Telugu News

వడ్లను కేంద్రం తిసుకోధట..!

** అందుకే యాసంగిలో వరి వద్దంటున్నం ** ప్రత్యామ్నయ పంటలు వేసుకొవాలని సూచిస్తున్నం

0

వడ్లను కేంద్రం తిసుకోధట..!

** అందుకే యాసంగిలో వరి వద్దంటున్నం

** ప్రత్యామ్నయ పంటలు వేసుకొవాలని సూచిస్తున్నం

** రైతుల మేలు కోరి ప్రభుత్వం చెబుతుంది.

**విలేకర్ల సమావేశంలో వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

(హైదరాబాద్-విజయం న్యూస్)

యాసంగిలో రైతులు వరి వేయొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు

ఈ సీజన్‌కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే

బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం

డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు

వానకాలంలో వరి పంటకు ఇబ్బంది లేదు

ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తం

రైతులు ఆలోచించి అర్థం చేసుకోవాలి

రైతులపై కేంద్రం కక్షపూరిత వైఖరి

రైతును రెచ్చగొడుతున్న విపక్షాలు

సీడ్‌ కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలుంటే వరి వేసుకోవచ్చు.. మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన

మేం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి

రైతన్నలూ..

మీకు ఎవరు మేలు చేస్తున్నారో, ఎవరు కీడు చేస్తున్నారో ఆలోచించండి. మీ బాగు కోసమే వరి వద్దని ముందునుంచీ చెప్తున్నాం. ఇలా చెప్పటం మాకు బాధగా ఉండదా? కానీ కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకపోవడం, రైతు మనసు తెలుసుకోకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కేంద్రం బాధ్యత మరిచి రైతుల సమస్యలపై ఇంత నిర్లిప్తంగా వ్యవహరించడం దారుణం.

–సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ (దొడ్డు వడ్లు) ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించేదిలేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయస్థితిలోకి పడిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను వరి వెయ్యొదని చెప్పడం తమకు బాధగా ఉన్నదని.. కానీ.. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్య ధోరణి వల్ల యాసంగి ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు యాసంగి వరి సాగుకు దూరంగా ఉండాలని కోరారు. నేరుగా మిల్లర్లకు అమ్ముకొనేవారు, విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్నవారు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చని సూచించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మంత్రుల నివాసభవన సముదాయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు చేయబోదని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధాన ప్రకటన చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, భవిష్యత్తులో కూడా ఇదే విధానం వర్తిస్తుందని స్పష్టంచేశారు.

రాజకీయ క్రీడలో పావులు కావొద్దు

ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆరాటపడుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతులను అడ్డుపెట్టుకొని ధర్నాలు, రాస్తారోకోలు చేసి వారిని రాజకీయంగా వాడుకొనేందుకు కుట్ర చేస్తున్నాయని, ఈ రాజకీయ క్రీడలో పావులు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులతో రాజకీయం చేయొద్దని విపక్షాలను హెచ్చరించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే సొల్లు కబుర్లు ఆపి, ధాన్యం కొంటామని లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని సవాల్‌ విసిరారు. ఓవైపు ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కొనొద్దని ఆదేశాలిస్తే, రాష్ట్రంలో బీజేపీ నేతలు మొత్తం పంట కొంటామంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సీజన్‌ను నెల ముందుకు జరిపితే సరి..

యాసంగి ధాన్యంపై ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో బియ్యం పట్టినప్పుడు నూక శాతం ఎక్కువగా వస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నూక రాకుండా ఉండేందుకు ధాన్యాన్ని ఉడికించి మిల్లింగ్‌ చేయాల్సి వస్తున్నదని, ఇలా ఉడికించిన బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ కొనటంలేదని తెలిపారు. పూర్వకాలంలో మాదిరిగా వానకాలం సీజన్‌ను ఒకనెల ముందుకు జరుపుకొంటే యాసంగిలో వరి వేసినా ఇబ్బంది ఉండదని వివరించారు. ఫిబ్రవరి చివరివారం లేదా మార్చి మొదటి వారంలో యాసంగి కోతలు పూర్తయితే నూకశాతం తక్కువగా ఉంటుందని, అప్పుడు ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది ఉండదని చెప్పారు. యాసంగిలో నూక శాతం తక్కువ వచ్చే కొత్త వంగడాలను రైతులకు అందించాలని వరి పరిశోధన సంస్థను కోరినట్టు మంత్రి తెలిపారు.

ఇతర పంటలు వేయండి

యాసంగిలో వరికి బదులుగా ఆదాయం వచ్చే ఇతర పంటలు సాగుచేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. అందుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. మినుములు, పెసర్లు, కందులకు బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉన్నదని తెలిపారు. ఈ వానకాలంలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగుచేయాలని కోరితే రైతులు వినలేదని, ఇప్పుడు పత్తికి మద్దతు ధరకన్నా రూ.3 వేలు అధిక ధర పలుకుతున్నదని గుర్తుచేశారు. పత్తికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉన్నదని, వచ్చే వానకాలంలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాలు పత్తి వేసినా ఇబ్బంది లేదని చెప్పారు.

రైతన్నలూ.. అర్థం చేసుకోండి

ధాన్యం సేకరణపై కేంద్రం చేతులెత్తేయడంవల్లనే యాసంగిలో వరి సాగు వద్దంటున్నామని, వాస్తవాలను గ్రహించి రైతులు అర్థం చేసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు. రైతుల బాగుకోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తపన పడుతున్నారని తెలిపారు. రైతులపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, రైతుల కోసం కేసీఆర్‌లాగా దేశంలో మరే సీఎం పనిచేయటంలేదని పేర్కొన్నారు. ‘రైతన్నలూ.. మీకు ఎవరు మేలు చేస్తున్నారో, ఎవరు కీడు చేస్తున్నారో ఆలోచించండి. మీ బాగు కోసమే వరి వద్దని ముందునుంచీ చెప్తున్నాం. ఇలా చెప్పటం మాకు బాధగా ఉండదా? కానీ కేంద్రప్రభుత్వ బాధ్యతారాహిత్యం, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకపోవడం, రైతు మనసు తెలుసుకోకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కేంద్రం బాధ్యత మరిచి రైతుల సమస్యలపై ఇంత నిర్లిప్తంగా వ్యవహరించడం దారుణం’ అని పేర్కొన్నారు.

ఆ రైతుది సహజ మరణమే

కామారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రంలో సంభవించిన రైతు బీరయ్య మరణం సహజ మరణమేనని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ రైతు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తేమ శాతం అధికంగా ఉండటంతో ఆరబోయాలని నిర్వహకులు సూచించారని, మరుసటి రోజే మళ్లీ వర్షం పడటంతో మరింత సమయం పట్టిందన్నారు. ఇదే సమయంలో ఆయన సహజ మరణం చెందినట్టు అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. బీరయ్య కుటుంబ సభ్యులు కూడా సహజ మరణమేనని అంగీకరించినట్టు తెలిపారు.

వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర

ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన కేంద్రప్రభుత్వం, వ్యవసాయరంగాన్ని కూడా దశలవారీగా కార్పొరేట్‌ కంపెనీలకు తాంబూలంలో పెట్టి అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ధాన్యం సేకరణ నుంచి తప్పుకొన్నదని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను నిండా ముంచి, కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.

టోకెన్లు అవసరం లేదు.. దర్జాగా అమ్ముకోవచ్చు మంత్రి గంగుల కమలాకర్‌

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి టోకెన్లు అవసరం లేదని, రైతులు దర్జాగా వెళ్లి అమ్ముకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ వానకాలం సీజన్‌లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని కోరారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండలో రైతులు ధాన్యాన్ని నేరుగా మిల్లర్లకు విక్రయిస్తారని, కొనుగోలు కేంద్రాలకు తీసుకురారని తెలిపారు. అక్కడ రైతులంతా ఒకేసారి వస్తుండటంతో ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్‌ టోకెన్ల విధానం అమలుచేస్తున్నారని చెప్పారు. సూర్యాపేట, మిర్యాలగూడలో 86 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఒక్క కిలో కూడా ధాన్యం రాలేదని, ప్రతిపక్షాలు నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలకుగాను 2,142 కేంద్రాలను తెరిచి 2.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం

రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వమే సేకరించాలని చేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. కానీ ఆ బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రైతులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం, ధాన్యం సేకరణపై చేతులెత్తేసిందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

రాష్ట్ర బీజేపీ నేతలు ఈ నిజాలను కప్పిపుచ్చి ఆసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతూ రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకొంటున్నదని మండిపడ్డారు