Telugu News

మేమింతే….. మారమంతే….?

మణుగూరు కూరగాయల మార్కెట్ లో ఆంధ్ర వ్యాపారుల దందా....

0

మేమింతే….. మారమంతే….?
మణుగూరు కూరగాయల మార్కెట్ లో ఆంధ్ర వ్యాపారుల దందా….

మండుతున్న ధరలు బెంబేలెత్తుతున్న వినియోగదారులు….

కన్నెత్తి చూడని మార్కెటింగ్ అధికారులు….

మణుగూరు విజయం న్యూస్

పినపాక నియోజకవర్గంలో మణుగూరు మండలం లో కూరగాయల ధరలు రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మణుగూరు కూరగాయల మార్కెట్లో ఆంధ్ర వ్యాపారులు తమ వ్యాపార మాయాజాలంతో సిండికేట్ గా ఏర్పడటంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. రోజుకో రీతిలో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. పెరిగిన ధరలు కూత కూత లాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆంధ్ర వ్యాపారుల మాయాజాలం వినియోగదారుల పాలిట శాపంగా మారుతుంది. రోజురోజుకు పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మణుగూరు పట్టణంలో సింగరేణి ఉద్యోగులతో పాటు రైతులు, వ్యాపారులు,సింగరేణి కార్మికులు, బీటీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగాల రీత్యా మణుగూరు పట్టణంలోని స్థిర పడ్డారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ ను ఏర్పాటు చేయకపోవడం వ్యాపారులకు వరంగా మారింది. రైతు బజారు లేకపోవడం సమీకృత మార్కెట్ల ఏర్పాటు మాటలకే పరిమితం కావడంతో వ్యాపారులు అధిక ధరలను సామాన్య ప్రజలపై రుద్ది పబ్బం గడుపుకుంటున్నారు. ఎ ఒక్క కూరగాయల దుకాణంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక కానీ అధికారుల అజమాయిషీ కానీ లేకపోవడంతో వ్యాపారుల దందా మూడు కూరలు ఆరు కాయలు చందంగా సాగుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలను అధిక ధరలతో ఆంధ్ర వ్యాపారులు అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వినియోగదారుల కు వ్యాపారుల నుండి సరైన సమాధానం కొరవడుతుంది. పెరిగిన కూరగాయల ధరలతో వినియోగదారులు బొంబే లు ఎత్తుతున్నారు.

మార్కెటింగ్ శాఖ లోపం వినియోగదారులకు శాపం….

మణుగూరు కూరగాయల మార్కెట్ దందాను పర్యవేక్షించి చర్యలు చేపట్టాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు కూరగాయల మార్కెట్ ల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం మ వుతున్నాయి. ఆంధ్ర వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ప్రతి దుకాణం నుండి నెలవారీ మమ్ముళ్లను భారీ మొత్తంలో ఒక నేత ద్వారా వసూలు చేసి మార్కెటింగ్ శాఖ అధికారులకు ముట్టజెప్పడంతో అధికారులు మణుగూరు కూరగాయ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుకు దుకాణ దారుల మమ్ముళ్ళకు అలవాటు పడి మార్కెటును పర్యవేక్షించడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు మరోవైపు కూరగాయల ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కూరగాయలు కొందామన్నా ధరల మోతతో వినియోగదారులు వెనుకంజ వేసి పావు కిలో అరకిలో కొని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో టమాటా కిలో ధర గత వారం 65 ఉండగా చుక్కుడు బీన్సు 50 రూపాయలు, సొరకాయ 50, వంకాయ 35 దోసకాయ 20, రూపాయలు ఉండగా గత పది రోజుల నుండి అమాంతంగా కూరగాయల ధరలను రెండు ఇంతలుగా పెంచిన వ్యాపారులు వినియోగదారులపై ధరల పంజా విసురుతున్నారు. వ్యాపారులు తమ వ్యాపార పటిమతో ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో దుకాణాలను ఏర్పాటు చేసుకొని తాము చెప్పిందే ధర అనే రీతిలో వ్యవహరిస్తూ ఒక మనిషికి ఒక్కో రేటు తో కూరగాయలను అంటగడుతూ అడ్డంగా దోచుకుంటున్నారు. బడా వ్యాపారుల ధరలను చిరు వ్యాపారుల ధరలతో పోల్చిచూస్తే ఏకంగా ఒక్కో కిలో కు రూ పది రూపాయల నుండి 30 రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తుంది. ధరలను నియంత్రించి చర్యలు చేపట్టాల్సిన మార్కెటింగ్ అధికారులు ఏమైపోయారని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.

కూరగాయల సాగు రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ…?

బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న మండలంలోని సాంబయి గూడెం, విజయనగరం రామానుజవరం, దమ్మక్కపేట గ్రామాల్లో కూరగాయ, ఆకుకూరల సాగు గణనీయంగా సాగు అవుతుంది. రైతులు తమకు ఉన్న భూమిలో కూరగాయల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూరగాయల సాగును ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. ఆరుగాలం శ్రమించి కూరగాయలు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు.మణుగూరు పట్టణంలో రైతు బజార్ లేకపోవడం,గిట్టుబాటు ధర లేక కూరగాయలను మార్కెట్ లోని వ్యాపారులకు ఎంతోకొంత రేటుకు అన్నదాతలుఅమ్ము కోవలసిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు ప్రలోభాలతో కూరగాయ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అధికంగా ఉన్న కూరగాయల సాగు ఆకుకూరలు పండించిన తమకు మాత్రం మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలకు తోడు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అధికమై సాగు ఖర్చు పెరగడం చిరు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.మేమింతే మారమంతే అనే రీతిలో ధరల దందా సాగిస్తున్న వ్యాపార దందా కు అడ్డుకట్ట వేసి మణుగూరు కూరగాయల మార్కెట్లో వినియోగదారులను ధరల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి ధరలను నియంత్రించాలని సామాన్య మధ్య తరగతి ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

also read ;-గౌడ కులస్తుల సేవలను కొనియాడిన హీరో సుమన్…