Telugu News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం: కేటీఆర్ 

ఖమ్మం పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్ కుమార్, రాకేష్ రెడ్డి

0

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం: కేటీఆర్ 

❇️ పట్టం గట్టండి.. గళమెత్తి గర్జిస్తారు..

❇️ విద్యావంతులు నిర్లిప్తంగా ఉంటే సమాజానికి పెను ప్రమాదం

❇️ ఆరు నెలల్లో ఏమి జరిగిందో ఆలోచించండి

❇️ ప్రశ్నించే గొంతుకను ఆశీర్వదించండి

👉 ఖమ్మం పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్ కుమార్, రాకేష్ రెడ్డి

(ఖమ్మం -విజయం న్యూస్)

అబద్ధాల కాంగ్రెస్ మోసాలపైన, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన గళమెత్తి, కొట్లాడే సత్తా ఉన్న ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పట్టభద్రుల కు పిలుపునిచ్చారు. రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్ బీ ఐ టీ కాలేజ్ లో సోమవారం పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అమెరికాలో లక్షల ఉద్యోగాన్ని వదులుకొని మీలో ఒకడిగా మీ ముందుకు వచ్చిన రాకేష్ రెడ్డి కి సంఘీభావం తెలిపి, సంపూర్ణ మద్దతు తెలపాలని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి , ప్రజల్ని గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి, ఇచ్చిన హామీలు, హక్కులు సాధించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలన్నారు. ప్రజాస్వామ్య o పరిఢవిల్లాలన్నా.. వర్ధిల్లాలన్నా …విద్యావంతుల గళాన్ని వినిపించాలన్నా రాకేష్ లాంటి రైతు బిడ్డ , వివేకవంతుడు శాసన మండలి లో ఉండాలన్నారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న తరుణంలో ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించాలని అన్నారు. మళ్లీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పొరపాటు చేస్తే ఎంతో గోస పడతామని అన్నారు. ఆరు నెలల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే రాకేష్ రెడ్డికి పట్టం గట్టాలన్నారు. లేకుంటే అభయహస్తం భస్మాసుర హస్తమై కాటేస్తుందని అన్నారు. ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకునే వ్యక్తి కావాలా ? రైతు కుటుంబం నుంచి ప్రజా సేవ. కోసం వచ్చిన రాకేష్ రెడ్డి కావాలో తేల్చుకోవాలన్నారు.తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రానికి తరలిలిపోతున్నాయని అన్నారు. ఉద్యోగాలు కావాలన్నా…జాబ్ నోటిఫికేషన్లు కావాలన్నా..ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు గురించి నిలదీయాలంటే రాకేష్ రెడ్డి ని దీవించాలన్నారు. విద్యావంతుల్లో నిర్లిప్తత, ఉదాసీనత ఉంటే సమాజం ప్రమాదంలో పడుతుందని అన్నారు. నామ నాగేశ్వరరావు మంచి మెజార్టీతో గెలిసి ఎంపీ గా మళ్లీ పార్లమెంట్ కు వెళతారన్న విశ్వాసం, నమ్మకం తనకు ఉందన్నారు.
ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ అందరి సమస్యలు తెలిసిన రాకేష్ రెడ్డిని దీవించి, మండలికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా పట్టభద్రులు చారిత్రాత్మక మైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆలోచించి తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల పక్షాన ఉండి గర్జించి, గళమెత్తి పని చేస్తానన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించే గొంతు కావాలో… మంత్రులను ప్రశంచించే వ్యక్తి కావాలో పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తనను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి లో నేను సైతం తోడుగా నిలుస్తామని చెప్పారు. జిల్లా ప్రజల గౌరవం పెంచేలా పని చేస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడుతానని , గళమెత్తి కొట్లాడతానని అన్నారు. తాను రైతు బిడ్డనని, కష్టమంటే ఏమిటో తెలిసిన వాడినని, లక్షల ఉద్యోగం వదులుకొని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రజలతో మమేకమయ్యేందుకు వచ్చానని చెప్పారు. విద్యావంతుడినని కేసీఆర్ ఆశీర్వదించి పంపారని, ఆలోచించాలని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల, వివిధ వర్గాల హక్కులు సాధనకు పోరాడుతానని చెప్పారు. గెలిపిస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా , వచ్చిన జీతం, సొమ్ముతో నిరుద్యోగుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, వారి సంక్షేమం కోసం పని చేస్తానని వెల్లడించారు.పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే లు పల్లా రాజేశ్వర రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, మదన్ లాల్, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.