Telugu News

కూసుమంచిలో కొనుగోలు కేంద్రాలేవి..?

మండలంలో ప్రారంభంకానీ కొనుగోలు కేంద్రాలు

0

కూసుమంచిలో కొనుగోలు కేంద్రాలేవి..?

==  మండలంలో ప్రారంభంకానీ కొనుగోలు కేంద్రాలు

== ప్రైవేట్ వ్యాపారులను అశ్రయిస్తున్న రైతులు

== క్వింటాకు 2.50కేజీల తరుగుతో మోసపోతున్నట్లు చెబుతున్న రైతులు

== పట్టించుకుని అధికారులు

(కూసుమంచి-విజయంన్యూస్)

రైతులు పండించిన వరి ధాన్యంను మొత్తం కొనుగోలు చేస్తామని ఇక పక్క ప్రభుత్వం, మరో వైపు ప్రభుత్వాధికారులు చెబుతుంటే మరో పక్క మండలస్థాయి అధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుతున్నట్లు కనిపిస్తోంది.. అధికారుల పర్యవేక్షణ లోపమో..? నిర్లక్ష్యమో తెలియదు కానీ..? దీని ఫలితంగా కూసుమంచి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను అశ్రయిస్తున్నారు.. తద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని, రైతులను అదుకోవాలని కోరుతున్నారు.. అధికారులు పట్టించుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే

ఇది కూడా చదవంఢి: తెలంగాణ పై నరేంద్ర మోడీ కుట్రలు మానాలి: కూనంనేని 

కూసుమంచి మండలంలోని మొత్తం 41 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. అందులో సాగర్ కాలువకట్ట పరిధిలో సుమారు 25 పంచాయతీలున్నాయి… అయితే కూసుమంచి మండలంలో మొత్తం 22,797 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5,45,000 క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖాధికారిణి ఆర్.వాణి తెలిపారు. అందుకు గాను దిగుబడి వచ్చిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు మండలంలో మొత్తం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అందులో డీసీఎంఎస్ నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు, 01 ఐకేపీ కేంద్రం, 9 సోసైటీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు విభజన చేశారు. అయితే ఇప్పటి వరకు మండలంలో పాలేరులో ఐకేపీ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించగా, 6 కొనుగోలు కేంద్రాలను సోసైటీల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మరో మూడు ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డీసీఎంఎస్ కు కేటాయించిన కూసుమంచి, కొత్తూరు, నర్సింహులగూడెం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా ఈ మూడు పంచాయతీలు ఎన్ఎస్పీ పరిధిలో ఉండటం వల్ల పెద్ద ఎత్తున్న వరి సాగు జరుగుతోంది. మండలంలోనే మల్లాయిగూడెం, పెరికసింగారం, రాజుపేట, జక్కేపల్లి తరువాత అంత దిగుబడి వచ్చే గ్రామ పంచాయతీలు అవి. ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించగా, కొంత మంది రహదారులపై, ఖాళీ స్థలాల్లో పోసుకుని అరబోసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ధాన్యం తీసుకొచ్చి 20 రోజులవుతున్నప్పటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

== దండుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు

ఒక వైపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, మరో వైపు వాతావరణంలో మార్పులు వస్తూ చిరు జల్లులు కురుస్తుండగా, ఇంకో వైపు విఫరీతమైన మంచుపడుతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో రైతులు ప్రైవేట్ వ్యాపారులను అశ్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాలేరు లో పోటీ చేయడం ఖాయం : తుమ్మల 

కాగా ఇదే అసరగా చేసుకుంటున్న వ్యాపారులు క్వింటాకు 2.50 కేజీల చొప్పున తరుగు తీస్తుండగా, ధరను కూడా రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఒక వైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియకపోవడం, మరో వైపు వర్షం వచ్చే అవకాశం ఉండటంతో వచ్చినవరకే చాలు అని భావిస్తున్న రైతులు నష్టాలకు వరి ధాన్యంను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయాలు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.

== అధికారులు పట్టించుకోవడం లేదంటున్న రైతులు

ధాన్యం తీసుకొచ్చి 20 రోజులవుతుందని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను గత ఐదు రోజుల నుంచి వినతి చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయినప్పటికి మేమంటే మేము కాదని చెబుతూ కనీసం రైతుల గోడును పట్టించుకునే వారే కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికారులు స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరీ అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారా..? వేచి చూడాల్సిందే..?

== రైతుల గోడు పట్టించుకునే వారే లేరు: రాయల నాగేశ్వరరావు

కూసుమంచి మండల కేంద్రంతో పాటు ఎన్ఎస్పీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రైతులు ఇప్పటికే వందల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. సుమారు 20 రోజులు అవుతున్న ఆ ధాన్యం గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక పక్క ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చూసి ముమ్మరంగా ధాన్యం కొంటున్నామని చెబుతున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. తద్వారా రైతులు ప్రైవేట్ వ్యాపారులను సంప్రదిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.

== డీసీఎంఎస్ కు కేటాయించినవి మాత్రమే ప్రారంభించలేదు: ఏవో వాణి

కూసుమంచి మండలంలోని 41 పంచాయతీలకు మొత్తం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో 9 సోసైటీ పరిధిలో, 1 ఐకేపీ,3 డీసీఎంఎస్ శాఖలకు కేటాయించామని తెలిపారు. డీసీఎంఎస్ కు కేటాయించిన కేంద్రాలను ప్రారంభించలేదని, ఇప్పటికే చాలా సార్లు ఆశాఖాధికారులతో మాట్లాడటం జరిగిందని, త్వరలోనే వాటిన ఓపెన్ చేయించి రైతులు తీసుకొచ్చిన ధాన్యంను కొనుగోలు చేస్తామని తెలిపారు.