మన్యంలో మాయగాళ్లు
== దేవుడి జాగలో కొందరు పాగ
== అవసరానికి ప్రస్తుతం..ఆక్రమణయే అంతం
== దొంగ ముఠాల సూపర్ స్కెచ్
== నాగులమ్మ ఆవరణలో అక్రమార్కల తిష్ట
== తొలగించాలంటూ భక్తుల మొర
వెంకటాపురం(నూగురు)/సెప్టెంబర్ 8(విజయం న్యూస్):
అక్రమార్కులు బడి, గుడి స్థలాలను కూడా వదలటం లేదు. ఎచ్చట ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ జెండా పాతుతున్నారు. మనిషిలో స్వార్థం పెరిగి దుర్బుద్ధితో ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. మానవత్వం మరిచి మూర్ఖుడు వలె ప్రవర్తిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం కేటాయించుకున్న స్థలాన్ని కాజేసేందుకు వ్యాపార ముసుగులో ఉన్న దొంగల ముఠాలు వెనుకడుగు వేయడం లేదు. ఎన్నో ఏండ్లుగా వెంకటాపురం మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో నాగులమ్మను కొలుస్తున్నారు.
ఇది కూడా చదవండి:- మంత్రి ‘అజయ్’ డే.. వెరీవెరీ స్పెషల్ డే..
నాగుల చవితి రోజు నాగులమ్మ ఆవరణలో జన సంద్రోహంలా ఉప్పొంగుతూ భక్తుల సందడి కనుల పండుగగా కనిపించేది. ఈ స్థలాన్ని చుట్టుపక్కల ఉండే వారు ఆక్రమించకుండా భక్తుల అభీష్టం మేరకే ఖాళీ జాగను విడిచారు. కొందరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసే క్రమంలో ఖాళీ జాగపై కన్నేశారు. మొదట ఎవరైనా అడ్డు చెబుతారని సంకోచించి నప్పటికీ ప్రస్తుతానికనే జవాబు ఇవ్వొచ్చనే ధైర్యం చేసి నాగులమ్మ ఆవరణలో సామాగ్రితో తిష్ట వేశారు. మండల కేంద్రంలో చిరు వ్యాపారుల నుండి బడా వ్యాపారుల వరకు ఎక్కువమంది ఇదే ధోరణిలో భూములను సొంతం చేసుకున్న వారే ఉన్నారు. కొంతకాలం గడిచాక తమదేననే రుబాబుతో దబాయిస్తూ ఆర్థిక పైకం అధికారులకు చెల్లించి మమ అనిపించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి:+ ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?
అవసరాల నిమిత్తం ప్రస్తుతం అంటూనే ఆక్రమణయే అంతంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు ఈ స్థలంలో కూడా చివరకు అదే సూత్రాన్ని ప్రయోగిస్తారని పలువురు భావిస్తున్నారు. అలా జరిగితే భక్తుల ఆశలు ఆవిరి కావడం తథ్యమనే చెప్పాలి.
పంట చేనుకు చీడ పీడలు ప్రబలుతున్న ఆదిలోనే అరికట్టేందుకు రైతు కృషి చేస్తాడు. అదేవిధంగా అక్రమార్కుల పైత్యం ముదరక ముందే అధికారులు స్పందించి ఆక్రమించేందుకు వేసిన తిష్టను తొలగించాలని భక్తులు మొర పెడుతున్నారు.