Telugu News

మేమే నెంబర్ వన్: సీఎం కేసీఆర్

మత విద్వేషాలతో దేశ భవిష్యత్ సంగతేంటి..?

0

మేమే నెంబర్ వన్: సీఎం కేసీఆర్

== మత విద్వేషాలతో దేశ భవిష్యత్ సంగతేంటి..?

== నీటి కోసం ఎన్నళ్లు  ఈ కోట్లాట

== లక్షల టీఎంసీల నీటిని సముద్రపాలవుతుంటే కేంద్రం ఏం చేస్తోంది

== దేశ ప్రధాని స్వరాష్ట్రంలోనే 24గంటల కరెంట్ లేదు

== 24గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ

== దద్దమ్మ పరిపాలనతో దేశ భవిష్యత్ వినాశనమైంది

== ఎన్నికల్లో ప్రజలు గెలవాలి..ప్రజలను గెలిపించాలి

== ప్రగతిశీల విధానాలేక్కడ..?

== ఆశాంతి చోటుచేసుకుంటే అభివద్ది ఎట్లుంటది

== కేంద్రంపై మండిపడిన సీఎం కేసీఆర్

== తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజలు కడుపులో దాచుకున్నరన్న సీఎం

== భద్రాద్రికొత్తగూడెంలో నూతన కలెక్టర్ భవనం, పార్టీ కార్యాలయంను ప్రారంభించిన సీఎం కేసీఆర్

(భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

భారతదేశంలో అభివృద్ది విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. ముందుగా హెలికాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు జిల్లా నేతలు, అధికారులు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి: భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి 

అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొబ్బరికాయ కొట్టి జిల్లా కలెక్టర్ ఛాంబర్ ను సీఎం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ సీఎం కేసీఆర్ కి దేవతాప్రతిమను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, కవితా నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూధన్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, బాల్క సుమన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పూల రవిందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రాజేందర్, డిసిసిబి చైర్మన్ కె.నాగభూషణం, కలెక్టర్ అనుదీప్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్ధాల సుధాకర్ తేజ  తదితరులు పాల్గొన్నారు.

== బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం :

బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కి పండితులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. బిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును సీట్లో కూర్చోబెట్టి సీఎం ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి : అందరి చూపు ఆయన వైపే

అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో.. ఆయన మాట్లల్లో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఈ రోజు రాష్ట్రంలోనే అత్యద్భుతమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించుకున్నందుకు యావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను, అధికారులను అభినందిస్తున్నాను. ప్రజలకు మేలు చేసే పవిత్రమైన దేవాలయంలాగా ఈ కార్యాలయం పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భద్ర్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. ఇక్కడే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. ఇంకా చాలా చాలా వచ్చాయి. భవిష్యత్ లో ఇంకా వస్తాయి.సింగరేణి కొత్తగూడెం నుండే విస్తరించి ఈ రోజు అద్భుత ఆదాయ వనరుగా, ఉద్యోగాల వనరుగా సింగరేణి సిరుల కల్పవల్లిగా మన తెలంగాణ కొంగుబంగారంగా నిలిచిన గడ్డ మన కొత్తగూడెం ఇల్లందు గడ్డ. భద్రాద్రి కొత్తగూడెం ప్రజాచైతన్యం ఉన్న జిల్లా. కమ్యూనిస్టు విప్లవభావాలతో అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ, అద్భుతమైన ప్రగతిశీల కార్యక్రమాలను ఈ ప్రాంతం చేపట్టింది.నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు నన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడితే ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి కడుపులో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాద బలం, ఐక్య పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది ఏడున్నర ఎనిమిదేండ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక, పొంతన లేదు ఆనాడు మన తలసరి ఆదాయం రూ.87 వేలు, ఈనాడు మన తలసరి ఆదాయం రూ.2.78లక్షలు. ఆనాడు మన జీఎస్డీపి కేవలం 5 లక్షల కోట్ల రూపాయలు.

ఇది కూడా చదవండి: ‘ఖమ్మం’ పై నేతల పోకస్

ఈనాడు మన జీఎస్డీపి రూ.11.5 లక్షల కోట్లు. భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ. 33 జిల్లాల్లో జిల్లా పరిపాలన కేంద్రాలతో పాటు మెడికల్ కాలేజీలను కూడా మంజూరు చేసుకున్నాం. అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది.కులాలు, మతాలు, వర్గాలకు భిన్నంగా సమాజాన్ని దేవాలయంగా భావించి అందరి సంక్షేమాన్ని కాంక్షించి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.కేసీఆర్ కిట్ ను పేదింటి మహిళల క్షేమాన్ని కాంక్షించి పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నాం. ప్రజల నుండి డిమాండ్లు లేకపోయినా అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

== అన్ని రంగాల్లో దూసుకపోతున్నం రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కాళేశ్వరం పూర్తి చేసుకోవడంతో పాటు, ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఇంచుకు నీరు వచ్చే విధంగా సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నాం. ఇది పూర్తయితే ఖమ్మం జిల్లా యావత్తు సస్యశ్యామలమవుతుంది. భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే 37 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో సముద్రాన్ని తలపించే విధంగా సీతమ్మవారి ఆనకట్ట కట్టుకుంటున్నాం. మిషన్ భగీరథతో ప్రతీ గ్రామానికి, తండాకు, కోయగూడానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేవరకు ఏదో రకంగా సహాయం అందే విధంగా కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎంఆర్ఎఫ్ కింద ఎమ్మెల్యేల సహకారంతో పేదలకు సాయం అందుతున్నది.

== వనమాపై ప్రశంసల జల్లు

ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర్ రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కొత్తగూడెం పట్టణానికి ముర్రేడు వాగు వరద బాధను తొలిగించేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. వారం పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను.

ఇది కూడా చదవండి: పొంగులేటికి ఊహించని షాక్..?

వెంటనే ఆ నిధులు అందుబాటులోకి వస్తాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీకి రూ. 40 కోట్ల చొప్పున,  ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల చొప్పున ప్రత్యేక ఫండ్ ను మంజూరు చేస్తున్నాం. త్వరలోనే ఈ నిధులను విడుదల చేస్తాం. ఇక్కడి మైనింగ్ ఇన్సిట్యూట్ ను ఇంజనీరింగ్ కాలేజీగా ప్రకటించారు. ఇది సమగ్రంగా లేదు. దీన్ని పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కాలేజీగా అభివృద్ధి చేస్తాం.

== జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తాం: సీఎం

అంతకుముందు ఇండ్ల స్థలాల మంజూరులో స్థలాలు రాని జర్నలిస్టులకు సింగరేణి స్థలంలో కేటాయించేందుకు త్వరలో కార్యాచరణ చేపడతాం. ఒక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే కాదు అంతట జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

== దేశంలోనే బెస్ట్ జీఎస్డీపీ తెలంగాణలోనే

ఎనిమిదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర జీఎస్డీపిని రూ.5 లక్షల కోట్ల నుండి రూ.11.5 లక్షల కోట్లలకు పెంచుకున్నాం. అదే సమయంలో కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి పార్టీ అనుసరించిన అసంబద్ధ, దుర్మార్గపూరిత విధానాల వల్ల మనకంటే గొప్పగా కాదు కనీసం మన స్థాయిలో పనిచేసినా మన రాష్ట్ర జీఎస్డీపి రూ.14.50 లక్షల కోట్లుండేది. అంటే ఒక్క మన తెలంగాణ రాష్ట్రమే రూ.3 లక్షల కోట్లు కోల్పోయింది. ఒక రాష్ట్రమే ఇంత కోల్పోతే మిగతా దేశమంత ఎంత నష్టపోయుంటుంది. అదే మాట నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. ప్రజలు దీని పై ఆలోచన చేయాలి.

== దేశంలో విద్వేషం రగిలిస్తే                                   ఇది కూడా చదవండి: పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కేంద్రం ప్రజలను విడదీసి, మతచిచ్చు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే ఆ విషవృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి.? జాతి జీవనాడి కలుషితం కాదా? దేశంలో తాలిబన్ సంస్కృతి రాజ్యమేలితే పెట్టుబడులు వస్తాయా..? ఉద్యోగాలు ఉంటాయా…? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటాయా..? అశాంతిని రాజేస్తే కర్ఫ్యూలు, లాఠీఛార్జీలు, ఫైరింగ్ ల్లాంటి వాతావరణం ఉంటే సమాజం ఎంత భ్రష్టుపట్టపోతుంది.? ఇదంతా మీరు గమనిస్తూనే ఉన్నారు.

== నేను మీతో విన్నవించేదేంటంటే ….

దయచేసి మీరు మీ మీ ఇండ్లకు, బస్తీలకు, గ్రామాలకు వెళ్ళిన తర్వాత పెద్దలతోని 10 నిమిషాలు ఈ విషయం పై చర్చ పెట్టమని నేను కోరుతున్నాను. మీరు ఇలా చేస్తే ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టుగా చైతన్యం వెల్లివిరిసి దేశానికి మేలు జరుగుతుంది.తెలంగాణ మంచిగున్నది అనుకుంటే సరిపోదు. దేశం మొత్తం బాగుంటేనే మనం కూడా బాగుంటాం.దేశ పురోభివృద్ధిలోనే మన పురోభివృద్ధి కూడా ఉంటుంది.

== ఎందుకు ఈ కోట్లాట..?

ఈ దేశంలో రాష్ట్రాల మధ్య నీటియుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుకు ఈ కొట్లాట ? నీళ్ళు లేకనా ? ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయానుకూల భూమి ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం. భౌగోళికంగా మనకంటే పెద్ద దేశమైన అమెరికాలో వ్యవసాయానుకూల భూమి 29 శాతమే, చైనాలో 16 శాతమే ఉంది. భారత భూభాగాన్ని ఎకరాల్లో కొలిస్తే 83 కోట్ల ఎకరాలుంటుంది. దీంట్లో 41 కోట్ల ఎకరాలు అద్భుతమైన పంట పండే భూములున్నాయి. భారతదేశంలో అద్భుతమైన మూడు రకాల ఆగ్రో క్లైమేటిక్ వాతావరణ పరిస్థితులున్నాయి. మనకు అద్భుతమైన సూర్యకాంతి, అద్భుతమైన జలసంపద మాత్రమే కాక 139 కోట్ల మానవ సంపద (జనాభా) ఉంది.  మనదేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షం కురిస్తే అందులో 70 వేల టిఎంసీలు ఆవిరైపోతే, మిగతా 70 వేల టిఎంసిలు నదుల్లో కలుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

మనదేశంలో ఇప్పటిదాకా వాడుతున్నది కేవలం 20 వేల టిఎంసిలు మాత్రమే. మిగిలిన 50 వేల టిఎంసిలు సముద్రంపాలవతున్నాయి. మరి నీటి యుద్ధాలు ఏ కారణం చేత జరుగుతున్నాయి ? దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చెత్త వాటర్ పాలసీల వల్ల రాష్ట్రాలకు తగవులు పెట్టి నాటి కాంగ్రెస్ నుండి నేటి బిజెపి వరకు ఎవరు పరిపాలించినా ఇదే మాదిరి ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదాలను పరిష్కరిచేందుకు 2004 లో ట్రిబ్యునల్ వేసిన్రు. ఈ రోజు వరకు అతీ గతీ లేదు.ఈనాటికి దేశ రాజధాని ఢిల్లీలో సరైన పద్ధతిలో నీళ్ళు రావు, కరెంటు ఉండదు. ఇది తేలిగ్గా తీసిపారేయాల్సిన విషయం కాదు. ముఖ్యంగా యువకులు, విద్యాధికులు, దేశాన్ని రక్షించుకునేందుకే ఖమ్మం నుంచే శంఖారావం : సీఎం కేసీఆర్‌

దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచి శంఖారావాన్ని పూరించనున్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వాటర్‌ పాలసీతో రాష్ట్రాలు జట్లు పట్టుకుంటున్నాయని విమర్శించారు. ‘చేబితే ప్రపంచముందు సిగ్గుపోతుంది.దేశ రాజధాని ఢిల్లీలో మంచినీళ్లు రావు. కరెంటు రాదు. ఉపన్యాసాలు వింటే టీవీలు బద్ధలైతయ్‌. రైతులు, విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఆలోచించాలి. దేశంలో స్థాపిత 4.10లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉంది. దేశ ఏ ఒక్క రోజు 2.10లక్షల మెగావాట్లకు మించి వాడలేదు.

ఇది కూడా చదవండి: పాలేరులో కందాళ గెలుపు ఆపగలరా..?: మంత్రి వేముల

తెలంగాణలో తప్పా భారతదేశంలో ఏయే రాష్ట్రంలో, ప్రధాని సొంత రాష్ట్రం సహా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీరు ఇవ్వరు.. సాగునీరివ్వరు.. కరెంటు ఇవ్వరు.. ఉద్యోగాలు ఇవ్వరు.. ఉపన్యాసాలు వినాలా? ఎన్ని రోజులు వినాలి?’ అని నిలదీశారు. మంచినీళ్ళు, కరెంటు, సాగునీరు, ఉద్యోగాలు ఏదీ ఇవ్వరు. మరేం ఇస్తారు ? ఉపన్యాసాలే ఇస్తరా ?ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. నాయకులు గెలుస్తున్నారు. ఇది సరైన పంథా కాదు.  ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. పార్టీలు కాదు. ప్రజలకు పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే వరకు నిలబెట్టి, నిలదీసే ప్రజాస్వామ్య ప్రక్రియ రానంతవరకు ఈ దేశంలో ఇదే సొల్లు పురాణాలు, ఇదే కాలక్షేపం చూస్తాం తప్ప న్యాయం జరగదు. రాబోయే రోజుల్లో మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే చైతన్యమున్న తెలంగాణ రాష్ట్రం నుంచే విజ్ఞాన వీచికలు భారతదేశమంతా ప్రసారం కావాలె. అందుకే ఈ నెల18వ తేదీన చాలా మంది పెద్దలతో పాటు భారీ బహిరంగ సభను చేపట్టనున్నాం. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని నేను కోరుతున్నాను. మీ అందరి దీవెనతో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో కుల,మత,వర్ణ,వర్గ రహితంగా మౌలిక వసతుల కల్పన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామో అదే విధంగా అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు సాగుతాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం శాసనసభ్యుల నుంచి వచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తాం.

== కేసిఆర్ నోట ఎన్.టీ. రామారావు మాట

తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నామస్మరణను తరుచుగా కేసిఆర్ చేస్తుంటారు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభ సభలోనూ కేసిఆర్ వారి మాటలను ప్రస్తావించారు. నాడు  ప్రజాజీవితంలో ఎన్ టీ రామారావు ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు’ గా భావించి ముందుకు సాగారు అదే రీతిలో తను కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ‘సమాజమే దేవాలయం’ గా భావిస్తున్నట్టు కేసిఆర్ చెప్పుకొచ్చారు. దీంతో నాడు అన్న ఎన్. టీ రామారావు  నినాదాన్ని కేసిఆర్ మరో సారి గుర్తుచేశారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ గురువు ఎన్ టీ రామారావు గారిని కేసిఆర్ అనునిత్యం తలుస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొంటున్నారు