Telugu News

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తాం: పొంగులేటి

రెండో రోజు ముమ్మరంగా కొనసాగిన ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమం

0

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తాం: పొంగులేటి

== సంక్షేమ పథకాల అమలులో రాజీ పడం
== తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తాం
==  పాలేరు నియోజకవర్గ ప్రజల రుణo తీర్చుకుంటా
== రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి
== రెండో రోజు ముమ్మరంగా కొనసాగిన ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమం

(నేలకొండపల్లి-విజయం న్యూస్):

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం, ముజ్జు గూడెం, అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి గ్రామాల్లో ప్రజలతో సమావేశమై.. స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు, రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులతో మాట్లాడి.. ప్రధానంగా చేపట్టాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కక్షపూరితంగా చాలా పనులు ఆపేశారని, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాల అవసరం ఉందని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన స్పందించి.. ఎన్నికల కోడ్ ముగిశాక ఆయా పనుల నిర్వహణకు సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల చల్లని దీవెనలతో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయాన్ని అందించారని, రాష్ట్ర మంత్రిని అయ్యానని, పాలేరు నియోజకవర్గం తనకు సొంతూరు లాంటిదని.. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి రుణం తీర్చుకుంటానని అన్నారు.
*నీటి ఎద్దడి రానీయం..*
నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రానీయకుండా.. పనులు చేయిస్తామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ పథకాల అమలులో రాజీ పడకుండా ముందుకెళతామని తెలిపారు.
*గత ప్రభుత్వంలో లాగా కాకుండా పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు*
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల గూడు.. గోడును పట్టించుకోలేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యంలో.. పైరవీలకు తావు లేకుండా అర్హులందరికీ గృహాలు కట్టిస్తామని అభయమిచ్చారు. ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని, పట్టాలు అందజేస్తామని తెలిపారు.రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో పేదలంతా పక్కా ఇళ్లలో ఉండాలనేదే తన లక్ష్యమని తెలిపారు.
*ప్రతి ఊరిలోనూ పథకాల ఫలాలు కనిపిస్తాయి..*
సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు.
*ప్రజలే నా బలం..*
తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటానని, వారే తన బలమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఎన్నికలు, ఉన్నా లేకపోయినా.. జనం బాగోగులు తెలుసుకుంటానని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా కక్షపూరిత రాజకీయాలు ఉండవని అన్నారు.