Telugu News

రామదాసుడికే వైరా సీటు..?

టెన్షన్ పెడుతున్న వైరా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక

0

రామదాసుడికే వైరా సీటు..?

== టెన్షన్ పెడుతున్న వైరా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక

== రేసులు ‘ఆ నలుగురు’

== పార్టీ కోసం పనిచేసిన భట్టి దాసుడు

== నాకే వస్తుందంటున్న బాలాజీ నాయక్

== పొంగులేటి పై ధీమాగా గిరిజన బిడ్డ

== రేణుక ఆశీస్సులతో రామూర్తి

== కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ శ్రేణులు

== టిక్కెట్ వస్తే గెలుపు తథ్యమంటున్న వైరా ప్రజలు

== సర్వేలన్ని ఆయన వైపై..?

== ఇంతకు ఆయనేవ్వరు..?

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది.. అతి కొద్ది రోజుల్లోనే టిక్కెట్ల ప్రకటన ఉంటుందని అనుకుంటున్న తరుణంలో హస్తం పార్టీలో ఆయోమయం ఏర్పడింది.. కాంగ్రెస్ పార్టీ రేసులో ఆ నలుగురు ఉండగా, అందులో ఎవరికి టిక్కెట్ వస్తుందనే ఉత్కంఠ వైరా నియోజకవర్గ శ్రేణుల్లో కలవరపెడుతోంది.. ఒక్కోక్కరు ఒక్కో నాయకుడికి దాసులై   పట్టువీడకుండా పైటింగ్ చేస్తున్న నేపథ్యంలో  టిక్కెట్ పోరులో నెగ్గేదేవ్వరు..? తగ్గేదేవ్వరు..? వైరా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ‘విజయం’ పత్రిక ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం ఇది…

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

గిరిజన నియోజకవర్గం.. ఖమ్మం జిల్లా కేంద్రానికి కూసింత దూరంలో ఉంటూ అభివద్ది వైపు అడుగులేసిన నియోజకవర్గం వైరా నియోజవర్గం.. అన్ని సామాజిక వర్గాలకు నిలయమైన వైరా నియోజకవర్గంలో విచిత్ర రాజకీయ ఫలితాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది..  2009లో ఢిలిమిటేషన్  సందర్భంగా ఖమ్మం నుంచి విడిపోయి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన ఈ నియోజకవర్గం అనేక రాజకీయ మార్పులకు నిలయంగా మారింది.. నియోజకవర్గ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే , మూడు సార్లు కూడా విచిత్రమైన ఫలితాలు నిలయంగా మారింది..

allso read- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి 

మొదటిగా సీపీఐ పార్టికి స్థానమిచ్చిన వైరా నియోజకవర్గ ప్రజలు, ఆ తరువాత వైసీపీ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిని గెలిపించిన వైరా ప్రజలు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తారో..? అనేది సస్పెన్షన్ గా మారింది.. జాతీయ పార్టీలని, అగ్ర పార్టీలని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ  పార్టీలు వైరాలో స్థానం సాధించలేకపోయాయి.. రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీల అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉండగా వైరా ప్రజలు ఏ పార్టీకి పట్టం గడతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..

== కాంగ్రెస్ బరిలో నిలుస్తుందా..?

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే చెప్పాలి.. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు..2009లో మహాకూటమి పేరుతో టీడీపీ,సీపీఎం,సీపీఐ పార్టీలు బలపర్చిన సీపీఐ అభ్యర్థిగా బానోతు చంద్రావతి, కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ పై విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్,టీడీపీ పొత్తుల్లో భాగంగా టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు. అప్పుడు బానోతు బాలాజీ పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థి మదన్ లాల్ విజయం సాధించారు. హస్తం గుర్తు  లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తుల్లో భాగంగా సీపీఐ పార్టీకి అవకాశం కల్పించగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్ విజయం సాధించారు.

allso read- కేటీఆర్  నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి

కాంగ్రెస్ పార్టీ రాములు నాయక్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. అయితే ఈ సారి కూడా వైరా నియోజకవర్గాన్ని సీపీఐ పార్టీ కోరుకుంటుంది. కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పొత్తు కుదిరితే వైరాను సీపీఐకి కేటాయించాలని అడుగుతున్నారు.  కానీ ఈ సారి కచ్చితంగా కాంగ్రెస్ బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ స్వంత నియోజకవర్గం అది. అందుకే వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించేందుకు భట్టి విక్రమార్క పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.  

== వైరా కాంగ్రెస్ రేసులో ‘ఆ నలుగురు’

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు భారీగానే ఉన్నారు. మొత్తం 15మంది దరఖాస్తు చేసుకోగా అందులో మాలోతు రాందాసునాయక్, పాలకుర్తి నాగేశ్వరరావు, బానోతు బాబు, బానోతు బాలాజీ నాయక్, ధరావత్ రామూర్తి నాయక్, బానోతు సైదేశ్వరరావు, లకావత్ చందర్ నాయక్, బండ రాంబాబు, అంగోతు శ్రీమన్నారాయణ, బానోతు విజయ బాయి, డుంగ్రోతు వెంకటేశ్వరావు, కుటాడి కుమార్, లకావత్ సైదులు, భూక్యా బిక్షపతి రాథోడులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ  ప్రధానంగా ‘ఆ నలుగురే’  అభ్యర్థి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.. మాలోతు రాందాసునాయక్, బానోతు బాలాజీ నాయక్, బానోతు విజయబాయి, ధరావాత్ రామూర్తి నాయక్ లు రేసులో ఉన్నారు. అయితే ఈ నలుగురికి వారి వారి అభిమాన నాయకులు అండగా నిలుస్తున్నారు. మాలోతు రాందాసు నాయక్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభయం ఇస్తుండగా, బాలాజీ నాయక్ కూడా భట్టి విక్రమార్కను నమ్ముకుని ఉన్నారు.

allso read- ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?

అయితే బాలాజీ నాయక్ కు రేవంత్ రెడ్డితో సంబందాలు ఉన్నట్లుగా, ఆయనతో కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఇక బానోతు విజయబాయి కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలు మెండుగా ఉన్నాయి. గతంలోనే ఆయన వైరాకు అభ్యర్థిగా విజయబాయిని పొంగులేటి ప్రకటించిన సంగతి తెలిసింది. రామూర్తి నాయక్ కు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి సంపూర్ణ అభయం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నలుగురిలో ఎవరు.. కాంగ్రెస్ అభ్యర్థి..??

== దాసుడికే పట్టం కడతారా..?

వైరా నియోజకవర్గంలో గత పదేళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక లీడర్ మాలోతు రాందాసు నాయక్. భట్టి విక్రమార్కకు భక్తదాసుడిగా  రామదాసు  పనిచేస్తూ 

భట్టి విక్రమార్క కార్యక్రమాలతో పాటు వైరా నియోజవర్గంలో, జిల్లాలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలకు డబ్బులను ఖర్చు చేస్తూ నడిపించారు. ప్రజలందరికి దగ్గరగా ఉంటూ కార్యకర్తలకు భరోసానిస్తూ వస్తున్నారు. దీంతో రాందాసును  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దాసుడు అని ఖమ్మం జిల్లాలో పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు పీసీసీ సభ్యుడిగా, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కమిటీ కూడా రాందాసుకు సంపూర్ణ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ కచ్చితంగా వస్తుంది..నీ పని చేసుకో అంటూ భట్టి విక్రమార్క అనేక మార్లు చెప్పినట్లు సమాచారం. అందుకే విక్రమార్కుడి దాసుడికే టిక్కెట్ ఖాయమంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది..

allso read- మీమ్మల్ని బిచ్చగాళ్లను చేయలేను:తుమ్మల

అయితే రాందాసు నాయక్ ముక్కుసూటి   మనిషి అని అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు. డబ్బులు పెట్టే విషయంలో మట్టుగా వ్యవహరిస్తారని, సహాయం చేసే విషయంలో చిల్లరగా చూస్తారని అనుకుంటున్నారు. ఇదిలా  ఉంటే బానోతు బాలాజీ నాయక్ కూడా తనకే టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటున్న ఆయనకు టిక్కెట్ కచ్చితంగా ఇస్తానని మాటిచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రచార వాహనాలను కూడా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.. అంతే కాకుండా ఇంటింటా సోనియమ్మ చీరే..సారే అంటూ చీరెలను పంపిణి చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా నాయకత్వంలోని కొందరు నాయకులు బాలాజీకి సపోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక బానోతు విజయబాయికి మాజీ ఎంపీ, ఎన్నికల ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలు ఉన్నట్లుగా, ఆయన ఆమె కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాలు విజయబాయికి టిక్కెట్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే కేంద్రమాజీ మంత్రి రేణుక చౌదరి బలంగా మద్దతు తెలిపే అభ్యర్థల్లో మట్టాదయానంద్, రామూర్తి నాయక్. వారి ఇద్దరికి టిక్కెట్ ఇవ్వాలని రేణుక చౌదరి బిగ్ పైట్ చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఏఐసీసీ అగ్రనాయకులందర్ని కలిసి రేణుక చౌదరి పట్టువీడని విక్రమార్కురాలుగా ప్రయత్నాలు 

చేస్తున్నారు. అయితే వీరందరిలో ఎక్కువగా రాందాసు నాయక్ కు అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..

 ==  సర్వేలో దాసుడికే అవకాశం..?

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు 75శాతం కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ లో ఎవరు అభ్యర్థి అయితే గెలుస్తారానే ప్రశ్నకు రాందాసు నాయక్ కు 41శాతం, బాలాజీ నాయక్ కు 29శాతం, విజయబాయికి 18శాతం, రామూర్తి నాయక్ కు 12శాతం వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే భట్టి విక్రమార్క చేయించిన సర్వేలో కూడా రాందాసు నాయక్ కు 35శాతం, బాలాజీకి 29శాతం, విజయబాయికి 16శాతం, రామూర్తి నాయక్ కు 20శాతం రాగా, బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలో రాందాసు నాయక్  38శాతం, బాలాజీకి 30 శాతం, రామూర్తి నాయక్ కు 17 శాతం, విజయబాయికి 15శాతం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సర్వే ప్రకారం టిక్కెట్ ఇస్తే రాందాసు నాయక్ కు టిక్కెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. లేదంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా టిక్కెట్లు కేటాయిస్తే బాలాజీ నాయక్ కు, పొంగులేటి ప్రభావం కొనసాగితే విజయబాయికి, రేణుక మంత్రం అమలైతే రామూర్తి నాయక్ కు టిక్కెట్ వచ్చే అవకాశాలు లేకపోలేదు..

== కన్య్పూజన్ లో పార్టీ శ్రేణులు

వైరా నియోజకవర్గంలో 15మంది అశావాహులు కాంగ్రెస్ పార్టీ తరుపునా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఆ నలుగురు ప్రచారంలో దూకుడుపెంచారు. దీంతో ఎవరికి టిక్కెట్ వస్తుందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది.. కాగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరి వైపు తిరగాలో అర్థం గాకా కన్ప్యూజన్ లో ఉన్నారు. ఎవరి వైపు తిరిగితే ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి  వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, టిక్కెట్ ఎవరికి వచ్చిన కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తారో..? నెగ్గేదేవ్వరో..? తగ్గేదేవ్వరో..? కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..?