Telugu News

అసలేమిటీ 3 చట్టాలు?

రైతుల ఆందోళనకు కారణమైన ఆ మూడు సాగు చట్టాలేంటి?

0

అసలేమిటీ 3 చట్టాలు?

రైతుల ఆందోళనకు కారణమైన ఆ మూడు సాగు చట్టాలేంటి?

వాటిపై ఎందుకంతగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది?

1 రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020.

(తెలంగాణ – విజయంన్యూస్) :-

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్లకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను (దేశంలో ఎక్కడైనా సరే) అమ్ముకునేందుకు ఇది స్వేచ్ఛనిస్తుంది. అలా చేసే విక్రయాలపై రుసుములేవీ విధించకూడదని స్పష్టం చేస్తోంది. ప్రత్యామ్నాయ విక్రయ మార్గాలు అందుబాటులో ఉండటంతో.. నచ్చినచోట అధిక ధరకు రైతులు తమ పంటను అమ్ముకోవచ్చన్నది ప్రభుత్వ మాట.

వ్యతిరేకత ఎందుకంటే..
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థకు ఈ చట్టం ముగింపు పలుకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు కంపెనీలు తమను దోచుకునేందుకు ఇది ఉపకరిస్తుందనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2 ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం-2020
పండించబోయే పంట కొనుగోలుకు సంబంధించి వ్యాపార సంస్థలు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులతో రైతులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. పంట ధరను వారు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. మార్కెట్‌ ధరల్లో ఒడుదొడుకుల ప్రతికూల ప్రభావం అన్నదాతలపై పడకుండా ఇది రక్షణఛత్రంలా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

వ్యతిరేకత ఎందుకంటే..
కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా దీన్ని ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నది రైతుల వాదన. ధరలపై బేరమాడటంలో తమ శక్తిని ఇది బలహీనపరుస్తుందని  ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

3 నిత్యావసర సరకుల (సవరణ చట్టం)-2020
తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, ఉల్లి, బంగాళదుంప వంటి ఉత్పత్తులను నిత్యావసర సరకుల జాబితా నుంచి తొలగించాలని.. వాటి ఎగుమతులపై నిల్వ పరిమితి సంబంధిత ఆంక్షలు విధించకూడదని ఇది సూచిస్తోంది. యుద్ధం, కరవు, ప్రకృతి విపత్తులు, ధరల్లో అసాధారణ పెరుగుదల వంటివి తలెత్తినప్పుడే ఆ ఆంక్షలు విధించాలని పేర్కొంటోంది.

వ్యతిరేకత ఎందుకంటే..
సరకుల నిల్వపై పెద్ద పెద్ద కంపెనీలకు ఈ చట్టం పూర్తి స్వేచ్ఛనిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరల విషయంలో తమను శాసించే స్థాయికి అవి చేరుకుంటాయని ఆందోళన చెందుతున్నారు..

also read :- గర్జించిన 24 గంటలలోపే..