Telugu News

కేసీఆర్ తప్పిదం వల్లనే ప్రజలకు నీటికష్టాలు: పొంగులేటి 

బీఆర్ఎస్, బీజేపీ లకు ఈసారి బుద్ధి చెప్పాలి

0

కేసీఆర్ తప్పిదం వల్లనే ప్రజలకు నీటికష్టాలు: పొంగులేటి 

== గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా ఇంకా తీరు మారలే..
== రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి
== బీఆర్ఎస్, బీజేపీ లకు ఈసారి బుద్ధి చెప్పాలి
== ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

== కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ.. ముమ్మర ప్రచారం

(చింతకాని/ముదిగొండ-విజయం న్యూస్):

నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పిదాలతోనే నేడు సామాన్య ప్రజలు, రైతులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మధిర నియోజకవర్గం లోని చింతకాని, ముదిగొండ మండల కేంద్రాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయని ఆయన అంటున్నారని.. రైతులకు ఇబ్బంది వచ్చింది అని కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం కుంగి పోయి నీళ్ళన్నీ కిందకు పోయాయనీ తెలిపారు. 39 వేల కోట్లు ఖర్చుపెట్టి మిషన్ భగీరథ చేపట్టారని, నీటి నిల్వ కు భిన్నంగా పనులు జరిగి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నీళ్లు రాకుండా చేసింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. తెలంగాణా లో మంచినీరు, కరెంటు, రైతు రుణమాఫీ ఇవ్వాలనేది తమ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు.
*మోదీకి విదేశాలు తప్ప ప్రజలు అక్కర్లేదు..*
గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని పాలించిన ప్రధాని మోదీ తరచూ విదేశాలు తిరిగి ప్రజల కష్టాలు మర్చిపోయారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీలేదనీ తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఏ ఒక్కటీ నెరవేర్చలేదనీ అన్నారు. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీపై ఆయన అవాకులు చెవాకులు పేలుతున్నారనీ.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నాడనీ, ప్రజలు అలా జరగబోనివ్వరని తెలిపారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
*మా ప్రాజెక్టులతోనే కేసీఆర్ కరెంట్ ఇచ్చాడు..: భట్టి*
కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు ఉండదని చెపుతున్నారనీ, కేసీఆర్ పదేళ్లు పాలన చేసినప్పుడు కూడా ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు లతోనే కరెంటు ఇచ్చాడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్ర సంపద ప్రజలకే పంచాలని ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల అనంతరం ఇందిరమ్మ ఇళ్ల కోసం నిధులు మంజూరు చేస్తాం అని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అందరూ.. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. *ఈ కార్యక్రమాల్లో..* రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.