ చేస్తేనే బస్సులను అద్దెకు ఇచ్చేవారు. కానీ ఆర్టీసీకి మరింత ఆదరణ పెంచాలని, సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయాణికులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. మాలధారణ భక్తులకు, పెళ్లికి, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నది. రానున్నరోజుల్లో తల్లీపిల్లల ఫీడింగ్‌ సెంటర్లను కూడా ఆయా పరిధిలో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.

also read :- హైదరాబాద్ చేరుకున్న సీఎం కెసిఆర్..

please subscribe this chanel (https://youtu.be/l1Gvf4gr9Kk)