Telugu News

వీరవనిత ఐలమ్మను మరవరాదు: మంత్రి

ఆమె సమాజానికి విలువైన ఉద్యమస్పూర్తిని మిగిల్చి వెళ్లారు

0
వీరవనిత ఐలమ్మను మరవరాదు: మంత్రి
== ఆమె సమాజానికి విలువైన ఉద్యమస్పూర్తిని మిగిల్చి వెళ్లారు
== చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళ్లు అర్పించిన మంత్రి పువ్వాడ అజయ కుమార్ 

ఖమ్మం, సెప్టెంబర్ 26(విజయంన్యూస్):
 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) 128వ జయంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గల చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న జయంతోత్సవం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, నిజాం పాలనకు, విస్నూరు దేశ్‌ముఖ్ పాల‌న‌కు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింద‌ని మంత్రి తెలిపారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో దడ పుట్టించాయ‌న్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన‌ మహనీయురాలు ఐల‌మ్మ అని మంత్రి కీర్తించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ లోనే ‘పాలెం’ సమగ్రాభివృద్ధి: మంత్రి
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, మహిళలకు స్పూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. పోరాటాల ఫలితమే మహిళా బిల్లు అని,  చాకలి ఐలమ్మ పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసి చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, అదనపు డిసిపి కెఆర్ కె. ప్రసాద్ రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, సమైక్య రజక సంఘం సీనియర్ నాయకులు రేగళ్ల కొండలు, ఖమ్మం జిల్లా బి.సి. సీనియర్ నాయకులు డాక్టర్ పాపారావు, పగడాల నాగరాజు, సమైక్య రజక సంఘం జిల్లా నాయకులు తాంగేళ్లపల్లి శ్రీనివాస్, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వరరావు, బిసి ఫ్రoట్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగబోయిన పుల్లారావు, సమైక్య రజక సంఘం తెనాలి వీరబాబు, మన రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ఉపేందర్, రజక సంఘం నాయకులు కణతల నరసింహారావు, బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.